కృష్ణ కెరీర్‌లో కలికితురాయి.. అల్లూరి సీతారామరాజు
ABN, First Publish Date - 2022-11-16T04:39:04+05:30
సూపర్‌స్టార్ కృష్ణ గురించి చెప్పగానే.. ఆయన అభిమానులు కానివారికి కూడా గుర్తొచ్చే చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’.
సూపర్‌స్టార్ కృష్ణ గురించి చెప్పగానే.. ఆయన అభిమానులు కానివారికి కూడా గుర్తొచ్చే చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. తెలుగుజాతి పౌరుషాన్ని బ్రిటిష్ పాలకులకు చవిచూపించిన ఆ మన్నెం వీరుడి కథ సినిమాగా తీయాలని చాలా మంది ప్రయత్నించారు. ఎంతోమంది ప్రయత్నించి వదిలేసిన ఈ కథను అద్భుతంగా తెరకెక్కించి చరిత్రలో నిలిచిపోయారు కృష్ణ. తెలుగులో పూర్తిస్థాయిలో రూపుదిద్దుకున్న తొలి సినిమా స్కోప్, ఈస్ట్‌మన్ కలర్ సినిమా ఇది. 1955లో ఎన్టీఆర్.. అల్లూరిపై సినిమా తీయాలని కథ తయారుచేసి, 1957 జనవరి 17న వాహినీ స్టూడియోలో ఒక పాట కూడా రికార్డు చేశారు. ఎన్టీఆర్ మీడియా సమావేశం పెట్టి.. ‘విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు’ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఎప్పటికప్పుడు నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత.. అల్లూరిపై కృష్ణ దృష్టి పడింది. సినిమా వల్ల ఎవరూ నష్టపోకూడదని భావించి సొంత బ్యానర్‌పై తీసేందుకు ముందడుగు వేశారు. ఎన్టీఆర్ పిలిపించి.. ఆ సినిమా తీయొద్దన్నా వినలేదు. పైగా నిర్మాణంలో కృష్ణకు అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ తట్టుకుని సినిమాను పూర్తిచేశారు. విజయా అధినేతల్లో ఒకరైన చక్రపాణి ఫస్ట్ కాపీ చూసి.. ఇంత గొప్ప పాత్రలో కృష్ణను చూసిన ప్రేక్షకులు రెండేళ్ల దాకా మరే పాత్రలోనూ చూడలేరని, ఆ సమయంలో వచ్చే సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయని చెప్పారు. ఆ మాట అక్షరాలా నిజమైంది.
చివరాఖరు: ఆ సినిమా విడుదలయ్యాక ఎన్టీఆర్ (అప్పటికి సీఎంగా ఉన్నారు) తిరుపతికి వచ్చారు. ‘మీరు అల్లూరి సినిమా ఎప్పుడు తీస్తున్నారు’ అని విలేకరులు అడగ్గా.. ‘బ్రదర్ కృష్ణ తీశారు కదా! చాలా గొప్పగా తీశారు. దాన్ని మేం చెడగొట్టదల్చుకోలేదు’ అని సూటిగా చెప్పేశారాయన.
Updated Date - 2022-11-16T10:41:11+05:30 IST