Himachal Pradesh: సీఎం ఠాకూర్ మంత్రివర్గంలోని 8 మంది మంత్రుల ఓటమి
ABN, First Publish Date - 2022-12-08T22:01:44+05:30
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP)కి ఘోర పరాభవం ఎదురైంది. రెండోసారి అధికారంలోకి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP)కి ఘోర పరాభవం ఎదురైంది. రెండోసారి అధికారంలోకి వచ్చి సంప్రదాయానికి చెక్ పెట్టాలన్న కాషాయ పార్టీ ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయి. మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించగా, ఇప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ 25 స్థానాలకే పరిమితం అయింది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ (Jai Ram Thakur) ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతికేత ఉన్నట్టు ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఆయన మంత్రివర్గంలోని ఏకంగా 8 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌తో కలిపి ఆయన కేబినెట్‌లో మొత్తం 12 మంది కేబినెట్ మంత్రులు ఉండగా వారిలో 8 మంది పరాజయం పాలు కావడం గమనార్హం.
వీరిలో గోవింగ్ సింగ్ ఠాకూర్, రామ్‌లాల్ మార్కండ, రాజిందర్ గార్గ్, రాజీవ్ సేజల్, సర్వీన్ చౌధరీ, వీరేందర్ కన్వార్ ఉన్నారు. అలాగే, సిట్టింగ్ మంత్రి మహేందర్ సింగ్ తన కుమారుడు రజత్ ఠాకూర్ కోసం తన స్థానాన్ని త్యాగం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రజత్ కూడా ఓటమి పాలయ్యారు.
అలాగే, కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించే ఆరుగురిలో ముగ్గురు ఓడిపోయారు. డల్హౌసీ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా జయకేతనం ఎగురవేసిన ఆశా కుమారి 9,918 ఓట్ల భారీ తేడాతో పరాజయం పాలయ్యారు. మాజీ మంత్రులు కౌల్ సింగ్, రామ్ లాల్ ఠాకూర్ వరుసగా 618, 171 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో దరంగ్, శ్రీ నైనా దేవీ నుంచి పరాజయం చవిచూశారు. నహాన్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ సోలంకి బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్‌పై 1,693 ఓట్లతో విజయం సాధించారు.
Updated Date - 2022-12-08T23:41:49+05:30 IST