Governor: ఆ బిల్లు యూజీసీ చట్టానికి విరుద్ధం
ABN, First Publish Date - 2022-08-21T13:28:54+05:30
రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(State Governor RN Ravi) రాష్ట్ర ప్రభుత్వంతో తలపడేందుకే సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రజా సంక్షేమ పథకాలకు
- ప్రభుత్వం వీసీలను నియమిస్తే రాజకీయ జోక్యానికి అవకాశం
- దీనిపై మరింత వివరణ ఇవ్వండి
- సీఎస్‌కు గవర్నర్ లేఖ
చెన్నై, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(State Governor RN Ravi) రాష్ట్ర ప్రభుత్వంతో తలపడేందుకే సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టిన ఆయన.. తాజాగా వీసీల నియామకానికి సంబంధించిన బిల్లుపైనా నాన్చుడు ధోరణిని అవలంభించేదిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో వున్న యూనివర్సిటీ(University)ల వైస్‌ఛాన్స్‌లర్ల నియామకంపై గవర్నర్ అధికారాలకు కత్తెర వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టానికి విరుద్ధమని, దీనిపై మరింత వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎస్ ఇరై అన్బుకు లేఖ రాశారు. ఈ వ్యవహారం గవర్నర్ తీరును తేటతెల్లం చేస్తోందని ప్రభుత్వనేతలు వ్యాఖ్యానిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వంతో తలపడేందుకే గవర్నర్ మొగ్గు చూపుతున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది రాష్ట్ర గవర్నర్‌గా వచ్చిన ఆర్‌ఎన్ రవి.. డీఎంకే ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించే పలు బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్‌ఛాన్స్‌లర్లను నియమిస్తుండడం పట్ల ముఖ్యమంత్రి(Chief Minister) సైతం ఆగ్రహంతో వున్నారు. దీంతో గవర్నర్ అధికారాలకు కత్తెర వేస్తూ, వీసీలను నియమించడం, అవసరమైతే తొలగించడం వంటి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వమే కలిగి వుండేలా గత ఏప్రిల్ 25వ తేదీన అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించారు. అయితే ఆ బిల్లులకు ఇప్పటి వరకూ గవర్నర్ ఆమోదం తెలపలేదు. దీనికి తోడు ఇటీవల మనోన్మణియం సుందరనార్, అళగప్పా, తిరువళ్లువర్ వర్సిటీలకు వీసీలను నియమించారు. దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో వుంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించే ‘సెర్చ్ కమిటీ’ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని 13 యూనివర్సిటీలకు అవసరమైన వీసీల నియామక ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. వీసీల పదవులకు దరఖాస్తులను ఆహ్వానించి, అందులో మెరుగైన వ్యక్తుల పేర్లతో కూడిన జాబితాను వర్సిటీల ఛాన్స్‌లర్‌గా వున్న గవర్నర్‌కు పంపిస్తుంది. ఆ పేర్లను పరిశీలించిన అనంతరం, వారితో ముఖాముఖి మాట్లాడిన గవర్నర్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక వీసీలను నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఆర్‌ఎన్ రవి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించడం లేదని స్టాలిన్(Stalin) బృందం చెబుతోంది. అందుకే ఆయన అధికారాలకు చెక్ పెట్టేందుకు వీసీల బిల్లుల్ని ఆమోదించింది. అయితే ఆ బిల్లులపై గవర్నర్ వివరణ కోరుతూ సీఎ్‌సకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. వీసీలను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తే రాజకీయ జోక్యానికి అవకాశముందని, ఇది యూజీసీ చట్టానికి విరుద్ధమని పేర్కొన్న గవర్నర్.. ఆ బిల్లులపై మరింత వివరణ ఇవ్వాలని సీఎ్‌సను ఆదేశించారు.
ఒండివీరన్‌కు నివాళి
స్వాతంత్య్ర సమరయోధుడు ఒండివీరన్ 251వ వర్ధంతి సందర్భంగా శనివారం తిరునల్వేలిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి పాల్గొన్నారు. ఒండివీరన్ పేరుతో ప్రత్యేకంగా ముద్రించిన తపాలా బిళ్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి ఎల్.మురుగన్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎం.మదివేందన్ తదితరులు కూడా పాల్గొన్నారు.
Updated Date - 2022-08-21T13:28:54+05:30 IST