Covid-wave : చైనా మాదిరిగా మన దేశంలో కోవిడ్ ప్రభంజనం ఉండకపోవచ్చు... అందుకు కారణాలు మూడు...
ABN, First Publish Date - 2022-12-22T18:03:58+05:30
చైనాలో కోవిడ్ కేసులు విజృంభిస్తుండటంతో మన దేశంలో ఆందోళన పెరుగుతోంది.
న్యూఢిల్లీ : చైనాలో కోవిడ్ కేసులు విజృంభిస్తుండటంతో మన దేశంలో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ పత్రిక ఇరు దేశాల్లో పరిస్థితులను పోల్చి చూసి, చైనా మాదిరిగా మన దేశంలో కోవిడ్ విజృంభించే అవకాశం లేదని, అందుకు మూడు కారణాలు ఉన్నాయని వెల్లడించింది. అయితే ప్రజలకు టీకాకరణ (Vaccination) చేసే విషయంలో చురుగ్గా చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని తెలిపింది. ఈ విశ్లేషణ ఏమిటంటే...
చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికా వంటి దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం మన దేశంలోని కోవిడ్ పరిస్థితిని సమీక్షించింది. ఆల్ టైమ్ హై కేసులు నమోదవుతున్న అతి పెద్ద దేశం చైనా కాబట్టి, అక్కడి కోవిడ్ ప్రభంజనానికి కారణాలను పరిశీలించి, మన దేశం సురక్షితమేనా? అనే అంశాన్ని పరిశీలించవలసి ఉంటుంది. ఇరు దేశాల సమాచారాన్ని పోల్చి చూసినపుడు చైనా కన్నా మన దేశం కోవిడ్ విషయంలో మెరుగైన స్థితిలో కనిపిస్తున్నట్లు వెల్లడైంది. వ్యాక్సినేషన్ విషయంలో డైనమిక్ యాక్షన్ లేకపోతే ఈ అంచనా వాస్తవ రూపం దాల్చబోదు.
చైనా కన్నా భారత దేశం మెరుగైన స్థితిలో కనిపించడానికి మూడు కారణాలు ఉన్నాయి. అవి :
1. చైనా వ్యాక్సిన్ల కన్నా భారత దేశ వ్యాక్సిన్లు మెరుగ్గా పని చేస్తుండటం :
చైనా వ్యాక్సిన్ల కన్నా భారత దేశ వ్యాక్సిన్లు మెరుగ్గా పని చేస్తున్నాయి, అయితే మన దేశం బూస్టర్ డోస్‌ల పంపిణీని వేగవంతం చేయాలి. ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా అభివృద్ధిపరచిన, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధిపరచిన కోవాగ్జిన్ మన దేశంలో ఎక్కువ మందికి ఇచ్చారు. మన దేశంలో పంపిణీ అయిన మొత్తం టీకా మోతాదుల్లో 96 శాతం వరకు కొవిషీల్డ్, కోవాగ్జిన్‌లే. వీటిలో 80 శాతం డోసులు కొవిషీల్డ్ వ్యాక్సిన్‌వే. చైనా ప్రజలకు ఇచ్చిన కరోనావాక్ (CoronaVac), కొవిషీల్డ్ సామర్థ్యాలను పోల్చుతూ బ్రెజిల్‌లో దాదాపు 10 లక్షల మందిపై అధ్యయనం జరిగింది. ఈ రెండూ యువత విషయంలో ఒకే విధమైన రక్షణను అందిస్తున్నాయని, అయితే తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు గురైన వృద్ధుల విషయంలో కరోనావాక్ తక్కువ సమర్థతను కనబరచిందని వెల్లడైంది. వయసు 79 సంవత్సరాల వరకుగలవారు తీవ్రంగా ఈ వ్యాధికి గురైనపుడు కరోనావాక్ 60 శాతం, ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ 76 శాతం రక్షణ కల్పించినట్లు వెల్లడైంది. 80 ఏళ్లుపైబడినవారు తీవ్రంగా ఈ వ్యాధికి గురైపుడు కరోనావాక్ కేవలం 30 శాతం రక్షణ మాత్రమే కల్పిస్తోందని తెలిసింది. అయితే ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ 67 శాతం రక్షణ కల్పించినట్లు వెల్లడైంది. ఈ వయసువారికి ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నపుడు మరణించకుండా రక్షణ కల్పించడంలో కరోనావాక్ 45 శాతం, ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ 85 శాతం సమర్థతను కనబరిచాయని తేలింది.
