బెదిరించినందునే శ్రద్ధను హత్య చేశా!
ABN, First Publish Date - 2022-12-03T04:30:48+05:30
సహ జీవనం చేస్తున్న ప్రియురాలు శ్రద్ధా వాకర్‌ను ముక్కలుగా నరికి హత్య చేసిన కేసులో నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా (28) నిజాల్ని అంగీకరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
నన్ను వదిలేస్తానని హెచ్చరించింది
ఇంటి ఖర్చులపై ఇద్దరి మధ్య ఘర్షణ
నార్కో పరీక్షలో వెల్లడించిన ఆఫ్తాబ్
దర్యాప్తులో కీలక సాక్ష్యాలు లభ్యం
న్యూఢిల్లీ, అక్టోబరు 2: సహ జీవనం చేస్తున్న ప్రియురాలు శ్రద్ధా వాకర్‌ను ముక్కలుగా నరికి హత్య చేసిన కేసులో నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా (28) నిజాల్ని అంగీకరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. కస్టడీలో చెప్పిన విషయాలకు, సత్యశోధన పరీక్షలైన పాలీగ్రాఫ్, నార్కో అనాలసిస్ పరీక్షల్లో వచ్చిన ఫలితాలకు పొంతన కుదిరిందని వివరించాయి. తనను శాశ్వతంగా విడిచిపెడుతానని హెచ్చరించినందువల్లనే ఆమెను హత్య చేసినట్టు చేసిన నేరాన్ని ఒప్పుకొన్నాడు. ఇంటి ఖర్చుల విషయంలో ఇద్దరి మధ్యా ఘర్షణలు జరిగాయని పేర్కొన్నాడు. సంబంధాలు దెబ్బతిన్నాయని అందువల్ల క్షణికావేశంలో హత్య చేసినట్టు చెప్పాడు. గురువారం జరిగిన నార్కో అనాలసిస్ పరీక్షల్లో తాను ఎలా హత్యా చేసింది, ఎక్కడెక్కడ శరీర భాగాలన్ని పడేసింది పూసగుచ్చినట్టు వివరించాడు. తల భాగాన్ని ఎక్కడ పడేసింది మాత్రం కచ్చితంగా చెప్పలేకపోయాడు. రోహిణి ఆస్పత్రిలో రెండు గంటల పాటు ఈ నార్కో అనాలసిస్ పరీక్ష జరిగింది. ఇద్దరు వైద్యులు, ఒక సైకాలజిస్ట్, ఇద్దరు ఫొటో నిపుణులు పాల్గొన్నారు. ఈ పరీక్షల అనంతరం ఆఫ్తాబ్ ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ‘ట్రూత్ సీరం’ ఇచ్చిన కారణంగా పరీక్ష జరుగుతున్న సమయంలో ఒకటి రెండుసార్లు స్పృహ కోల్పోయాడు. తట్టిలేపి మళ్లీ ప్రశ్నలు వేశారు.
పరీక్షలు పూర్తయిన తరువాత రెండు గంటలపాటు పరిశీలనలో ఉంచారు. మొత్తంగా 20-25 ప్రశ్నలు వేసినట్టు సమాచారం. ఒక్కడివే హత్య చేశావా? ఏ విధంగా చంపావు? మొబైల్, వస్త్రాలు ఎక్కడ పడేశావు? తదితర ప్రశ్నలు అడిగారు. హత్య చేసిన అనంతరం కత్తి, రంపంతో శరీరాన్ని ముక్కలు చేసినట్టు చెప్పాడు. దక్షిణ ఢిల్లీలోని అటవీ ప్రాంతంలో వీటిని పడేసినట్టు వివరించాడు. ఈ పరీక్ష అనంతరం శుక్రవారం తిహార్ జైలులో ‘పోస్ట్ టెస్ట్ ఇంటర్వ్యూ’ నిర్వహించారు. ఈ సందర్భంలో కూడా మాట మార్చలేదని తెలిపాయి.. దీంతో ఈ పరీక్ష పూర్తయింది. అందువల్ల ఈ కేసులో ఇంకెలాంటి మలుపులూ ఉండబోవని తెలిపాయి. చనిపోయింది శ్రద్ధే అని నిర్ధరించేందుకు చేసిన డీఎన్‌ఏ పరీక్ష ఫలితాలు వచ్చే వారం అందనున్నాయని పేర్కొన్నాయి. ఆమె తల, ఇతర శరీర భాగాలు దొరకాల్సి ఉందని, వాటి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్టు వివరించాయి. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలు సేకరించినట్టు తెలిపాయి.
Updated Date - 2022-12-03T04:30:49+05:30 IST