Udayanidhi: స్టాలిన్ వారసుడికి పలువురి శుభాకాంక్షలు
ABN, First Publish Date - 2022-12-15T07:54:14+05:30
రాష్ట్రమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin)కు సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు
చెన్నై, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin)కు సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్‌హాసన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రజనీకాంత్ తన ట్విట్టర్ పేజీలో మంత్రి పదవిని చేపడుతున్న ప్రియమైన తమ్ముడు ఉదయనిధి కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ఇదే విధంగా కమల్‌హాసన్(Kamal Haasan) కూడా ‘తమ్ముడూ మంత్రి అయ్యావు. దానిని పదవిగా కాకుండా బాధ్యతగా భావించు! మూడు తరాల అనుభవం మీకు తోడుగా ఉంటుందని ఆశిస్తున్నాను. మీ నుంచి ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు. వారి కోరికలు నెరవేర్చటంలోనే మీ విజయం దాగి ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. ద్రవిడ కళగం ప్రధాన కార్యదర్శి కే వీరమణి కూడా ఉదయనిధికి శుభాకాంక్షలు తెలిపారు. డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉదయనిధి సమర్థవంతమైన మంత్రిగా మారటం తథ్యమన్నారు.
కనిమొళి శుభాకాంక్షలు...
మంత్రి ఉదయనిధికి ఆయన మేనత్త, డీఎంకే ఎంపీ కనిమొళి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డీఎంకే యువజన విభాగం నాయకుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రముఖ సినీ గేయరచయిత వైరముత్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ తాను నిత్యం ఆరాధించే కలైంజర్ కుటుంబం నుంచి వచ్చిన మరో మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) అని, వారసత్వ రాజకీయాలు అంటూ విమర్శలు చేసేవారి నోళ్లు మూయించేలా సమర్థవంతంగా పనిచేసి అందరి మెప్పు పొందగలడనే నమ్మకం తనకుందని పేర్కొన్నారు.
ఛాంబర్‌లో నలుగురి ఫొటోలు...
సచివాలయం రెండో అంతస్థులో మంత్రి ఉదయనిధికి కేటాయించిన ఛాంబర్‌లో నలుగురు నేతల చిత్రపటాలున్నాయి. దివంగత ద్రవిడ ఉద్యమనేత పెరియార్, మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ ఫొటోలు గోడకు పెట్టారు. ఆయన బల్లపై తాత కరుణానిధి, తండ్రి స్టాలిన్ ఫొటోలున్నాయి.
తనయుడికి వీడియోకాల్...
రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఏర్పాటైన తేనీటి విందులో పాల్గొన్న ఉదయనిధి విదేశాల్లో ఉన్న తన కుమారుడు ఇన్బనిధికి వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆ సందర్భంగా ఇన్బనిధి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత తన పక్కనే కూర్చున్న కుటుంబ సభ్యులతో ఉదయనిధి సెల్ఫీ తీసుకున్నారు.
Updated Date - 2022-12-15T07:54:16+05:30 IST