Aishwarya Damayanti: నోబెల్ గ్రహీతలు మెచ్చిన మన దమయంతి
ABN, First Publish Date - 2022-12-25T23:33:19+05:30
‘ప్రపంచ శాంతి సంరక్షణలో యువత బాధ్యత’ అంశంపై తన ప్రసంగంతో..ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశంలోని దేశదేశాల అతిథులను ఆకట్టుకున్నారు 23 ఏళ్ళ గోనెల ఐశ్వర్య దమయంతి.
‘ప్రపంచ శాంతి సంరక్షణలో యువత బాధ్యత’ అంశంపై తన ప్రసంగంతో..ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశంలోని దేశదేశాల అతిథులను ఆకట్టుకున్నారు 23 ఏళ్ళ గోనెల ఐశ్వర్య దమయంతి. తద్వారా నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల మధ్య కూర్చొనే అరుదైన అవకాశాన్నీ అందుకున్నారు.అంతర్జాతీయ వేదికపై భారత యువజనుల ప్రతినిధిగా మన దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు... ఈ తెలుగమ్మాయి. ‘వరల్డ్ నోబెల్ పీస్ సమ్మిట్’లో తన ప్రాతినిధ్యంతో పాటు మరికొన్ని విశేషాలను ఐశ్వర్య ‘నవ్య’తో చెబుతున్నారిలా...
‘‘మా అమ్మ నిర్మలాదేవి, నాన్న గోనెల రాజేంద్ర మోహన్.... ఇద్దరూ ఐఏఎ్‌సలే. మా ఇంటికి ఎవరు వచ్చినా, వాళ్ల నేపథ్యం ఏదైనా... అన్నం పెట్టి కానీ తిరిగి పంపించేది కాదు మా అమ్మమ్మ విజయలక్ష్మి. ‘సొంతలాభం కొంత మానుకొని పరుల కోసం పాటు పడాల’నే గురజాడ సూక్తిని నేను మా అమ్మమ్మ ద్వారానే తెలుసుకున్నాను. సాటి మనిషిని సమానంగా చూడలేని మనిషి మనిషే కాదని మా నాన్న నాకెప్పుడూ చెబుతుంటారు. అవన్నీ నాలో సమాజం పట్ల సానుకూల దృక్పథాన్ని అలవర్చాయి. ’’
‘‘కుల, మత, ప్రాంతాలు, దేశాల సరిహద్దులతో సంబంధం లేకుండా ‘సాటి మనుషులను మనుషులుగా చూడటమే ఓ మనిషికి ఉండాల్సిన ప్రధాన అర్హత’ అని నేను బలంగా నమ్ముతాను. అదే నన్ను ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశం వరకు తీసుకువెళ్లింది. హైదరాబాద్ సెయింటాన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ‘నేషనల్ సర్వీస్ స్కీమ్’ (ఎన్‌ఎ్‌సఎ్‌స) కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేదాన్ని. పల్లెలు, బస్తీలతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చదువు ఆవశ్యకత, పారిశుద్ధ్యం, అమ్మాయిల హక్కులు లాంటి అంశాలపై అవగాహన తరగతులు నిర్వహించాను. అదే సమయంలో మహిళల అక్రమ రవాణా, గృహహింస తదితర సమస్యలకు వ్యతిరేకంగా కొన్ని శిక్షణ శిబిరాల్లోనూ భాగస్వామినయ్యాను. నా ఆసక్తులను గుర్తించిన మా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ భ్రమరశ్రీ సామాజిక సేవా కార్యక్రమాల్లో నన్ను మరింత ప్రోత్సహించారు. ఆమె సూచనతోనే ‘గాంధీ కింగ్ ఫౌండేషన్’ ద్వారా ‘వరల్డ్ నోబెల్ పీస్ సమ్మిట్’కు దరఖాస్తు చేశాను. ఇంటర్వ్యూలో ప్రపంచ శాంతిని నెలకొల్పడంపై నేను చెప్పిన సమాధానాలు ప్యానల్‌కూ బాగా నచ్చాయి. దాంతో దక్షిణ కొరియా, గ్యాంగ్వాన్ ప్రావిన్స్ వేదికగా జరిగిన ‘18వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశం’లో భారత యువత ప్రతినిధిగా పాల్గొనే అరుదైన అవకాశం నాకు దక్కింది. ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగిన ఆ సదస్సులో ఒకరోజు... ‘ప్రపంచ శాంతి పరిరక్షణ - యువత బాధ్యత’ అంశంపై మాట్లాడేందుకు నాకు తొంభై నిమిషాల సమయం ఇచ్చారు.