వయసునుబట్టి టీకాలు ఇచ్చే విధానం చైనా, భారత్ మధ్య వేర్వేరుగా, పరస్పర వ్యతిరేకంగా ఉంది. చైనా వృద్ధుల కన్నా యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పాశ్చాత్య దేశాల్లో ఇచ్చిన mRNA వ్యాక్సిన్లు చైనాలో ఇచ్చిన కరోనావాక్ కన్నా ఎక్కువ సమర్థవంతమైనవని తేలింది. అయితే చైనాలో పెరుగుతున్నంత తీవ్ర స్థాయిలో కాకపోయినా, అమెరికా, యూరోపియన్ దేశాల్లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
బూస్టర్ డోసులు ఇవ్వడంలో భారత దేశం వెనుకబడింది. 10 కోట్ల కన్నా ఎక్కువ జనాభాగల 14 దేశాల్లో బూస్టర్ డోసుల కవరేజ్‌ని పరిశీలించినపుడు, భారత దేశం 10వ స్థానంలో (16 శాతం మంది) ఉంది. బ్రెజిల్‌లో 57 శాతం మంది, అమెరికాలో 40 శాతం మంది బూస్టర్ డోసులు తీసుకున్నారు. అక్టోబరు 31 వరకు నమోదైన వివరాల ప్రకారం 71.9 కోట్ల మంది వయోజనులు ఇంకా బూస్టర్ డోస్ తీసుకోలేదు. ఆరు నెలల గ్యాప్ ఉన్నప్పటికీ, అర్హత ఉన్నప్పటికీ వీరు బూస్టర్ డోస్ తీసుకోలేదు. అక్టోబరు 31 తర్వాత పంపిణీ అయిన బూస్టర్ డోసులు కేవలం 25 లక్షలు మాత్రమే. మరోవైపు ఆరు కోట్ల మంది టీనేజర్లు, ఏడున్నర కోట్ల మంది ఇతరులు రెండో డోసును తీసుకోలేదు.
2. మన దేశంలో అత్యధికులకు ఇటీవల కోవిడ్-19 సోకడం :
బూస్టర్ డోసుల విషయంలో మన దేశం వెనుకబడి ఉన్నప్పటికీ, చైనాలో తాజా ప్రభంజనాన్ని చూసి భయపడవలసిన అవసరం లేకపోవడానికి మరొక కారణం ఏమిటంటే, చైనాలో ఇటీవలి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందేందుకు సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తిని కలిగియుండే అవకాశం అతి తక్కువ మందికి మాత్రమే ఉంది. దీనికి కారణం కఠినమైన అష్టదిగ్బంధనాలు (Lockdowns) అమలవడమే. డిసెంబరు 20 వరకు క్యుములేటివ్ కోవిడ్-19 కేసులు చైనాలో 2 మిలియన్లు కాగా, మన దేశంలో 45 మిలియన్లు. అంటే చైనాలో ప్రతి మిలియన్ జనాభాకు 1,348 మందికి, మన దేశంలో ప్రతి మిలియన్ జనాభాకు 32,819 మందికి ఈ ఇన్ఫెక్షన్ సోకింది,
3. మన దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జూలై నుంచి ఉండటం :
చైనాలో కోవిడ్ కేసులు పెరగడానికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ మన దేశంలో జూలై నుంచి ఉంది. అంటే ఈ వేరియంట్‌తో మన దేశానికి చాలా పరిచయం ఉందన్నమాట. డిసెంబరు 9నాటి శాంపిల్స్‌లో వెల్లడైన వివరాల ప్రకారం బీఎఫ్.7 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ 14 శాతం శాంపిల్స్‌లో ఉందని, బీక్యూ.1.1 సబ్ వేరియంట్ 7 శాతం శాంపిల్స్‌లో ఉందని తేలింది. నవంబరు 3నాటి డేటాలో అన్ని శాంపిల్స్‌లోనూ బీక్యూ.1.1 కనిపించింది. కానీ భారత దేశంలో మాత్రం బీఎఫ్.7 సబ్ వేరియంట్ జూలైలో మొట్టమొదట కనిపించింది. నవంబరు 30నాటి డేటా ప్రకారం ఈ వేరియంట్ కనిపించలేదు.
దీనినిబట్టి భారత దేశంలో గత ఏడాది డిసెంబరు నుంచి ప్రత్యేకమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ప్రారంభమైందని తెలుస్తోంది. చైనా కన్నా భారత దేశం ఒమిక్రాన్ నుంచి మెరుగైన రక్షణ పొందినట్లు తెలుస్తోంది. అయితే కోవిడ్-19 శాంపిల్స్ సీక్వెన్సింగ్‌లో చాలా తేడాలు ఉన్నాయి. చైనాలో 3,313 శాంపిల్స్‌ను, భారత దేశంలో 2,23,588 శాంపిల్స్‌ను, అమెరికాలో 42,55,409 శాంపిల్స్‌ను సీక్వెన్స్ చేశారు. కొత్త సబ్ వేరియంట్ నుంచి ప్రస్తుతం భారత దేశం రక్షణ పొందినప్పటికీ, ఇది జీవిత కాలమంతా ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. ఒమిక్రాన్ ప్రభంజనం మన దేశంలోకి మొదటిసారి వచ్చినపుడు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. బూస్టర్ల కోసం కూడా ప్రజలు బారులుతీరారు. ఇదంతా జరిగి ఓ ఏడాది గడచిపోయింది. మళ్లీ వ్యాక్సినేషన్ జరగాలి లేదంటే కొత్త వేరియంట్ల నుంచి కాపాడగలిగే కొత్త వ్యాక్సిన్లను ఇవ్వాలి. కోవిడ్ విషయంలో ప్రస్తుతం మనం అనుసరిస్తున్న విధానం బాగుందని, అయితే ఇది సరిపోతుందనే స్థాయిలో లేదని నిపుణులు చెప్తున్నారు. మరింత మెరుగైన, పటిష్టమైన టీకాల కోసం కృషి చేయవలసి ఉందని చెప్తున్నారు.
Updated Date - 2022-12-22T19:41:19+05:30 IST