Data Protection Bill : శాసన చరిత్రలో తొలిసారి ఆ పదాల వినియోగం
ABN, First Publish Date - 2022-11-18T18:03:17+05:30
వ్యక్తిగత సమాచార పరిరక్షణ హక్కును గుర్తించే డిజిటల్ డేటా పర్సనల్ ప్రొటెక్షన్ బిల్, 2022
న్యూఢిల్లీ : వ్యక్తిగత సమాచార పరిరక్షణ హక్కును గుర్తించే డిజిటల్ డేటా పర్సనల్ ప్రొటెక్షన్ బిల్, 2022 (Digital Data Personal Protection Bill, 2022) ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రజల ముందు ఉంచింది. వచ్చే నెల 17నాటికి దీనిపై అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ లింక్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు.
ఈ బిల్లులో ముఖ్యాంశాలను పరిశీలిస్తే, మన దేశ శాసన చరిత్రలో మొట్టమొదటిసారి స్త్రీ, పురుష, నపుంసక లింగాలకు ఆమె, ఆమె యొక్క (She/her) అనే పదాలను ఉపయోగించారు. వ్యక్తి స్త్రీ, పురుష, నపుంసకుల్లో ఏ వర్గానికి చెందినవారైనప్పటికీ, ఆ వ్యక్తిని సంబోధించేటపుడు ఆమె లేదా ఆమె యొక్క అనే పదాలను ఉపయోగించారు. మహిళలను సాధికారులను చేయాలన్న ప్రభుత్వ సిద్ధాంతానికి అనుగుణంగానే ఈ మాటలను ఉపయోగించినట్లు ఈ ముసాయిదా బిల్లు పేర్కొంది.
ఏడు సూత్రాలు : ఈ బిల్లును ఏడు సూత్రాల ఆధారంగా రూపొందించారు.
1. వ్యక్తిగత సమాచారాన్ని సంస్థలు చట్టపరమైన పద్ధతిలో ఉపయోగించుకోవడం.
2. వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయడం వెనుక ఉద్దేశాన్ని స్పష్టంగా వెల్లడించాలి. ఏ వ్యక్తి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేస్తున్నారో ఆ వ్యక్తికి ఆ విషయాన్ని తెలియజేయాలి. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ప్రాసెస్ చేస్తామని పొడి పొడిగా చెబితే సరిపోదు. దీనినే పర్పస్ లిమిటేషన్ సూత్రం ('purpose limitation' principle) అంటారు.
3. నిర్దిష్ట ప్రయోజనాన్ని నెరవేర్చేందుకు అవసరమైన, ప్రత్యక్ష సంబంధంగల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి మాత్రమే డేటా కంట్రోలర్ పరిమితం కావాలి. దీనినే డేటా మినిమైజేషన్ అంటారు. ఆ ప్రయోజనాన్ని నెరవేర్చేందుకు అవసరమైనంత కాలం మాత్రమే ఆ సమాచారాన్ని తన వద్ద ఉంచుకోవాలి.
4. పర్సనల్ డేటా యాక్యురసీ
5. స్టోరేజ్ లిమిటేషన్
6. వ్యక్తిగత సమాచార ఉల్లంఘన నిరోధం
7. డేటా ప్రాసెసింగ్ కోసం జవాబుదారీతనం
ఇదిలావుండగా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్, సింగపూర్ వంటి దేశాల్లోని చట్టాలను పరిశీలించి ఈ బిల్లును రూపొందించారు.
Updated Date - 2022-11-18T18:03:23+05:30 IST