ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Justice Mala: నాన్న గొప్పతనం అప్పుడే తెలిసింది...

ABN, First Publish Date - 2022-12-18T23:47:02+05:30

తెలుగు సాహితీ ప్రపంచంలో సునామీ సృష్టించిన మహా కవి.. శ్రీశ్రీ. కార్మిక లోకం, కర్షక లోకం తరఫున గొంతెత్తిన ప్రజా కవి. అందరికీ సమన్యాయం కావాలంటూ ఘోషించిన విప్లవ కవి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు సాహితీ ప్రపంచంలో సునామీ సృష్టించిన మహా కవి.. శ్రీశ్రీ. కార్మిక లోకం, కర్షక లోకం తరఫున గొంతెత్తిన ప్రజా కవి. అందరికీ సమన్యాయం కావాలంటూ ఘోషించిన విప్లవ కవి. ఆయన చిన్న కుమార్తె జస్టిస్‌ నిడుమోలు మాలా... ఇప్పుడు మద్రాస్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.తండ్రి చూపిన బాట, తల్లి చేసిన తపస్సు వల్లే ఈ స్థాయికి ఎదిగానంటున్న జస్టిస్‌ మాలా తన జీవన ప్రస్థానంలోని విశేషాలను ‘నవ్య’తో పంచుకున్నారు..

‘‘నా పుట్టినింటి పేరు శ్రీరంగం అయితే, మెట్టినింటి పేరు నిడుమోలు. పుట్టి పెరిగిందీ, చదువుకున్నదీ, న్యాయవాదిగా రాణించిందీ, న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నదీ చెన్నైలోనే. విప్లవ కవితా జ్వాలలు, సినీ వినీలాకాశపు చల్లదనాల మధ్య నా బాల్యం గడిచింది. మందవెల్లిలోని సెయింట్‌ జాన్సన్‌ సీనియర్‌ సెకండ్‌ స్కూలులో 9వ తరగతి వరకు, మైలాపూర్‌లోని తెలుగువారి కేసరి మహోన్నత పాఠశాలలో ప్లస్‌టూ వరకు చదివాను. తరువాత లా కాలేజీలో చేరాను. ఇప్పటి ‘అంబేద్కర్‌ లా కాలేజీ’ని అప్పట్లో ‘మద్రాస్‌ లా కాలేజీ’ అని పిలిచేవారు. లా ఐదేళ్ల కోర్సు ప్రారంభమైన తరువాత నేను రెండో బ్యాచ్‌ విద్యార్థినిని. 1989లో ఎన్రోల్‌మెంట్‌ అయింది. వెంటనే హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా ఉన్న మా అక్క మామగారి వద్ద జూనియర్‌గా చేరాను. కొద్దికాలానికే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లిపోవడంతో... ఆయన సహచరుడు కేఎస్‌ అహ్మద్‌ సర్‌ వద్ద జూనియర్‌గా చేరి, కొనసాగాను. అహ్మద్‌గారే నాకు గురువు, మార్గదర్శకుడు. ఆయన పాండిచ్చేరిలో ప్రభుత్వ న్యాయవాదిగా, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వర్తించారు. ఆయనది పెద్ద వయసు కావడంతో మొదటి నుంచే హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్‌ చేసే అవకాశం నాకు కల్పించారు. ఆ తరువాత 2008 నుంచి పాండిచ్చేరి ప్రభుత్వం తరఫున న్యాయవాదిగా, అడిషనల్‌ జీపీగా, జీపీగా హైకోర్టులో బాధ్యతలు నిర్వర్తించాను. మా కుటుంబంలో న్యాయవాది వృత్తిలోకి అడుగు పెట్టిన తొలి వ్యక్తిని నేనే. మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం. మాకు ఒక సోదరుడు. పెద్దక్క ఇండియన్‌ రైల్వే అకౌంట్స్‌ సర్వీ్‌సలో పని చేసి రైల్వే బోర్డు మెంబర్‌ (ఫైనాన్స్‌)గా రిటైరయింది. రెండో అక్క యూఎ్‌సలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఫైనాన్షిల్‌ అడ్వయిజరీగా ఉంది. అన్నయ్య ‘ఫైజర్‌’ ఫార్మాస్యూటికల్స్‌లో అసోసియేట్‌ డైరెక్టర్‌.

