twin towers: టవర్లను కూల్చేందుకు బటన్ నొక్కిన తర్వాత ఏడ్చేసిన చేతన్ దత్తా
ABN, First Publish Date - 2022-08-29T02:39:19+05:30
గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నానుతున్న నోయిడాలోని సూపర్ టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత ఎట్టకేలకు పూర్తయింది
నోయిడా: గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నానుతున్న నోయిడాలోని సూపర్ టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత ఎట్టకేలకు పూర్తయింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కేవలం 9 నిమిషాల్లోనే 40 అంతస్తుల భవనాలు నేల కూలాయి. ఈ కూల్చివేత దేశ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘటనల్లో ఒకటిగా మిగిలిపోనుంది. 3,700 కిలోల పేలుడును ఉపయోగించి జాగ్రత్తగా నియంత్రిస్తూ వీటిని నేలమట్టం చేశారు. ఈ టవర్లను నేలమట్టం చేసేందుకు బటన్ నొక్కిన అధికారి పేరు చేతన్ దత్తా. ఎడిఫైస్ ఇంజినీరింగ్‌కు చెందిన ఆయన ఆ తర్వాత కన్నీరు ఆపుకోలేకపోయారు.
కూల్చివేత పూర్తయిన తర్వాత ఈ టాస్క్‌లో పాల్గొన్న దత్తాతోపాటు మరో నలుగురు అధికారులు కూల్చివేసిన భవనాల వద్దకు వెళ్లారు. ఆ వెంటనే దత్తా సహా వారందరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూల్చివేత 100 శాతం విజయవంతమైనట్టు చెప్పారు. అందుకు 9-10 సెకన్ల సమయం పట్టిందన్నారు. దత్తా బృందంలో మొత్తం 10 మంది ఉండగా అందులో ఏడుగురు విదేశీ నిపుణులు ఉన్నారు. అలాగే, ఎడిఫైస్ ఇంజినీరింగ్‌కు చెందిన 20-25 మంది కూడా ఉన్నట్టు దత్తా తెలిపారు.
భవనాల కూల్చివేతకు హెచ్చరిక సైరన్ మోగిన తర్వాత తాను, తన బృందం సభ్యులు ఒకరితో ఒకరం ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదని దత్తా పేర్కొన్నారు. బటన్ నొక్కిన వెంటనే కూలుతున్న జంట నిర్మాణాలను పరిశీలించేందుకు తాను తలను పైకి లేపానని దత్తా వివరించారు.
Updated Date - 2022-08-29T02:39:19+05:30 IST