Modi Mother: హీరాబెన్‌తో మోదీ 5 ముచ్చటైన ఘట్టాలు
ABN, First Publish Date - 2022-12-28T20:00:54+05:30
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లి హీరాబెన్ మోదీ మధ్య ఇలాంటి అపూర్వ అనుబంధమే ...
న్యూఢిల్లీ: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), ఆయన తల్లి హీరాబెన్ మోదీ (Heeraben Modi) మధ్య ఆప్యాయతలు ఈ కోవలేనివే. దేశం కోసం అహరహం కష్టపడుతున్న తన కొడుకుని చూసి హీరాబెన్ గర్విస్తుంటారు. ఇద్దరూ కలుసుకున్న సంఘటనలు తక్కువే అయినా ఆ క్షణాలనే మధుర క్షణాలుగా ఆమె తలపోస్తుంటారు. మోదీ సైతం.. ఏ కార్యక్రమం లేనప్పుడు తల్లిని కలుసుకుని ఆమె ఆశీస్సులు అందుకునేందుకు తహతహలాడుతుంటారు. తనకంటూ ఒక కుటుంబం ఉన్నా, దేశం- పార్టీనే తన నిజమైన కుటుంబంగా భావించి నిబద్ధతతో ప్రయాణం సాగిస్తుంటారు. తల్లితో తనకున్న అనుబంధాన్ని మోదీ చాటుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తల్లీకొడుకులు గత కొంతకాలంగా ఏయే సందర్భాల్లో కలుసుకున్నారో, ఆప్యాయతలు పంచుకున్నారో ఓసారి చూద్దాం.
1.జనవరి 2017
వ్యక్తిగత జీవితం గురించి మోదీ ప్రస్తావించిన సందర్భాలు చాలా తక్కువ. అయితే 2017 జనవరి 1న ఆయన ట్విట్టర్‌లోని తన లక్షలాది మంది ఫాలోయర్లను ఉద్దేశించి ట్వీట్ చేశారు. గాంధీనగర్‌లో ఉంటున్న తన ఏళ్ల తల్లి హీరాబెన్‌ను కలుసుకునేందుకు ఉదయం పూట యోగా సెషన్‌ను దాటవేసినట్టు ఆయన ట్వీట్ చేశారు.
2.సెప్టెంబర్ 2022
పుట్టినరోజుకు తల్లి ఆశీర్వచనాలు తీసుకోవడం మోదీ ఆనవాయితీ. అయితే మోదీ తన 72వ పుట్టినరోజు నాడు తల్లి ఆశీస్సులు తీసుకోలేకపోయారు. నమీబియన్ చిరుతలను వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి విడిచిపెట్టే కార్యక్రమం కోసం ఆయన కునో నేషనల్ పార్క్ వెళ్లాల్సి వచ్చింది. ఆ వెంటనే కర్హాల్‌లో మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలోనే మోదీ ఈ ప్రస్తావన చేస్తూ, సహజంగా తనకు ఏ కార్యక్రమం లేనప్పుడు తల్లి వద్దకు వెళ్లేందుకు గట్టి ప్రయత్నం చేస్తుంటానని, ఆమె పాదలకు మొక్కి ఆశీస్సులు తీసుకుంటానని చెప్పారు. అయితే రోజంతా కష్టపడి పనిచేసే లక్షలాది మంది మహిళల ఆశీస్సులు (మధ్యప్రదేశ్) తనకు ఇక్కడ దొరికాయనీ, ఇది చూసి తన తల్లి కూడా ఎంతో సంతోషిస్తుందని చెప్పారు.
3.సెప్టెంబర్ 17,2014
నరేంద్ర మోదీ 64వ పుట్టినరోజు ఇది. ఆరోజు ఆయన తన తల్లిని కులుసుకునేందుకు భద్రతా సిబ్బందిని కూడా పక్కనపెట్టి 23 కిలోమీటర్లు ఒకే వాహనంలో, అది కూడా డ్రైవింగ్ చేసుకుంటూ గాంధీనగర్ వెళ్లారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన తొలిసారి చేసిన పర్యటన కూడా ఇదే. తల్లి పాదాలకు నమస్కరించి, ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. పుట్టినరోజు కానుకగా హీరాబెన్ ఆయనకు రూ.5001 ఇచ్చారు. ఆ మెుత్తాన్ని ఆయన జమ్ముకశ్మీర్ కోసం ప్రధానమంత్రి సహాయ నిధికి జమ చేశారు.
4. 15 మే 2016
హీరాబెన్ తొలిసారి ఢిల్లీలోని రేస్ కోర్స్ నివాసంలో ఉంటున్న మోదీని కలుసుకునేందుకు గుజరాత్ నుంచి వచ్చారు. తన తల్లితో విలువైన సమయాన్ని గడిపిన మోదీ, అందుకు సంబంధించిన మూడు ఫోటోలను కూడా షేర్ చేశారు. ''గుజరాత్ నుంచి అమ్మ వచ్చింది. మనసువిప్పి ఎంతో సంతోషంగా చాలా సమయం మాట్లాడుకున్నాం. ఆర్‌సీఆర్ (రేస్ కోర్స్ రోడ్డు) రావడం అమ్మకు ఇదే మొదటిసారి'' అని మోదీ తన ట్వీట్‌లో ఆ మధురక్షణాలను పంచుకున్నారు.
5.జనం మధ్య...రెండుసార్లు
ప్రధానమంత్రి మోదీ, ఆయన తల్లి హీరాబెన్ కలిసి బహిరంగంగా జనం మధ్యకు వచ్చిన రెండు ముచ్చటైన సందర్భాలు కూడా ఉన్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మొదటిసారి ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఏక్తా యాత్ర పూర్తి అయిన తర్వాత శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మోదీ నేరుగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. హీరాబెన్ ఆయన నుదుట కుంకుమ దిద్ది ఆశీర్వదించారు. రెండో పర్యాయం 2001లో మోదీ మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా హీరాబెన్ హాజరయ్యారు.
Updated Date - 2022-12-30T18:29:40+05:30 IST