Telangana: బీజేపీ సీఎం మాట్లాడుతుండగా మైక్ విరిచేసిన టీఆర్ఎస్ కార్యకర్త.. ఉలిక్కిపడ్డ పోలీసులు
ABN, First Publish Date - 2022-09-09T22:31:49+05:30
హైదరాబాద్: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పాల్గొన్న బహిరంగసభలో ఉద్రిక్తత నెలకొంది.
హైదరాబాద్: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పాల్గొన్న బహిరంగసభలో ఉద్రిక్తత నెలకొంది. శర్మ మాట్లాడుతున్న సమయంలో టీఆర్‌ఎస్ కార్యకర్త ఒకరు సమీపం దాకా రావడంతో పాటు మైక్ విరిచేశాడు. శర్మను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు చేశాడు. అప్రమత్తమైన భాగ్యనగర్ ఉత్సవ్ సమితి నాయకులు వెంటనే టీఆర్‌ఎస్ కార్యకర్తను స్టేజీపై నుంచి కిందకు దించేశారు. ఇంతలో వచ్చిన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తను అక్కడ నుంచి తరలించారు. భద్రతా వైఫల్యంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో హైదరాబాద్ పోలీసులు ఉలిక్కిపడ్డారు.
అంతకు ముందు హిమంత బిశ్వా శర్మ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం నిజాం పాలనని కొనసాగిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. కుటుంబ పాలన నుండి విముక్తి కలిగాలని భాగ్యలక్ష్మీ అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. కేవలం ఒక కుటుంబానికే పరిమితమైన అధికారం తెలంగాణ ప్రజలందరికీ రావాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో అందరి ఇండ్లలోకి మహాలక్ష్మి రావాలని వేడుకున్నానని శర్మ తెలిపారు.
Updated Date - 2022-09-09T22:31:49+05:30 IST