Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతి, జనాభా నియంత్రణ చట్టం రావాలి : రాజ్ థాకరే
ABN, First Publish Date - 2022-05-22T19:14:12+05:30
ఉమ్మడి పౌర స్మృతి, జనాభా నియంత్రణ చట్టాలను సత్వరమే తీసుకురావాలని
ముంబై : ఉమ్మడి పౌర స్మృతి, జనాభా నియంత్రణ చట్టాలను సత్వరమే తీసుకురావాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే (Raj Thackeray) ఆదివారం డిమాండ్ చేశారు. ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా మార్చాలని కోరారు. అయోధ్య పర్యటనను వాయిదా వేసుకున్న ఆయన పుణేలో ఓ బహిరంగ సభలో మాట్లాడారు.
అయోధ్య పర్యటనను రద్దు చేసుకోవడం గురించి రాజ్ మాట్లాడుతూ, లౌడ్‌స్పీకర్లకు వ్యతిరేకంగా తాను వ్యక్తం చేస్తున్న నిరసనను ఇష్టపడనివారు తన కోసం ఓ బోనును సిద్ధం చేశారన్నారు. కానీ తాను ఆ బోనులో చిక్కుకోలేదని తెలిపారు. ఎంఎన్ఎస్ కార్యకర్తలు జైలుకు వెళ్ళాలని తాను కోరుకోలేదని, అందుకే తాను ఆ బోనులో చిక్కుకోలేదని చెప్పారు.
అయోధ్యలో పర్యటిస్తానని రాజ్ ప్రకటించిన తర్వాత బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ స్పందిస్తూ, రాజ్ గతంలో ఉత్తరాదివారిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే అయోధ్యలో అడుగు పెట్టాలన్నారు. ఈ డిమాండ్‌పై రాజ్ స్పందిస్తూ, క్షమాపణ చెప్పాలని కొందరు వ్యక్తులు 14, 15 ఏళ్ళ తర్వాత ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు.
అమరావతి ఎంపీ నవనీత్ రాణా (Navneet Rana) దంపతుల గురించి ప్రస్తావిస్తూ, చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్లను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించకపోతే, మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా (Hanuman Chalisa)ను వినిపించాలని తాను తన పార్టీ కార్యకర్తలను కోరానని తెలిపారు. కానీ రాణా దంపతులు హనుమాన్ చాలీసాను ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఇంటి వద్ద పఠిస్తామన్నారని తెలిపారు. ఆయన ఇల్లు ఓ మసీదా? అని అడిగారు. ఇదంతా జరిగిన తర్వాత ఆ దంపతులు శివసేన నేత సంజయ్ రౌత్‌తో కలిసి తింటూ కనిపించారన్నారు.
ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) ఇటీవల ‘‘మా హిందుత్వం, వారి హిందుత్వం’’ అన్నారని, నిజమైన హిందుత్వం, బూటకపు హిందుత్వం ఏమిటని, వాషింగ్ పౌడర్ అమ్ముతున్నామా? అని నిలదీశారు.
జూన్ 5న అయోధ్యలో పర్యటిస్తానని గతంలో రాజ్ థాకరే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు రాజ్ శుక్రవారం తెలిపారు.
Updated Date - 2022-05-22T19:14:12+05:30 IST