Nawazuddin Siddiqui: బీజేపీ ఆకర్ష్ ప్లాన్... షాతో సిద్ధిఖీ భేటీ
ABN, First Publish Date - 2022-12-27T15:35:32+05:30
సినీ గ్లామర్‌ను రాజకీయాల్లో ఉపయోగించుకునేందుకు గత కొద్దికాలంగా భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఇప్పటి వరకూ...
న్యూఢిల్లీ: సినీ గ్లామర్‌ను రాజకీయాల్లో ఉపయోగించుకునేందుకు గత కొద్దికాలంగా భారతీయ జనతా పార్టీ (Bjp) అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఇప్పటి వరకూ అధికారంలో లేని రాష్ట్రాల్లో సీట్లు, ఓట్ల శాతం పెంచుకునేందుకు, చిన్నాచితకా పార్టీలను కలుపుకు వెళ్లయినా సరే అధికారంలోకి వచ్చేందుకు, కనీసం ప్రధాన ప్రతిపక్షంగా నిలిచేందుకు అవకాశం ఉన్న రాష్ట్రాలపై ప్రధానంగా ఆ పార్టీ దృష్టి సారిస్తోంది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండటం, 2024లో కీలకమైన లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో బీజేపీ ''స్టార్ల'' వేట కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ టాలెండెట్ ఆర్టిస్టుగా పేరున్న నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను మంగళవారంనాడు న్యూఢిల్లీలో కలుసుకున్నారు.
అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం సంబంధిత అధికారులను సిద్ధిఖీ కలవడంతో అందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేశారు. మర్యాదపూర్వకంగానే అమిత్‌షాను సిద్ధిఖీ కలుసుకున్నట్టు హోం శాఖ అధికారులు తెలిపారు. అయితే అకస్మాత్తుగా అమిత్‌షాను సిద్ధిఖీ కలుసుకోవడం వెనుక మరైదైనా కారణం ఉందా అనేది ఇతమిత్ధంగా బయటకు రాలేదు. ఉభయులూ అరగంట సేపు సమావేశం అయ్యారు. అమిత్‌షాకు ఒక మొక్కను సిద్ధికీ బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాగా, బీజేపీ మంత్రులను సిద్ధిఖీ కలుసుకోవడం ఇదే మొదటిసారి కూడా కాదు. ఇటీవలే ఆయన ఐసీసీఆర్ చీఫ్ వినయ్ సహస్రబుద్ధే, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను కూడా కలిసారు.
ఆపరేషన్ ఆకర్ష్..
కమలనాథులు ఆకర్ష్ ఆపరేషన్‌లో భాగంగానే అమిత్‌షాను సిద్ధిఖీ కలుసుకున్నారా అనేది ఇంకా స్పష్టం కానప్పటికీ ఆ కోణాన్ని కూడా కొట్టివేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సినీ గ్లామర్‌ను పార్టీ ప్రచారానికి ఉపయోగించుకునే ప్రయత్నాలు ఇప్పటికే బీజేపీ చేపట్టింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, నితిన్ వంటి హీరోలతో ఇటీవల బీజేపీ నేతలు భేటీ అయ్యారు.
విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్..
బాలీవుడ్‌లో విభన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా సిద్ధిఖీ అనిపించుకుంటున్నారు. అనురాగ్ కశ్యమ్ క్రైమ్-డ్రామా 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్'లో తన పాత్రతో సిద్ధఖీ బాగా పాపులర్ అయ్యారు. బజ్‌రంగి భాయ్‌జాన్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. 'కిక్' చిత్రంలో విలనీ పాత్ర ఆడియెన్స్‌ను మెప్పించింది. ప్రస్తుతం ఆయన 'హడ్డీ' చిత్రంలో ట్రాన్స్‌జెండర్ లుక్‌లో కనిపించబోతున్నారు. జీ స్టూడియోస్ ఇటీవల తన ఇన్‌స్టాలో ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియో పోస్ట్ చేసింది. మేకప్ కోసం మూడు గంటలు కుర్చీలో అతుక్కుపోయాడంటూ గొప్పగా చెప్పుకుంది. జీ స్టూడియోస్, అనందితా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2023లో విడుదల కానుంది.
వివాదాల్లోనూ...
కాగా, వివాదాలు కూడా సిద్ధిఖీకి కొత్త కాదు. బోఫోర్స్ కుంభకోణం గురించి డైలాగ్‌తో నాలుగేళ్ల క్రితం ఆయన వివాదంలో చిక్కుకున్నారు. Sacred Gamesలో సిద్ధిఖీ పాత్ర అప్పటి ప్రధాని (రాజీవ్‌గాంధీ) బోఫోర్స్ కుంభకోణం గురించి డైలాగ్ చెప్పడం అప్పట్లో వివాదమైంది. దీనిపై పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒక కాంగ్రెస్ కార్యకర్త సిద్ధిఖీపై కేసు వేశాడు. రాజీవ్ గాంధీని నిర్మాతలు అవమానించారని ఆయన ఆరోపించారు. వెబ్ సిరీస్‌లో సిద్ధికి క్యారెక్టర్ చెప్పిన మాటలను ఉటంకిస్తూ బీజేపీ ప్రతినిధి అమిత్ మాలవీయ ట్వీట్ చేయడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది.
శివసేన గరం...
కొద్దికాలం క్రితం యూపీలోని తన స్వగ్రామంలో ఆడాల్సిన రామ్‌లీలా నాటకం విషయంలోనూ సిద్ధిఖికి చేదు అనుభవం ఎదురైంది. ఒక ముస్లిం ఎలా ఇందులో నటిస్తాడంటూ శివసేన వ్యతిరేకించింది. ఈ నాటకంలో మారీచుడి పాత్రను సిద్ధిఖి పోషించాల్సి ఉంది. అతను స్టేజ్‌పైకి ఎక్కేందుకు శివసేన అభ్యంతరం పెట్టడంతో ఆయన ప్లేస్‌లో మరొకరితో వేషం వేయించారు.
స్టార్ల పారితోషికంపైనా వైరల్ కామెంట్స్
కొద్ది రోజుల క్రితమే నవాజుద్దీన్ సిద్ధిఖీ స్టార్ హీరోల పారితోషకంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యారు. నటులు తీసుకునే పారితోషికం బడ్జెట్‌పై పడి, చివరకు అది లాభాలపై ప్రభావం చూపిస్తోందన్నారు. నటులు ఎవరైతే రూ.100 కోట్లు తీసుకుంటున్నారో వాళ్ల సినిమాలకు నష్టం జరుగుతోందని విమర్శించారు. పరిమితమైన బడ్జెట్‌తో సినిమాలు తీస్తే ఎప్పుడూ అవి ఫెయిల్యూర్ కావని అన్నారు. పరిమితులు దాటితేనే ప్లాప్ అవుతాయని, సినిమా హిట్ లేదా ఫట్‌ను నిర్ణయించేంది బడ్జెట్ మాత్రమేనని, నటులో, దర్శకులో, నిర్మాతలో కాదని వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-12-27T15:40:57+05:30 IST