Patiala : న్యాయవాదులకు క్రికెట్ ఫీవర్... ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ కోసం సెలవు ప్రకటించిన బార్...
ABN, First Publish Date - 2022-11-10T15:22:38+05:30
టీ ట్వంటీ వరల్డ్ కప్ (T-20 World cup) క్రికెట్ అన్ని రంగాలవారినీ ఉర్రూతలూగిస్తోంది.
న్యూఢిల్లీ : టీ ట్వంటీ వరల్డ్ కప్ (T-20 World cup) క్రికెట్ అన్ని రంగాలవారినీ ఉర్రూతలూగిస్తోంది. ఆ మజాను ఆస్వాదించనివారంటూ కనిపించడం లేదు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా-ఇంగ్లండ్ తలపడుతుండటంతో ఆ ఉత్కంఠభరిత సన్నివేశాలను నిరాటంకంగా వీక్షించాలనే కోరిక అందరిలోనూ బలంగా కనిపిస్తోంది. దీనికి న్యాయవాదులు అతీతులేమీ కాదని పాటియాలా జిల్లా బార్ అసోసియేషన్ స్పష్టం చేసింది. భోజన విరామం తర్వాత ఇక పని చేయబోమని ప్రత్యేక సమావేశం పెట్టి మరీ తీర్మానించింది. మధ్యాహ్నం విచారణకు వచ్చే కేసులన్నిటినీ వాయిదా వేయాలని అందరు జ్యుడిషియల్ ఆఫీసర్స్‌ను కోరింది.
ఇండియా-ఇంగ్లండ్ క్రికెట్ మ్యాచ్ గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు పాటియాలా జిల్లా బార్ అసోసియేషన్ ప్రత్యేకంగా, అత్యవసరంగా సమావేశమైంది. అడ్వకేట్ జతిందర్ పాల్ సింగ్ ఘుమాన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇండియా-ఇంగ్లండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ కారణంగా గురువారం మధ్యాహ్న భోజన విరామం తర్వాత పని చేయబోమని తీర్మానించింది. గురువారం మధ్యాహ్నం విచారణకు వచ్చే కేసులన్నిటినీ వాయిదా వేయాలని అందరు న్యాయమూర్తులను కోరింది. సంబంధిత జ్యుడిషియల్ అధికారులు, రెవిన్యూ కోర్టులు, ట్రైబ్యునళ్ళ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ , కమిషనర్ కోర్టులకు ఈ మేరకు ఓ నోటీసును పంపించింది.
Updated Date - 2022-11-10T15:22:42+05:30 IST