Congress presidential Polls : ఉత్తర ప్రదేశ్‌లో పోలైన ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలి : శశి థరూర్ వర్గం
ABN, First Publish Date - 2022-10-19T18:48:16+05:30
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆ పార్టీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రారంభమైంది. మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన శశి థరూర్ వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో జరిగిన పోలింగ్‌లో తీవ్రమైన అక్రమాలు జరిగాయని ఆరోపించింది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ (CEA) చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ (Madhusudan Mistry) దృష్టికి ఈ అక్రమాలను తీసుకెళ్ళింది.
శశి థరూర్ (Shashi Tharoor) తరపున కాంగ్రెస్ నేత సల్మాన్ సోజ్ (Salman Soz) ఆ పార్టీ సీఈఏ చైర్మన్ మిస్త్రీకి బుధవారం ఓ లేఖ రాశారు. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నిర్వహణలో అత్యంత దారుణమైన అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఓటర్ ఫ్రాడ్ జరిగిందని తాము అనుమానిస్తున్నామని చెప్పారు. పోలింగ్ జరిగిన రోజు లక్నోలో లేనటువంటి డెలిగేట్ల ఓట్లు పోల్ అయ్యాయని ఆరోపించారు. ఈ కళంకిత ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రక్రియను అనుమతించినట్లయితే, ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగినట్లు తాము భావించబోమని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ నుంచి పోలయిన అన్ని ఓట్లను చెల్లనివిగా పరిగణించాలని డిమాండ్ చేశారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఫిర్యాదు వచ్చిన తర్వాత ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిన బ్యాలట్ పెట్టెలను ఓ పక్కన ఉంచేసినట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా, రాష్ట్రాల నుంచి వచ్చిన బ్యాలట్ పెట్టెలను న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు కానివారు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టబోతుండటం 24 ఏళ్ళ తర్వాత ఇదే మొదటిసారి.
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే తరపున కౌంటింగ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ, ఇది చరిత్రాత్మక సమయమని చెప్పారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామిక విధానంలో నిర్వహించుకున్నామని, ఇది తమకు గర్వకారణమని తెలిపారు. క్లిష్ట సమయంలో పార్టీ పగ్గాలను చేపట్టిన సోనియా గాంధీకి కూడా తాము కృతజ్ఞతాభావంతో ఉంటామన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ మరింత బలోపేతమవుతుందన్నారు.
Updated Date - 2022-10-19T18:48:16+05:30 IST