Gyanvapi Case: శివలింగానికి పూజలపై తీర్పు వాయిదా
ABN, First Publish Date - 2022-11-14T18:51:45+05:30
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ (Gyanvapi mosque complex)లో లభ్యమైనట్టుగా చెబుతున్న శివలింగానికి పూజలు చేసేందుకు
వారణాసి: జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ (Gyanvapi mosque complex)లో లభ్యమైనట్టుగా చెబుతున్న శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఈ కేసులో తీర్పును నవంబరు 17కు వాయిదా వేస్తూ సివిల్ జడ్జ్ (సీనియర్ డివిజన్) మహేంద్ర పాండే నిర్ణయం ప్రకటించారు. ఈ మేరకు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కౌన్సిల్ సులభ్ ప్రకాశ్ తెలిపారు. అక్టోబరు 27న ఈ వివాదంపై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నవంబరు 8కి తీర్పును రిజర్వు చేసింది. అయితే, ఆ రోజున న్యాయమూర్తి సెలవులో ఉండడంతో నేటి(సోమవారం)కి వాయిదా పడింది. ఇప్పుడు వచ్చే నెల 17కు తీర్పును వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
* విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి కిరణ్ సింగ్ అక్టోబరు 24న వారణాసి కోర్టులో పిటిషన్ వేస్తూ.. జ్ఞానవాపి కాంప్లెక్సులోకి ముస్లింలను అనుమతించకుండా నిషేధం విధించాలని కోరారు. కాంప్లెక్స్‌ను సనాతన్ సంఘ్‌కు అప్పగించడంతోపాటు శివలింగానికి పూజలు చేసుకునేందుకు అనుమతించాలని అభ్యర్థించారు.
* మే 25న జిల్లా జడ్జి ఏకే విశ్వేష్ ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేశారు. వారణాసి జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు కమిషనర్, జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారాలు చూస్తున్న అంజుమన్ ఇంతేజామియా కమిటీ, విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్‌లను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.
* ఏప్రిల్ 26న మసీదు బయటి గోడలపై ఉన్న దేవతా విగ్రహాలను నిత్యం పూజించుకునేందుకు అనుమతి కోరుతూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన దిగువ కోర్టు (సివిల్ జడ్జ్-సీనియర్ డివిజన్) వీడియో గ్రాఫిక్ సర్వేకు ఆదేశించింది. మసీదు కాంప్లెక్స్‌లో శివలింగం తమకు కనిపించిందని పిటిషన్ దాఖలు చేసిన మహిళలు పేర్కొన్నారు.
* అయితే, ‘వజూఖానా’ రిజర్వాయర్ వద్ద ఉన్న ఫౌంటేన్ మెకానిజంలో ఈ నిర్మాణం ఒక భాగమని ముస్లిం పక్షం పేర్కొంది. నమాజ్ ఆచరించడానికి ముందు ఇక్కడ స్నానాలు చేస్తారని పేర్కొంది.
* మే 20న సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ నుంచి జిల్లా జడ్జికి కేసును బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సమస్యలోని సంక్లిష్టత, సున్నితత్వాన్ని పరిశీలించిన తర్వాత 25-30 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ జ్యుడీషియల్ అధికారి ఉంటే మంచిదని అభిప్రాయపడింది.
Updated Date - 2022-11-14T18:51:46+05:30 IST