Geetha Saaram : సంతృప్తే మార్గం

ABN, First Publish Date - 2022-11-10T22:32:12+05:30

భగవద్గీతలోని రెండో అధ్యాయంలో... నలభైకి పైగా శ్లోకాలలో ‘సాంఖ్య యోగం’ గురించి శ్రీకృష్ణుడు సుదీర్ఘంగా వివరించాడు. సాంఖ్యయోగం... అర్జునుడికి ఏమాత్రం అవగాహన లేని సరికొత్త విషయం.

Geetha Saaram : సంతృప్తే మార్గం
Geetha Saaram
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భగవద్గీతలోని రెండో అధ్యాయంలో... నలభైకి పైగా శ్లోకాలలో ‘సాంఖ్య యోగం’ గురించి శ్రీకృష్ణుడు సుదీర్ఘంగా వివరించాడు. సాంఖ్యయోగం... అర్జునుడికి ఏమాత్రం అవగాహన లేని సరికొత్త విషయం. యోగంలో సమాధి స్థితిని సాధించిన స్థితప్రజ్ఞుల గురించి తెలుసుకోవాలనే కోరిక అర్జునుడికి కలిగింది. అంతేకాదు, స్థితప్రజ్ఞులైన వ్యక్తుల నడవడిక ఎలా ఉంటుందో, వారు మాట్లాడే పద్ధతి, కూర్చొనే తీరు, నడిచే విధానం ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఈ సందర్భంగా అర్జునుడికి చేసే బోధలో... చంచలమైన మనస్సును నియంత్రించడానికి కొన్ని కొలమానాలను శ్రీకృష్ణుడు నిర్దేశించాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నవారు తమ పురోగతిని స్వయంగా కొలుచుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.

‘‘మనస్సులోని కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి, ఆత్మ ద్వారా ఆత్మలో సంతుష్టుడై, ఆత్మానందాన్ని పొందినవాడినే స్థితప్రజ్ఞుడు’’ అని అంటారు అన్నాడు కృష్ణుడు. ఒక వ్యక్తి తన పట్ల తాను సంతృప్తిని పొందినప్పుడు అతనిలోని కోరికలు వాటంతట అవే రాలిపోతాయి. ఈ విధంగా కోరికలు రాలిపోయినప్పుడు... వారు చేసే పనులన్నీ నిష్మాక కర్మలే అవుతాయి. ప్రస్తుతం ఉన్నదానికన్నా భిన్నంగా ఉండాలని మనం ప్రాథమికంగా కోరుకుంటాం. ఎందుకంటే, మన ప్రస్తుత పరిస్థితితో మనకు చాలా తొందరగా విసుగెత్తిపోతుంది. అర్థశాస్త్రంలో ఈ స్థితిని ‘తీరిన కోరిక మనల్ని ప్రేరేపించలేదు’ అంటారు. మనం ఇతరుల మీద దీన్ని ఒక వ్యూహంగా ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణ చెప్పాలంటే... వినియోగదారుల కోసం తాము తయారు చేసే ఉత్పత్తుల్లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను కంపెనీలు ప్రవేశపెడుతూ ఉంటాయి. కారణం... ప్రతిసారీ ఒక విభిన్నమైన మోడల్‌ను కొనుక్కోవాలని మనం కోరుకుంటామనే సంగతి కంపెనీలకు బాగా తెలుసు.

అసలు మనం మన పట్ల సంతృప్తి చెందనప్పుడు... మన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సహా ఇతరులు మన వల్ల సంతోషంగా ఉండాలని మనం ఎలా ఆశించగలం? అదేవిధంగా... తమను తాము తృప్తి పరచుకొనే సామర్థ్యం లేని వ్యక్తుల నుంచి మనం సంతృప్తిని ఎలా పొందగలం? కోరికలను వదిలెయ్యాలంటే... ‘సుఖాన్ని వెంటాడడం’ అనేది ఎండమావిని వెంబడించడం లాంటిదనే లోతైన అవగాహన మనకు అవసరం. జీవితానుభవాలన్నీ ధ్రువీకరించేది ఈ ప్రాథమిక సత్యాన్ని మాత్రమే. కోరికలను వదిలెయ్యడానికి ఆచరణాత్మకమైన మార్గం వాటి తీవ్రతను తగ్గించడం, వాటిని వెంబడించడాన్ని తగ్గించడం. ఇలా చేయగలిగితే.. మనం జీవితంలో ఎంత ప్రశాంతంగా ఉండగలమనే విషయం అర్థమవుతుంది.

కె.శివప్రసాద్‌. ఐఎఎస్‌

Updated Date - 2022-11-10T22:32:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising