యూనిఫాంను నిర్దేశించిన చోట విద్యార్థులు ధరించవలసిందే : కర్ణాటక హైకోర్టు సీజే
ABN, First Publish Date - 2022-02-23T23:50:12+05:30
విద్యా సంస్థల్లో మతపరమైన వస్త్రాలను ధరించరాదని ఇచ్చిన
బెంగళూరు : విద్యా సంస్థల్లో మతపరమైన వస్త్రాలను ధరించరాదని ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలపై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రుతు రాజ్ అవస్థి బుధవారం వివరణ ఇచ్చారు. ఈ ఆదేశాలు కేవలం విద్యార్థినీ, విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయని తెలిపారు. విద్యా సంస్థలు యూనిఫాంను నిర్దేశించినట్లయితే, ఆయా విద్యా సంస్థల్లో చదివేవారు ఆ యూనిఫాంను తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.
హిజాబ్ కేసులో పిటిషనర్లు, ప్రతివాదులు, ప్రభుత్వం తమ వాదనలను హైకోర్టుకు వినిపించారు. ఈ సందర్భంగా ఓ న్యాయవాది మాట్లాడుతూ, విద్యా సంస్థల్లో పని చేసే టీచర్లను హిజాబ్ తొలగించాలని నిర్బంధిస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై జస్టిస్ అవస్థి స్పందిస్తూ, తాత్కాలిక ఆదేశాలు కేవలం విద్యార్థినీ, విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయని, టీచర్లకు కాదని వివరించారు. డిగ్రీ కళాశాల లేదా ప్రీ-యూనివర్సిటీ కాలేజ్ నిర్దిష్టమైన యూనిఫాంను నిర్ణయిస్తే, ఆ యూనిఫాంను విద్యార్థినీ, విద్యార్థులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.
విద్యా సంస్థల తరగతి గదుల్లో హిజాబ్‌ను ధరించరాదని విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ కొందరు విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఉడుపిలోని ప్రీ-యూనివర్సిటీ కాలేజ్ తరపున సీనియర్ అడ్వకేట్ ఎస్ నాగానంద్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లలో కొందరి ఆధార్ కార్డులను హైకోర్టుకు చూపించారు. వీటిలో వీరు హిజాబ్‌ను ధరించలేదని తెలిపారు. అనేక సంవత్సరాల నుంచి తమ విద్యా సంస్థలో యూనిఫాం అమలవుతోందని చెప్పారు. ఇంత వరకు అంతా సజావుగానే సాగిందని, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు వచ్చిన తర్వాత వారు విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను రెచ్చగొట్టడంతో వివాదం ప్రారంభమైందని చెప్పారు. దీనివల్ల మొత్తం విద్యా వ్యవస్థ దెబ్బతింటోందన్నారు.
Updated Date - 2022-02-23T23:50:12+05:30 IST