నన్ను లాయర్‌గా గుర్తించింది ‘అప్పా’నే..

నాన్నను నేను చిన్నప్పటి నుంచి ‘అప్పా’ అని పిలిచేదాన్ని. నేను స్కూల్లో చదువుతున్న సమయంలో... ఒకసారి వేసవి సెలవులకు నేను, అమ్మ మా బంధువుల ఊరైన బరంపురం వెళ్ళాం. తిరిగి చెన్నైకి రైల్లో వస్తున్నాం. మే సెకండ్‌క్లా్‌సలో ఉన్నాం. అప్పా కవిగా నలుమూలలా తిరుగుతూ ఉండేవారు. అదే రైల్లో ఫస్ట్‌ క్లాస్‌లో... చెన్నై వస్తున్నారు.. కానీ మాకు ఆ విషయం తెలియదు. రిజర్వేషన్‌ టిక్కెట్‌లో అమ్మ పేరు ‘సరోజా శ్రీశ్రీ’ అని ఉండడంతో... టీసీ మాతో ఆప్యాయంగా మాట్లాడి వెళ్లిపోయారు. తరువాత ట్రాక్‌లో ఏదో మరమ్మతు ఉండడంతో... రైలు సూళ్లూరుపేటలో నిలిచిపోయింది. అప్పుడు టీసీ మా వద్దకు వచ్చి ‘‘పాపా! మీ నాన్నగారు కూడా ఇదే ట్రైన్‌లో ఫస్ట్‌క్లా్‌సలో ఉన్నారమ్మా’’ అంటూ నన్ను ఆ బోగీలోకి తీసుకెళ్లారు. మేం వెళ్లేటప్పటికి ఆ బోగీలో కవి సమ్మేళనం లాంటిది జరుగుతోంది. అప్పా చుట్టూ చేరిన జనం ఆయన రచనల గురించి అడుగుతుండడం, అందుకు ఆయన బదులిస్తుండడం కనిపించింది. నన్ను చూడగానే అప్పా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ‘‘ఈమె మా ఆఖరమ్మాయి. షి ఈజ్‌ స్టూడెంట్‌ ఇన్‌ ది ఫ్యామిలీ’’ అంటూ వారికి పరిచయం చేశారు. లాయర్‌కు అవసరమైన తెలివితేటలు నాకున్నాయని మొట్టమొదట గుర్తించింది ‘అప్పా’నే. ఇంట్లో అందరూ నా నన్ను ‘పాపా’ అని పిలిచేవారు. అప్పా మాత్రం నన్ను ‘పాపి, పాపిగాడు, పాపమ్మ’ అని ముద్దుగా పిలిచుకొనేవారు. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారిగా చీర కట్టుకొని, అప్పా ఆశీర్వాదం కోసం వెళ్లాను. నన్ను చూడగానే ‘‘అమ్మో! నా పాపమ్మ అప్పుడే చీర కట్టుకునేంత పెద్దదైపోయిందా?’’ అంటూ ఎంతో సంబరపడ్డారు.

