depression: డిప్రెషన్‌లో ఉన్నవారితో ఈ 7 మాటలు చెప్పి చూడండి.
ABN, First Publish Date - 2022-08-04T19:57:43+05:30
తను ప్రేమించిన అమ్మాయి తనతో కాకుండా వేరే వారితో చనువుగా ఉంటుందని డిగ్రీ చదివే రమేష్ సమస్య, అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు, కోడలు వచ్చాకా తనను దూరం పెడుతున్నాడని యాభై ఆరేళ్ళ శారదా.. ఇలా అందరిదీ డిప్రెషన్ సమస్యే.
జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో డిప్రెషన్ బారిన పడుతూనే ఉంటారు. ఫలానా సమయంలోనే ఇది పలకరిస్తుందనేం లేదు. అలాగే చిన్నా, పెద్దా అనే వయసు పరిమితులు కూడా దీనికి లేవనే చెప్పాలి. పరీక్షలు సరిగా రాయలేదని పదేళ్ళ శ్రావణ్ సమస్య అయితే.., తను ప్రేమించిన అమ్మాయి వేరే వారితో చనువుగా ఉంటుందని డిగ్రీ చదివే రమేష్ సమస్య, అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు, కోడలు వచ్చాకా తనను దూరం పెడుతున్నాడని యాభై ఆరేళ్ళ శారదా.. ఇలా అందరిదీ డిప్రెషన్ సమస్యే. వయసు భేధాలు లేకుండా అందరినీ డిప్రెషన్ ఎందుకు వేధిస్తుంది. అసలు ఇలాంటి సమయంలో వీరికి ఏది చేయుతగా నిలుస్తుంది. డిప్రెషన్ కు అసలు మందేమిటి?
ఆర్థికంగా బాగోలేనపుడు, అయినవారు దూరమైనపుడు, ప్రేమలో విఫలం కావడం, చదువులో వెనకబడి ఉండటం ఇలా ప్రతి సమస్యకూ దీర్ఘమైన ఆలోచన మానసికంగా ఒత్తిడికి లోను కావడం. అన్నీ పెద్దగా పరిష్కారం కాని సమస్యలుగా కనిపిస్తాయి. మానసిక ఒత్తిడికి గురైనపుడు దానికి పరిష్కార మార్గాలు, ఆలోచనలు చేస్తూ, బయటపడే మార్గాలను వెతకడం మంచిది. ఏదో కోల్పోయినట్టు ఒంటరిగా కూచుని ఆలోచించడం వల్ల మరింత డిప్రెషన్ పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తడి నుంచి బయటపడాలంటే కొన్ని సూచనలను పాటించక తప్పదంటున్నారు నిపుణులు.
స్నేహితులు, బంధువుల ఆప్యాయత చాలా అవసరం.
ఈ డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనసు అనేక రకాలుగా మారే అవకాశం ఉంది. ప్రశాంతత లేని ఆలోచనలతో మనసు నిరాశగా శక్తిలేనట్టుగా తయారవుతుంది. జీవితంలోని అందమైన విషయాల నుండి ఆనందాన్ని అనుభవించకుండా చేస్తుంది. ఒంటరితనంలోకి తోసేస్తూ అందరికీ దూరంగా తీసుకుపోతాయేలా చేస్తుంది. ఒక్కో క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు బలంగా ఉంటాయి. ప్రతి క్షణం అగాధంలో ఉన్నామని ఫీల్ అవుతారు. ఇలాంటప్పుడు ఈ వ్యక్తి ని ఒంటరిగా ఉంచకపోవడం మంచిది. డిప్రెషన్‌తో పోరాడుతున్నవారితో స్నేహితులులు, ఆత్మీయులు సమయాన్ని గడపడం చాలా అవసరం. వారితో కబుర్లు, కొత్త ప్రదేశాలకు వెళ్ళి గడపడం వంటివి మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. ఇది ఒత్తడిని దూరం చేస్తుంది.
డిప్రెషన్ ఎపిసోడిక్ కావచ్చు కానీ ఇది ఉన్నప్పుడు మనస్సు, శరీరంపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తికి దగ్గర కావడం వారి నమ్మకాన్ని సంపాదించుకోవడం కాస్త కష్టమే., నిరాశతో పోరాడుతున్న వ్యక్తికి మనం చెప్పే మాటలు అంత త్వరగా నచ్చకపోవచ్చు. డిప్రెషన్‌కు మందులను ఎక్కడెక్కడో వెతుకుతారు కానీ దానికి, బదులుగా వారు వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఇలాంటి సమయంలోనే స్నేహితులు, బంధువుల ఆప్యాయత చాలా అవసరం.
డిప్రెషన్‌తో పోరాడుతున్న వ్యక్తితో మీరు..
1. ఓకే అయితే నేను మీతో కొంచెం కూర్చోవచ్చా? ఇష్టం లేకుంటే ఒత్తిడి చేయననే మాట చెప్పండి
2. నీ బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.. అనే నమ్మకాన్ని ఇవ్వండి.
3. కాస్త ధైర్యాన్ని ఇవ్వండి. ఇప్పుడు అనుభవిస్తున్న స్థితి తాత్కాలికమైనదనే నమ్మకాన్ని,.. నీకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటాననే భరోసాను ఇవ్వండి.
4. కాస్త సరదాగా కబుర్లు చెప్పడానికి చూడండి. ఏ సినిమా గురించో.. లేదా జోక్స్ వేసో నవ్వించడానికి ప్రయత్నం చేయండి. నేను నిన్ను నవ్వుతూ చూడాలనుకుంటున్నాననే మాట చెప్పండి.
5. నువ్వు ఎదుర్కుంటున్న పరిస్థితిని నేనైతే నీలా తీసుకోలేకపోదును. నువ్వు చాలా ధైర్యం గల వ్యక్తివని.. వారిని మెచ్చుకునే మాటలతో దగ్గర కండి.
6. ఇప్పుడే పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా కుదుటపడు, కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్పండి.
7. కష్టాలు, బాధలు, మనసు నొచ్చుకోవడాలు జీవితంలో ఆనందాల్లానే వచ్చి పోతాయి.. దానికి కాస్త సమయాన్ని ఇచ్చి పంపేయాలనే మాట చెప్పండి.
ఇలా మాట్లాడటం వల్ల డిప్రెషన్ లో ఉన్నవారికి స్నేహితుల మీద నమ్మకం వస్తుంది. మరీ ఒంటరిగా వదిలేయకుండా వారితో మాట కలపడం చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మరే చెడు నిర్మయాన్ని తీసుకోనీయకుండా ధైర్యంగా నిలబెడుతుంది.
Updated Date - 2022-08-04T19:57:43+05:30 IST