నేనెలా ద్వేషించగలను?
నా ప్రసంగంలో భాగంగా... భారతీయ తత్త్వశాస్త్ర ఔన్నత్యాన్ని, ఇక్కడి మహనీయుల శాంతి సందేశాలను ప్రస్తావిస్తూ, మన దేశంలోని భిన్న సంస్కృతుల వైవిధ్యాన్ని వివరించేందుకు ప్రయత్నించాను. వివిధ దేశాల ప్రజలు, ముఖ్యంగా యువత ఒకచోట కలిసి అభిప్రాయాలు పంచుకొనే వెసులుబాటు కల్పించడం ద్వారా యుద్ధాలను నిలువరించగలమని సూచించాను. తద్వారా దేశాల మఽధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని చెప్పాను. ‘‘భారత్, పాక్ శత్రు దేశాలుగా ఎందుకున్నాయి?’’ అంటూ నన్ను ఒక పాకిస్థానీ జర్నలిస్టు అడిగారు. ‘‘కేవలం రాజకీయపరంగా అవి రెండూ శత్రుదేశాలేమో కానీ, సామాన్యుల దృష్టికోణంలో మాత్రం ఇండియా, పాక్ ఎప్పుడూ సోదర దేశాలే’’ అని సమాధానమిచ్చాను. ‘‘నా సంస్కృతికి మూలమైన హరప్పా నాగరికత ఆనవాళ్లు కలిగిన నేలను నేనెలా ద్వేషించగలను?’’ అన్నప్పుడు సభికులంతా చప్పట్లతో ప్రశంసించారు. నా ఆలోచనలను, అభిప్రాయాలను విన్న వరల్డ్ నోబెల్ పీస్ సమ్మిట్ అధ్యక్షురాలు ఎకటెరిన జగ్లాడినా నన్ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు, ‘‘నోబెల్ పీస్ సమ్మిట్‌ను ఇండియాలో నిర్వహించాలనుకుంటున్నాం. అప్పుడు యూత్ ప్రోగ్రాం బాధ్యతలను నువ్వు చూసుకోవాలి’’ అని కూడా ఆమె అన్నారు. తర్వాత జగ్లాడినా స్వయంగా నన్ను విందుకు ఆహ్వానించారు. అప్పుడు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల మధ్య కూర్చొని సంభాషించడం నాకు జీవితకాల మధురానుభూతి. క్రిస్టీన్ ఆన్ అనే ఉత్తర కొరియా మహిళ... ఆ దేశ నిర్బంధాల నుంచి తాను ఎలా తప్పించుకొని బయటపడిందీ చెబుతుంటే.. నా కళ్లు చెమ్మగిల్లాయి. ఆమె స్ఫూర్తిగాథ నన్ను కదిలించింది. ఇక ఆ మూడు రోజులూ అమెరికా, జపాన్, కొలంబియా, వియత్నాం, శ్రీలంక, పాక్... ఇలా ముఫ్ఫైదేశాల యువతతో సంభాషించడం నాకు లభించిన అరుదైన అవకాశం. జపాన్ యువతలో ఆత్మహత్యల శాతం ఎక్కువని విని బాధపడ్డాను. ఆ దేశ ప్రభుత్వం యువజన శక్తిని గుర్తించక పోవడమే అందుకు కారణమట.
పాకిస్థానీల నోట ‘బాహుబలి’ మాట...