నేను ప్లస్‌టూలో ఉండగా అప్పా చనిపోయారు. ఆ తరువాత నేను లాయర్‌గా ప్రాక్టీసు మొదలుపెట్టినప్పుడు... అమ్మ బీరువాలో ఆ చీర కనిపించింది. దాన్ని తీసి దాచిపెట్టుకున్నాను. హైకోర్టు జడ్జి కావాలన్నది నా జీవితకాల కోరిక. జడ్జిగా ప్రమాణస్వీకారం రోజు ఆ చీర కట్టుకోవాలని కూడా నేను బలంగా అనుకొనేదాన్ని. అలాగే కట్టుకున్నాను. కూడా. అప్పుడు నాన్న ఆశీస్సులు నా వెన్నంటే ఉన్నట్లు అనిపించింది. అప్పాకు ఒక సెంటిమెంట్‌ ఉండేది. నేను ఏం చెప్పినా... అది మంచైనా, చెడైనా నా నోటి నుంచి వచ్చింది జరుగుతుందని ఆయన నమ్మకం. అందుకే ఆయన స్టూడియోకి వెళ్లేటప్పుడు ‘‘ఈ రోజు డబ్బులు వస్తాయామ్మా?’’ అని అడిగేవారట. నా మూడ్‌ బాగుంటే ‘‘చాలా డబ్బులు వస్తాయ్‌’’ అని, మూడ్‌ బాగోలేకపోతే ‘నీకీ రోజు డబ్బులేం రావు పో’ అనీ అనే దాన్నట. ఆ రోజు అలాగే జరిగేదట. నాకం స్కూల్లో హిందీ సెకండ్‌ లాంగ్వేజ్‌గా, సంస్కృతం థర్డ్‌ లాంగ్వేజ్‌గా ఉండేవి. ఇక ఇంట్లో అంతా తెలుగు సాహిత్యమే కదా! ఆ ప్రభావంతో అరకొరగా తెలుగు చదవడం నేర్చుకున్నాను. ఇంట్లో ‘మినీ పొయిట్రీ సెషన్‌’ పెట్టేవారు. ‘ఖడ్గసృష్టి’లోది అనుకుంటా... ‘ఊగరా ఊగరా ఊగరా.. నువ్వు ఊగుతుంటే శత్రువుకి గాభరా...’, ‘మహాప్రస్థానం’లో ‘పదండి ముందుకు, పదండి ముందుకు...’ లాంటివి చదివి వినిపించేవారు. ఫ్రెంచ్‌, రష్యన్‌, ఇంగ్లీషు రచనల్ని కూడా మాకు వినిపించేవారు. ఇక్కడ కిందిస్థాయి కోర్టుల్లో డాక్యుమెంటేషన్‌, వాద ప్రతివాదాలు, 90 శాతం తీర్పులు తమిళంలోనే ఉంటాయి. అందుకే తమిళం చదవడం, రాయడం నేర్చుకున్నాను.

ఇల్లు వేలానికి వచ్చిన వేళ...

ఒక సినిమాకు అప్పా గ్యారెంటర్‌గా వున్నారు. అప్పు తీసుకున్న వ్యక్తి తీర్చకపోవడంతో... మా ఇల్లు వేలానికి వచ్చింది. ఈ విషయం తెలియగానే చాలామంది అభిమానులు డబ్బు సేకరించారు. అప్పాను పిలిచి సన్మానం చేసి, ఆ డబ్బు ఇచ్చారు. దాంతో ఇల్లు విడిపించుకున్నాం. మా అప్పా, అమ్మ మోసపోయారన్న స్పృహ నాకు అప్పటి నుంచే వుంది. బహుశా ఆ ప్రభావమే నేను లాయర్‌ కావడానికి ప్రేరేపించిందనుకుంటాను. ఆ సమయంలో మేం చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. అప్పుడు ఆయన క్యాన్సర్‌తో బాధపడుతుండేవారు. అప్పా చనిపోయేనాటికి నా వయసు 17 ఏళ్లనుకుంటా. అప్పా చెన్నై జనరల్‌ ఆసుపత్రిలో వుండి చికిత్స పొందుతున్నప్పుడు పెద్దక్క పక్కన ఉండేది. ఆసుపత్రిలో ఉండి కూడా ఆమె ఐఏఎ్‌సకు ప్రిపేరవుతుండేది. అప్పాకు ఆదాయం తగ్గిపోవడంతో అమ్మ ‘జై సంతోషి సంగీత విద్యాలయ’ పేరుతో సంగీతం క్లాసులు నడిపింది. ఆమ్మతో దాన్ని అప్పాయే పెట్టించారు. అమ్మ గాత్రంలో, మృదంగంలో, వీణలో విద్వాన్‌. వయోలిన్‌ కూడా వాయించేది. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు క్లాసులు చెబుతూనే ఉండేది. మా ఇంట్లోనే కొన్ని పోర్షన్లను కూడా అద్దెకివ్వడంతో కొంత డబ్బు వచ్చేది. ఎదిగొచ్చిన పిల్లలం, అందరం పెద్ద తరగతులు చదువుతున్నాం. అప్పుడు అమ్మ ఎంతో మనోధైర్యంతో నిలబడింది. అమ్మ మాకెప్పుడూ గ్రేట్‌ ఇన్‌స్పిరేషన్‌. ఇప్పుడు మేమంతా ఒక స్థాయిలో ఉన్నామంటే అమ్మే కారణం. ఒక రకంగా చెప్పాలంటే అమ్మ జీవితంతో పోరాటమే చేసింది.

