Heart Breaking : రష్యన్ కోటీశ్వరుడు... పుతిన్‌ను విమర్శకుడు... భారత్‌లో అనుమానాస్పద మృతి...
ABN, First Publish Date - 2022-12-27T14:42:25+05:30
రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) విమర్శకుడు పావెల్ ఆంటనోవ్ (Pavel Antonov) అనుమానాస్పద
న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) విమర్శకుడు పావెల్ ఆంటనోవ్ (Pavel Antonov) అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని ఓ త్రీ స్టార్ హోటల్ కిటికీ నుంచి క్రింద పడిపోవడంతో విగతజీవుడిగా కనిపించారు. ఇదే హోటల్‌లో ఆయన స్నేహితుడు కూడా మరణించారు.
పావెల్ ఆంటనోవ్ తన 65వ జన్మదినోత్సవాలను జరుపుకునేందుకు ఒడిశాలోని రాయగడకు వచ్చారని తెలుస్తోంది. రాయగడ పోలీసు సూపరింటెండెంట్ వివేకానంద శర్మ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, ఈ హోటల్‌లో ఈ నెల 21న నలుగురు వ్యక్తులు దిగారు. డిసెంబరు 22న వారిలో ఒకరు బి వ్లదిమిర్ మరణించారు. పోస్ట్ మార్టమ్ నివేదికనుబట్టి ఆయన గుండె పోటుతో మరణించినట్లు వెల్లడైంది. ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఆయన మరణంతో ఆయన స్నేహితుడు పావెల్ ఆంటనోవ్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. డిసెంబరు 25న ఆయన కూడా మరణించారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? ప్రమాదవశాత్తూ పై నుంచి జారిపడటం వల్ల ప్రాణాలు కోల్పోయారా? అనే విషయం ఇంకా వెల్లడి కాలేదు.
రష్యన్ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, పావెల్ ఆంటనోవ్ మరణాన్ని రష్యన్ రీజనల్ పార్లమెంట్ వైస్ స్పీకర్ వ్యచెస్లావ్ కర్తుఖిన్ ధ్రువీకరించారు. తమ సహచరుడు, విజయవంతమైన పారిశ్రామికవేత్త, దాత పావెల్ మరణించారని, యునైటెడ్ రష్యా ఫ్యాక్షన్ డిప్యూటీస్ తరపున ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని చెప్పారు.
లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ వ్లదిమిర్ కిసెలియోవ్ మాట్లాడుతూ, పావెల్ వ్యక్తిగత లక్షణాలు, ప్రొఫెషనలిజం అత్యంత గౌరవప్రదమైనవని తెలిపారు. ఆయన అందరితోనూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారని, అందరినీ గౌరవించేవారని తెలిపారు. ఆయన అందరి మనసులు గెలుచుకున్నారన్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేమన్నారు. ఆయన మరణం తమకు తీరని లోటు అని చెప్పారు.
ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, పావెల్‌తోపాటు వచ్చిన వ్లదిమిర్ బిడెనోవ్ డిసెంబరు 22న ఇదే హోటల్‌లో మరణించారు. హోటల్ మొదటి అంతస్థులో ఆయన గదిలో స్పృహలేని స్థితిలో కనిపించారు. ఆయన వద్ద రెండు ఖాళీ వైన్ బాటిల్స్ ఉన్నాయి. ఆయనను ఆసుపత్రికి తరలించారు, కానీ ఆయన అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు.
వ్లదిమిర్, పావెల్, మరో ఇద్దరు రష్యన్ యాత్రికులు, వారి గైడ్ జితేంద్ర సింగ్ ఈ హోటల్‌లో దిగారు. సింగ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ హోటల్‌లో నలుగురు టూరిస్టులు దిగారన్నారు. వారిలో 61 ఏళ్ళ వయసుగల బి వ్లదిమిర్ అనారోగ్యంతో బాధపడేవారన్నారు. మరుసటి రోజు ఉదయం తాము ఆయన గదిలోకి వెళ్ళి చూసినపుడు, ఆయన స్పృహ లేని స్థితిలో కనిపించారన్నారు. దీంతో తాము పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. ఆయన మితిమీరి మద్యం సేవించి ఉండవచ్చునని, ఆయన వద్ద ఖాళీ లిక్కర్ బాటిల్స్ ఉన్నాయని చెప్పారు. ఆయన హృద్రోగి అని తెలిపారు. ఆయన తనతోపాటు ఔషధాలను కూడా తీసుకొచ్చారన్నారు. ఆయన స్నేహితుడు పావెల్ కూడా మద్యం సేవించారని చెప్పారు.
Updated Date - 2022-12-27T14:42:29+05:30 IST