నేను డిగ్రీ చదువుతున్నప్పుడు... అంటే 2019లో యూఎస్ కాన్సులేట్ వాళ్లు మా కాలేజీ నుంచి ‘చాట్ విత్ ద డిప్లొమాట్ - ఇండియా, పాకిస్థాన్’ కార్యక్రమానికి నన్ను సంధానకర్తగా ఎంపిక చేశారు. అందులో భాగంగా పాక్ యువతీ యువకులతో నేను రెండుసార్లు ఆన్‌లైన్ ద్వారా సంభాషించాను. అప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. వాళ్ల ప్రభుత్వం పాఠ్యాంశాల ద్వారా భారత్ పట్ల కొంత వ్యతిరేకతను విద్యార్థులకు నూరిపోస్తోందట. పాకిస్థాన్ పట్ల వ్యతిరేకమైన మాటలను చిన్నతనంలో నేనూ విన్నాను. అంతేకాదు, ఆఫ్రికా దేశాల యువత అంటే నేరగాళ్లనే దురభిప్రాయం కూడా సమాజంలో బలంగా ఉంది కదా.! ఇలాంటి అపోహలను, సంకుచిత భావాలను మన వంతుగా తొలగించాలని పాక్ విద్యార్థులతోనూ చర్చించాను. నేను ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని మతసామరస్యం గురించి చెప్పినప్పుడు, వాళ్లంతా ఆనందించారు. అలానే ‘బాహుబలి’ సినిమా గురించి పాక్ యువత మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ల యూత్ అసోసియేషన్ ద్వారా భారత్ పట్ల సామాన్యుల్లో నెలకొన్న ద్వేష భావనలను పోగొట్టేందుకు పనిచేస్తామని పాక్ యువతీ యువకులు నాకు మాటిచ్చారు కూడా. మన దేశంలోనూ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సోషల్‌మీడియాలో ఫేక్ న్యూస్ రావడం బాధాకరం. దాన్ని నిలువరించడం మన బాధ్యత. అలానే అఫ్ఘనిస్థానీ యువతతోనూ చర్చించాను. ఇవాళ్టికీ వారందరితో నా స్నేహం కొనసాగుతోంది. యూఎస్ కాన్సులేట్ చేపట్టిన ఇలాంటి చర్చాగోష్ఠులను ఇరు దేశాలూ నిర్వహించాలి. అప్పుడే మనలో అపోహలు తొలగి స్నేహపూర్వకమైన ఆలోచనలు వికసిస్తాయి.
సామాజిక మార్పులో భాగం కావాలని...
ప్రస్తుతం ‘సెంటర్ ఫర్ ఇండియన్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీ్‌స’లో రీసెర్చి అసోసియేట్‌గా పనిచేస్తున్నాను. ఆ క్రమంలోనే సిద్ధిపేట పరిసరాల్లోని అడవులను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా సంరక్షించే పద్ధతిపై నా ఆలోచనలను అటవీ శాఖ అధికారులకు చెబితే, అవి వారికి నచ్చాయి కూడా. ‘రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవల్‌పమెంట్’.. తమిళనాడులో లింగ సమానత్వంపై ప్రత్యేక కోర్సు పూర్తి చేశాను. అన్నీ రకాల అసమానతలకు వ్యతిరేకంగా, అవకాశం దొరికిన ప్రతిచోటా గళం వినిపిస్తూనే ఉన్నాను. యువతరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద ప్రస్తావించాను. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వ, పరిపాలనా రంగాలలో యువజనుల భాగస్వామ్యం తప్పనిసరి. సోషల్‌మీడియాను కాలక్షేపానికి కాకుండా సామాజిక రుగ్మతలను, వ్యవస్థల్లోని లోపాలను బహిర్గతం చేసేందుకు యువత వినియోగించాలనేది నా విజ్ఞప్తి. అదే నేనూ ఆచరిస్తున్నాను. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కింగ్స్ కాలేజీలలో మాస్టర్స్‌కు నాకు సీటు వచ్చింది. అయితే, సామాజిక మార్పులో నేనూ భాగస్వామి కావాలన్నది నా కోరిక. సివిల్ సర్వీస్ ద్వారా ఆ పని కొంతమేరకు చేయవచ్చని నమ్ముతాను. అందుకే విదేశాల్లో చదివే అవకాశాన్ని పక్కన పెట్టాను. ప్రస్తుతం సివిల్స్‌కు సిద్ధమవుతున్నాను.’’
కె.వెంకటేశ్,
ఫొటోలు - ఆర్. రాజ్‌కుమార్
Updated Date - 2022-12-25T23:33:20+05:30 IST