ఆ మాటకే ఏడ్చేసేవాళ్లం...

శ్రీశ్రీ ప్రపంచానికి మహాకవి అయినా మాకు మాత్రం సాధారణ తండ్రే! మా నలుగురినీ ఎంతో అపురూపంగా చూసుకునేవారు. ఒక్కమాట కూడా అనేవారు కాదు. ఆయన ‘‘ఏంటి నయినా?’’ అన్నారంటే మమ్మల్ని గట్టిగా మందలించినట్లు అర్థం. ఆ మాటకే మేం ఏడ్చేసేవాళ్లం. నేనైతే ఆయన నెత్తినెక్కి కూర్చునేదాన్ని. ఇంట్లో ఉన్నప్పుడు ఆయన తన గదిలో కూర్చుని... కవితలు, పాటలు రాసుకుంటుండేవారు. అప్పాకు క్రికెట్‌, ఫుట్‌బాల్‌ అంటే మహా ఇష్టం. మా స్కూలు ఫీజులు కూడా ఆయనే స్వయంగా వచ్చి కట్టేవారు. ప్రోగ్రెస్‌ రిపోర్టుపై సంతకం చేసేటప్పుడు మాత్రం ‘‘అమ్మకి చూపించారా?’’ అని అడిగి ‘ఎస్‌ఎస్‌ రావ్‌’ అని సంతకం పెట్టేవారు. అంతకుమించి ఇంకేమీ పట్టించుకునేవారు కాదు. 8వ తరగతిలోకి వచ్చేవరకు ఆయన గొప్పతనం గురించి నాకు తెలియదు. ఒకసారి విజయవాడలో కవి సమ్మేళనం జరిగింది. అప్పట్లో అవి రాత్రి ఒంటిగంట, రెండు గంటల వరకూ జరుగుతుండేవి. అప్పటికే మేం ఆ రోజు రెండు కవి సమ్మేళనాల్లో పాల్గొనడంతో నాకు బోర్‌ కొట్టింది. దాంతో సినిమాకు వెళ్దామని అమ్మను అడిగాను. ఆ కవి సమ్మేళనం ఆర్గనైజర్స్‌ నన్ను, అమ్మను థియేటర్‌కు తీసుకెళ్లారు. తెలుగులోకి డబ్‌ అయిన జెమినీ గణేశన్‌ సినిమా ఆడుతోంది ఆ థియేటర్‌లో. మేం వెళ్లేటప్పటికే అరగంట సినిమా అయిపోయింది. కానీ శ్రీశ్రీ గారి భార్య, కుమార్తె వచ్చారంటూ మళ్లీ మొదటి నుంచి సినిమా వేశారు. అప్పుడు అప్పా గొప్పతనం తెలిసొచ్చింది. ‘అప్పా సంథింగ్‌ స్పెషల్‌’ అనే స్పృహ నాకు మొదటిసారి కలిగింది...

సూర్యుడు ఒక్కడే వుంటాడు, శ్రీశ్రీ కూడా ఒక్కడే..

