Rishi Sunak : జాత్యహంకారాన్ని ఎదిరించాల్సిందే : రిషి సునాక్

ABN, First Publish Date - 2022-12-02T12:08:56+05:30

రిషి గురువారం విలేకర్లతో మాట్లాడుతూ, గతంలో తాను జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నానని చెప్పారు.

Rishi Sunak : జాత్యహంకారాన్ని ఎదిరించాల్సిందే : రిషి సునాక్
Ngozi Fulani, Rishi Sunak
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : బ్రిటిష్ రాజవంశంలో జాత్యహంకార ధోరణి వెల్లడైన నేపథ్యంలో ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak) స్పందించారు. జాత్యహంకార (Racism) ధోరణి ఎప్పుడు, ఎక్కడ ఎదురైనా, దానిని తప్పనిసరిగా ఎదిరించాలన్నారు. తాను బాల్యంలో జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నానని, అయితే ఆ తర్వాత దేశం పురోగమించిందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. ఈ దిశగా మరింత కృషి జరగవలసి ఉందన్నారు. అయితే రాజవంశాన్ని కానీ, ఇటీవల బయటపడిన సంఘటనను కానీ ఆయన నేరుగా ప్రస్తావించలేదు.

రిషి గురువారం విలేకర్లతో మాట్లాడుతూ, గతంలో తాను జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నానని చెప్పారు. తాను బాల్యంలో ఉన్నపుడు ఎదుర్కొన్నవాటిలో కొన్ని నేడు జరుగుతున్నాయని తాను భావించడం లేదన్నారు. ఎందుకంటే జాత్యహంకారాన్ని ఎదుర్కొనడంలో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని చెప్పారు. అయితే జాత్యహంకారాన్ని నిర్మూలించే పని ఇంకా పూర్తి కాలేదన్నారు. అందుకే అది ఎప్పుడు కనిపించినా దానిని ఎదుర్కొని, ఎదిరించాలన్నారు. నిరంతరం పాఠాలు నేర్చుకుంటూ, మెరుగైన భవిష్యత్తు కోసం ముందుకెళ్ళడమే సరైనదని చెప్పారు.

ప్రిన్స్ విలియం గాడ్ మదర్ లేడీ సుసాన్ హసీ జాత్యహంకార ధోరణి ప్రదర్శించారనే ఆరోపణలు ప్రపంచాన్ని కలచివేశాయి. ఆమె దివంగత క్వీన్ ఎలిజబెత్-2కు లే-ఇన్-వెయిటింగ్‌గా పని చేశారు. ఆమె ఓ ఆఫ్రికన్‌తో వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది. ఈ నేపథ్యంలోనే రిషి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఆఫ్రికా, కరీబియన్ మూలాలుగల బ్రిటిష్ జాతీయురాలు ఎన్‌గోజీ ఫులని (Ngozi Fulani) ట్విటర్ వేదికగా వెల్లడించిన విషయాలు ఈ వివాదానికి కారణమయ్యాయి. రాయల్ ఎయిడ్ సుసాన్ హసీ తనను పదే పదే అడిగిన ప్రశ్న తనను హింసించినట్లయిందని చెప్పారు. కింగ్ ఛార్లెస్ (King Charles) సతీమణి కేమిల్లా (Camilla) ఆతిథ్యమిచ్చిన ఓ కార్యక్రమానికి తాను హాజరయ్యానని, తనతో సుసాన్ మాట్లాడుతూ, ‘‘ఆఫ్రికాలో ఏ ప్రాంతం నుంచి వచ్చారు మీరు?’’ అని అడిగారని తెలిపారు. పదే పదే ఈ ప్రశ్నను అడుగుతుండటంతో తాను చాలా బాధపడ్డానని తెలిపారు. చివరికి ‘‘నేను ఇక్కడే పుట్టాను, నేను బ్రిటిషర్‌ను’’ అని చెప్పానని తెలిపారు.

ఈ నేపథ్యంలో లేడీ హసీ తన పదవికి రాజీనామా చేశారు. తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణ కోరారు. బకింగ్‌హాం ప్యాలెస్ విడుదల చేసిన ప్రకటనలో, సుసాన్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, తీవ్రంగా విచారించదగినవని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-02T12:08:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising