Jiang Zemin : జియాంగ్ జెమిన్ మరణంతో జీ జిన్‌పింగ్‌లో కలవరం
ABN, First Publish Date - 2022-12-01T19:30:02+05:30
చైనా కమ్యూనిస్టు పార్టీ నేతల మరణాలు ఆ దేశ నాయకత్వాలకు కొత్త సవాళ్ళను విసురుతుండటం ఆనవాయితీగా మారింది.
న్యూఢిల్లీ : చైనా కమ్యూనిస్టు పార్టీ నేతల మరణాలు ఆ దేశ నాయకత్వాలకు కొత్త సవాళ్ళను విసురుతుండటం ఆనవాయితీగా మారింది. ఆ పార్టీ అగ్ర నేత చౌ ఎన్‌లై 1976లో మరణించినపుడు పెద్ద ఎత్తున అసమ్మతి, నిరసన వ్యక్తమైంది. మరో అగ్ర నేత హు యవోబాంగ్ (Hu Yaobang) 1989 ఏప్రిల్‌లో మరణించిన తర్వాత తియానన్మెన్ స్క్వేర్ నిరసన ఉద్యమం వచ్చింది. ఆయన తర్వాత కీలక బాధ్యతలు చేపట్టిన జియాంగ్ జెమిన్ (Jiang Zemin) బుధవారం మరణించడంతో ప్రజా స్పందన ఏ విధంగా ఉంటుందోనని ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) కలవరపడుతున్నారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కేందుకు జియాంగ్ మరణాన్ని ఓ సాకుగా తీసుకుంటారా? అనే ఆందోళన కనిపిస్తోంది.
హు యవోబాంగ్‌కు అత్యధిక ప్రజాదరణ ఉండేది. ఆయనతో పోల్చితే జియాంగ్ జెమిన్‌కు అంత ప్రజాదరణ లేదు. కానీ జియాంగ్ చైనా అధ్యక్షునిగా పని చేసిన కాలంలో ప్రజలు కనీసం తమ కష్టాల గురించి బహిరంగంగా చర్చించుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం జిన్‌పింగ్ హయాంలో కోవిడ్-19 మహమ్మారి నియంత్రణ పేరుతో కట్టుదిట్టమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు. పరిపాలన నియంతృత్వంతో సాగుతోందని, సెన్సార్‌షిప్, భావజాలపరమైన నియంత్రణలను నూతన శిఖరాలకు తీసుకెళ్ళారనే విమర్శ జిన్‌పింగ్‌పై ఉంది. దీంతో 1989 తర్వాత ఎన్నడూ కనిపించని వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తోంది. జియాంగ్ పరిపాలించిన 1990వ దశకంలో రాజకీయ స్వేచ్ఛ గురించి కనీసం బహిరంగంగా చర్చించే అవకాశం ఉండేదని, మళ్లీ ఆ రోజులు రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వ్యంగ్యాస్త్రాలు
జియాంగ్ మరణించినట్లు బుధవారం ప్రకటించిన వెంటనే ప్రజలు ఆన్‌లైన్‌లో ఆయనకు నివాళులర్పించడం ప్రారంభించారు. ఆయన జీవిత కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజాదరణను పొందకపోయినప్పటికీ, ఆయన పరిపాలనను, ప్రస్తుత జిన్‌పింగ్ పాలనతో పోల్చుతూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
అయితే జియాంగ్ కూడా అణచివేత విధానాలను అవలంబించిన దాఖలాలు ఉన్నాయి. ఫాలున్ గోంగ్ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని అనుసరించేవారిపై ఆయన ఉక్కుపాదం మోపారు. తన గురించి తనకు విపరీతమైన అభిప్రాయాలు ఉండేవి. ప్రజల రాజకీయ జీవితాన్ని కట్టుదిట్టంగా నియంత్రించినప్పటికీ, న్యాయవాదులు, వాణిజ్య వార్తా సంస్థలు, అసమ్మతివాదులు, స్వేచ్ఛాభావాలుగల పార్టీ మేధావులు బహిరంగ చర్చల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చేవారు. ఇటువంటి పరిస్థితులు జీ జిన్‌పింగ్ పాలనా కాలంలో కనిపించడం లేదు.
‘‘గతంలో మిమ్మల్ని పొరపాటున నిందించాం’’ అని జియాంగ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘1997లో ‘టైటానిక్’ సినిమాను చూడటానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు వీడ్కోలు’’ అని మరొక నెటిజన్ పేర్కొన్నారు.
కోవిడ్ ఆంక్షలపై తిరుగుబాటు
కోవిడ్ మహమ్మారిని నిరోధించడం కోసం చైనాలో అమలవుతున్న కఠినాతికఠినమైన ఆంక్షలపై ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతోంది. షాంఘై, బీజింగ్, చెంగ్దు, ఇతర నగరాల్లో వేలాది మంది బయటికొచ్చి నిరసన తెలుపుతున్నారు. కొందరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కావాలని, సెన్సార్‌షిప్‌కు తెర పడాలని, జీ జిన్‌పింగ్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు చైనా ప్రభుత్వం దిగి వచ్చి, ఆంక్షలను సడలించింది.
ఈ నేపథ్యంలో జియాంగ్ జెమిన్ అంత్యక్రియల కార్యక్రమాలు నిరసనకారులకు ఓ ఆయుధంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం జీ జిన్‌పింగ్ ప్రభుత్వానికి ఏర్పడింది. అందుకే జియాంగ్ మరణం గురించి ప్రకటించేటపుడు కమ్యూనిస్ట్ పార్టీ మెలకువగా వ్యవహరించింది. జియాంగ్ సాధించిన విజయాలను కొనియాడుతూనే, జీ జిన్‌పింగ్‌కు మద్దతుగా యావత్తు దేశం నిలవాలని కోరింది.
డెంగ్ జియావోపింగ్ వంటి గత చైనీస్ నాయకుల అంత్యక్రియల సంప్రదాయాలనుబట్టి చూస్తే, జియాంగ్ అంత్యక్రియలకు కూడా అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించబోరని స్పష్టమవుతోంది. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో జరిగే ఈ కార్యక్రమంలో జీ జిన్‌పింగ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ నేతలు, ఇతర అధికారులు కూడా హాజరవుతారు. అయితే కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి సంఖ్య పరిమితంగా ఉండవచ్చు.
ఇదిలావుండగా, జీ జిన్‌పింగ్ బుధవారం లావోషియన్ నేతతో మాట్లాడుతూ, భారమైన హృదయంతో కామ్రేడ్ జియాంగ్ జెమిన్‌కు సంతాపం తెలుపుతామని, నివాళులర్పిస్తామని చెప్పినట్లు ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. తమ విచారాన్ని శక్తి, బలంగా మార్చుకుంటామని చెప్పినట్లు తెలిపింది.
Updated Date - 2022-12-01T19:30:06+05:30 IST