Fake notes: చేతులు మారుతున్న నకిలీ నోట్లు
ABN, First Publish Date - 2022-11-17T12:22:47+05:30
నకిలీ నోట్ల కట్టలు చేతులు మారుతున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే కొన్ని ప్రాంతాల్లో ఏజెంట్లను తయారు చేసుకుని
కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాలకు తరలింపు
అనంత’ పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
తీగలాగితే కదులుతున్న డొంక
బళ్లారి(బెంగళూరు) : నకిలీ నోట్ల కట్టలు చేతులు మారుతున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే కొన్ని ప్రాంతాల్లో ఏజెంట్లను తయారు చేసుకుని నకిలీ నోట్ల చలామణి చేస్తున్నారు. రూ. 500 నోట్ల ఎక్కువగా చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బళ్లారి, సిరుగుప్ప, కంప్లి కొట్టాల(Bellary, Siruguppa, Kampli Kottala) ప్రాంతాల్లో నకిలీ నోట్లు చలామణి చేసేవాళ్లు ఉన్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ నోట్లను చలామణి చేసే ముఠాను అనంతపురం పోలీసులు రెండ్రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తీగలాగితే డొంకే కదులుతున్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో అనేక కీలక వ్యక్తుల పేర్లతో పాటు కీలకంగా ఉండే రాజకీయ పార్టీల నాయకుల పేర్లు కూడా దొంగ నోట్ల ముఠా బయట పెట్టినట్లు సమాచారం. అనంతపురం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సోమవారం రాత్రి దొంగ నోట్లు చలామణి చేసే డీ హీరేహాళ్ మండల కేంద్రానికి చెందిన వసంత అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మంజు అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో దొంగనోట్ల చలామణికి సంబంధించి కీలక వ్యక్తి సెల్వరాజ్ అనే వ్యక్తితో పాటు సిరుగుప్ప, కంప్లి కొట్టాలకు చెందిన మరో నలుగురి పేర్లు బయట పడినట్లు సమాచారం.
సెల్వరాజ్ కోసం అనంతపురం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వెతుకుతున్నారు. బళ్లారి జిల్లా అనంతపురం, కర్నూలు, జిల్లాలతో పాటు తెలంగాణ(Telangana) రాష్ట్రంలో పలు జిల్లాలకు సమీపంలో ఉంటుంది. సరిహద్దును అడ్డాగా చేసుకుని నకిలీ నోట్లు చలామణి ముఠా కార్యకలాపాలు సాగిస్తుంది. ఒకటికి రెండు, రెండుకు నాలుగు, నాలుగు ఎనిమిది ఇలా నకిలీ నోట్ల సరఫరా ముఠా ఆశలు చూవుతుంది. ఆయా ప్రాంతాల్లో ఉండే వ్యక్తులతో పరిచయం ఏర్పాటు చేసుకుని నకిలీ నోట్ల చలామణికి దారులు వేసుకుంటారు. ఇందులో మూడు రకాలుగా వ్యవహారాలు సాగిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బళ్లారి, విజయనగర, దావణగెర, చిత్రదుర్గం జిల్లాల్లో నకిలీ నోట్ల సరఫరా, తయారీ ముఠాపై కూడా కేసులు నమోదు అయ్యాయి. పంటల దిగుబడి కాలం కాబట్టి రైతులకు ఎక్కుగా నకిలీ నోట్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నకిలీ ముఠా నోట్ల చెలామని చేస్తుందని సమాచారం. రెండ్రోజుల క్రితం అనంతపురం పోలీసులకు నకిలీ నోట్లు చలామణి లో కొందరు వ్యక్తులు దొరకగా వారి నుండి పూర్తీ వివరాలు రాబట్టినట్లు తెలిసింది. ఇందులో కీలక వ్యక్తుల పేర్లు కూడా బయట పడినట్లు సమాచారం. కొందరు ఇప్పటికే పరారీలో ఉంటే మరి కొందరు రాజకీయ నాయకులు, పోలీసులతో రాజీ మార్గం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Updated Date - 2022-11-17T12:28:35+05:30 IST