‘‘‘సినీ, సాహితీ రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన శ్రీశ్రీ వారసత్వాన్ని ఆయన సంతానం కొనసాగించలేదు’’ అని చాలామంది అడుగుతుంటారు. అందుకు నేను చెప్పే సమాధానం ఒక్కటే- ‘‘సూర్యుడు ఒక్కడే ఉంటాడు, శ్రీశ్రీ కూడా ఒక్కడే’’. మేం నలుగురం అప్పా పేరు చెప్పి ఏనాడూ ఎలాంటి లబ్ది పొందలేదు. ఆయన పేరు చెప్పి ఎలాంటి సిఫారసూ చేయించుకోలేదు. మా స్వయం కృషితో, మా ప్రతిభాపాటవాలతోనే మాకు ఇష్టమైన రంగాల్లో నిలదొక్కుకున్నాం. అప్పా బతికున్నా ఇదే జరిగేది. ఆయన చాలా ముక్కుసూటి మనిషి. ‘నా పిల్లలకు ఫలానా పని చేసి పెట్టండి’ అని అడిగి ఉండేవారు కాదు. ఆడపిల్లలు కూడా బాగా చదువుకోవాలని, ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని, సాధికారత కావాలని ఆయన గట్టిగా కోరుకునేవారు. చిన్నప్పుడు అప్పాతో కలిసి విజయా-వాహిని, జెమినీ లాంటి స్టూడియోలకు వెళ్లేవాళ్లం. కానీ పెరిగి పెద్దయ్యేకొద్దీ ఇతర ప్రభావాలేవీ మా మీద ఉండకూడదని అమ్మ గట్టిగా భావించింది. ఆ మేరకు తను కష్టపడినా మమ్మల్ని ఉన్నత చదువులు చదివించింది. అమ్మ అన్నీ చూసుకోవడం వల్లనే నాన్న కూడా తన మార్గంలో యధేచ్ఛగా పయనించగలిగారు. ఆయనకు ఇంట్లో ఏం ఉందో, ఏం లేదో కూడా తెలిసేది కాదు. తన మానాన తను రాసుకుంటూ తన లోకంలో గడిపేవారు. భోజనానికి కూడా పిలిస్తే వచ్చేవారు, లేకుంటే లేదు.

నాకిష్టమైన అప్పా రచన..

అప్ప ప్రజా కవి. ‘ప్రజల్లో, ప్రజల కోసం, ప్రజలతో పాటు ఉన్నానా, లేదా?’ అన్నది మాత్రమే ఆయన ఆలోచించేవారు. ప్రభుత్వాలు తనకు గుర్తింపునిచ్చాయా లేదా అనేది ఆయన ఎన్నడూ పట్టించుకోలేదు. అలాంటిది ఇన్నేళ్ల తరువాత అప్పాను ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయా, లేదా? అని ఆయన సంతానంగా మేం ఆలోచించాల్సిన అవసరమేముంది? మేం ప్రభుత్వాల నుంచి ఏదైనా ఆశించామంటే... అప్పా భావాలను మేము సరిగ్గా అర్థం చేసుకోలేదనుకోవాలి. ఆయన నిత్యం ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నారు కదా! అది చాలు. అప్పా రచనల్లో నాకెంతో ఇష్టమైనది... ‘బాటసారి’లో ఒక ముసలావిడ అన్నపానీయాల్లేక చావుబ్రతుకుల మధ్య పడివుంటుంది.. ఒక ఎంగిలాకు ఎగిరొచ్చి ‘దీనికి నేను కారణం కాదు’ అంటుంది. అది నా హృదయాన్ని కలచివేసిన రచన. అప్పా రాసిన పాటల్లో ‘తెలుగు వీర లేవరా.. దీక్ష బూని సాగరా!’ అనే గీతం నాకెంతో ఇష్టం. కొన్ని వందలసార్లు ఆ పాట వినివుంటాను.

సాయిబాబా చిత్రానికి అప్పా డైలాగులు..

