Indian Navy : నావికా దళం నూతన పతాకంలో ఛత్రపతి శివాజీ స్ఫూర్తి
ABN, First Publish Date - 2022-09-02T19:09:03+05:30
భారత నావికా దళం (Indian Navy) నూతన పతాకం (Ensign
కొచ్చి : భారత నావికా దళం (Indian Navy) నూతన పతాకం (Ensign)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. వలస పాలన బానిసత్వానికి గుర్తుగా నిలిచిన సెయింట్ జార్జి క్రాస్‌ను తొలగించి, ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో నూతన పతాకాన్ని రూపొందించారు. నూతన పతాకంలో ఎడమవైపు పై భాగంలో జాతీయ పతాకం ఉంది. కుడివైపు అష్ట భుజులు రెండు ఉన్నాయి. వాటి మధ్యలో ఓ లంగరుపై భారత జాతీయ చిహ్నం ఉంది. ఈ లంగరు క్రింద ‘సం నో వరుణః’ అనే నినాదం ఉంది. దీనిని వేదాల నుంచి స్వీకరించారు. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునే మాట ఇది. ‘వరుణ దేవా! మా పట్ల దయ చూపించి, మాకు విజయాన్ని ప్రసాదించు’ అని దీని భావం.
జాతీయ చిహ్నం చుట్టూ ఉన్న బంగారు రంగు బోర్డర్‌కు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ మహారాజు రాజముద్ర. ఇది స్థిరత్వాన్ని వెల్లడిస్తుంది. ఎనిమిది దిక్కులను సూచించే విధంగా అష్టభుజిని ఏర్పాటు చేశారు. భారత నావికా దళం బహుళ దిశలకు చేరగలదని, అనేక రకాల కార్యకలాపాలను నిర్వహించే సత్తా దానికి ఉందని ఇది తెలియజేస్తుంది.
అంతకుముందు నావికాదళ పతాకంలో సెయింట్ జార్జి క్రాస్ ఉండేది. దానికన్నా ముందు తెలుపు రంగుపై రెడ్ క్రాస్, యునైటెడ్ కింగ్‌డమ్ యూనియన్ జాక్ ఉండేవి.
ఛత్రపతి శివాజీ మహారాజుకు 60 యుద్ధ నౌకలు, సుమారు 5,000 మంది సైనికులు ఉండేవారు. విదేశీ దండయాత్రల నుంచి తీరప్రాంతాన్ని కాపాడిన తొలి నావికా దళం ఇదే.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, నేటి వరకు భారత నావికా దళం పతాకంలో బానిసత్వ చిహ్నం ఉందన్నారు. దాని స్థానంలో ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో కొత్తదానిని తీసుకొచ్చినట్లు తెలిపారు.
మోదీ శుక్రవారం విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను జలప్రవేశం చేయించి, నావికా దళానికి అప్పగించారు. డిజైన్, నిర్మాణం మన దేశంలోనే జరిగిన తొలి విమాన వాహక నౌక ఇది.
Updated Date - 2022-09-02T19:09:03+05:30 IST