అప్పా నాస్తికుడు. కానీ అమ్మ ఆస్తికురాలు. ఆమె అధిక సమయం పూజ గదిలోనే ఉండేది. కానీ ఆయన అమ్మ పూజా పునస్కారాలను ఏనాడూ వద్దనలేదు. ఆమె నమ్మకాన్ని గౌరవించేవారు. ఎప్పుడైనా ఆయన అంతే! తన ఉద్దేశాలను ఎవ్వరిపైనా బలవంతంగా రుద్దేవారు కాదు. ఆయనకు దేవుడి మీద నమ్మకం లేదు. కానీ ఏదో ఒక శక్తి ఉందని విశ్వసించేవారు. ‘ఆ శక్తి మీరే కావచ్చు. మీ చేతిలోనే ఆ శక్తి ఉంద’నేది ఆయన ఉద్దేశం. ‘అంతా మన చేతుల్లోనే ఉంది. మనకు సాధ్యం కానిదేదీ లేద’నేది ఆయన నమ్మకం. మాకు కూడా భక్తి ఎక్కువే. అప్పా చిల్లరను గొప్పగా చూసుకునేవారు. ‘చిల్లర మహాలక్ష్మి’ అనేవారు. ఒక పెద్ద డబ్బాలో చిల్లర భద్రపరిచేవారు. మేం తినుబండారాలు ఏం కావాలన్నా నాన్ననే అడిగి తీసుకెళ్తుండేవాళ్లం. అంజలీదేవి గారు ‘షిరిడీకే సాయిబాబా’ చిత్రాన్ని హిందీలో తీశారు. దానిని తెలుగులోకి డబ్‌ చేయాలనుకున్నప్పుడు ‘‘శ్రీశ్రీతో రాయించండి. దీనికి డైలాగులు ఆయన తప్ప మరెవ్వరూ రాయలేరు’ అని అంజలిగారికి సత్యసాయి బాబా చెప్పారట. అంజలిగారు అడగడంతో ఆ సినిమాకు అప్పా పని చేశారు.

కల నాది.. తపస్సు అమ్మది..

నాకు ఇద్దరు అబ్బాయిలు. మా పెద్దబ్బాయి శ్రీనివాస్‌ లాయర్‌గా ప్రాక్టీసు చేస్తున్నాడు. రెండో అబ్బాయికి ఇప్పుడే మెడికల్‌ సీటు వచ్చింది. వృత్తిలో నేను ఎంత బిజీగా ఉన్నా ఇంటి బాధ్యతల్ని విస్మరించలేదు. నేను లాయర్‌గా, జడ్జిగా బయట ఎంత పేరు తెచ్చుకున్నా... తల్లిగా వారి ఆలనా పాలనా చూసినప్పుడే నా బాధ్యత సరిగ్గా నేను నిర్వర్తించినట్టు. మా అత్తగారిది గుంటూరు జిల్లా. మావారు ఎన్‌.రాధారమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉన్నతోద్యోగంలో ఉన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుకా మహిళ ఉంటుందనేది నానుడి. కానీ నా విజయం వెనుక మావారున్నారనేది వాస్తవం. ఆయన సహకారం వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగాను. మా ప్రొఫెషన్‌లో తొలి పదేళ్లు నాలుగు రూపాయలు చూడడం కూడా కష్టంగానే ఉంటుంది. నా పరిస్థితీ అలాగే ఉండేది. ఆ సమయంలో ఆయనెంతో నాకు మద్దతుగా నిలిచారు. హైకోర్టు న్యాయమూర్తిని కావాలని నేను కలలు కంటే... నా కోసం మా అమ్మ తపస్సే చేసింది. నా ఉన్నతి వెనుక ఆమె త్యాగమెంతో ఉంది. అందుకే నేను ముందుగా ఆమెకు కృతజ్ఞురాలిని. ఆ తరువాత మా అత్తగారు సీతా మహాలక్ష్మికి. ‘ఈ అమ్మాయి సిన్సియర్‌గా చేస్తోంది. ప్రొఫెషన్‌పై ఆసక్తి, పట్టు ఉన్నాయి. అందువల్ల ఆమె అభిరుచి మేరకు ఎదగనిద్దాం’ అని ఆమె ప్రోత్సహించారే తప్ప... ‘ఇంటి పని, వంట పని’ అంటూ ఏనాడూ నా వృత్తికి అంతరాయం కలుగనీయలేదు. నేను న్యాయమూర్తి స్థానంలో కూర్చోగలిగానంటే... దాని వెనుక నా మొత్తం కుటుంబ సహకారం ఉంది.

-డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, ఆంధ్రజ్యోతి, చెన్నై

ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌

Updated Date - 2022-12-18T23:47:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising