Lahiri Mahasaya: ఆధునిక గృహస్థ క్రియాయోగి- లాహిరి మహాశయులు
ABN, First Publish Date - 2022-09-30T21:19:35+05:30
హైదరాబాద్: కాశీ పట్టణానికి చెందిన, శ్యామచరణ్ లాహిరి అనే పేరు కలిగిన లాహిరి మహాశయులు భూత, భవిష్యత్ వర్తమాన కాలాలలోని గొప్ప గురువులలో ఒకరు.
హైదరాబాద్: కాశీ పట్టణానికి చెందిన, శ్యామచరణ్ లాహిరి అనే పేరు కలిగిన లాహిరి మహాశయులు భూత, భవిష్యత్ వర్తమాన కాలాలలోని గొప్ప గురువులలో ఒకరు. అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులకు చేర్చగలిగే సంతులిత జీవన విధానానికి ఆయన గొప్ప ఉదాహరణగా నిలిచారు. చాలా మంది లాగే లాహిరిమహాశయులు గృహస్థు అయి ఉండి, తన నిత్య జీవన గందరగోళస్థితి మధ్యలో నుండి కూడా తన చైతన్యస్థాయిలను దైవ సాక్షాత్కారం పొందగలిగే ఉన్నత స్థితికి చేర్చగలిగారు.
లాహిరి మహాశయులు అసమాన, అమర ఋషి బాబాజీ ప్రధాన శిష్యులు, అలాగే ఒకయోగి ఆత్మకథ గ్రంథకర్త అయిన పరమహంస యోగానంద గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరికి గురువు.
మహాకావ్యమైన ఒక యోగి ఆత్మకథ లాహిరి మహాశయుల జీవితం లోని ముఖ్య ఘట్టాలను వివరంగా పేర్కొంది. పాఠకులు ఈనాటికీ ఈ సంఘటనలు చదివి అమితాశ్చర్యానికి గురి అవుతుంటారు. రాణిఖేత్ కు లాహిరి మహాశయుల బదిలీ, అక్కడి హిమాలయాల మంచు సానువుల్లో గమ్యం లేకుండా ఆయన తిరగడానికి కారణమై, అత్యంత అద్భుతమైన రీతిలో ఆయన బాబాజీని కలవడం ‘పొరపాటుగా పంపిన టెలిగ్రామ్’ వల్ల జరిగింది. ఈ సంఘటనలన్నీఇతిహాస ఘటనలైనాయి. ఒక యోగి ఆత్మకథ చదవగలిగిన భాగ్యవంతులకు బాబాజీతో ఆయన కలయిక అత్యంత స్ఫూర్తిదాయకం.
సంతులిత జీవనం గడుపుతూనే, ఆత్మసాక్షాత్కార సాధనవైపు లక్ష్యం పెట్టి చేరుకోవడంలోని ఔన్నత్యాన్ని లాహిరి మహాశయుల జీవనం మనకు నిరూపిస్తుంది. ఆయన చేసిన ఆశ్చర్యం కొలిపే అద్భుతాలు వేలాది మందికి స్ఫూర్తిని కలిగించాయి. అంధుడైన రాము, సంతానం లేని అభయ వంటి సాధారణ శిష్యుల జీవితాలు ఆయన వల్ల ప్రేరణ పొందాయి. తనపై అధికారి అయిన ఆంగ్లేయుడు కూడా అదే విధంగా లాహిరిమహాశయుల అధ్యాత్మిక శక్తి వల్ల ప్రయోజనం పొందారు. అనారోగ్యంతో ఉన్న ఆయన భార్య వేలాది మైళ్ళ దూరంలో ఉన్నా అద్భుతమైన రీతిలో కోలుకుంది.
అయినా, ఈ గొప్ప ఋషితుల్యుడు నెరవేర్చిన అత్యంత ప్రధానమైన కార్యం విమోచన కరమూ, నవీన మార్గ దర్శనకరమూ అయిన, మరుగున పడిపోయిన క్రియాయోగ విజ్ఞానాన్నిమహావతార్ బాబాజీ ఆశీస్సులతో పునరుజ్జీవింపజేయడం. ఆధునిక కాలపు సత్యాన్వేషకులకు ఎంతో ముఖ్యమైన ఈ క్రియాయోగ ప్రక్రియను నేర్పుగా వ్యాప్తిచెందించిన ప్రవక్త, వైతాళికుడు లాహిరిమహాశయులు.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ను స్థాపించిన యోగానందులు తమ పరమ గురువైన లాహిరి మహాశయుల నుండి నిరంతరాయంగా ప్రేరణ పొందారు. తమ ప్రేమ పాత్రురాలైన తల్లిగారి ఒడిలో పసిపాపగా ఉన్నపుడే మహా గురువులు ఆయనను ఆశీర్వదించి “చిట్టితల్లీ, నీ కొడుకు యోగి అవుతాడమ్మా! ఆధ్యాత్మికమైన రైలింజను మాదిరిగా ఇతను, ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిద్ధ్యానికి చేరుస్తాడు.” అన్న చిరస్మరణీయమైన వాక్కులను పలికారు.
యోగానందుల బోధలు ప్రధానంగా గొప్ప ధార్మిక గ్రంథాలైన భగవద్గీత, మరియు బైబిలు బోధలపైన ఆధారపడి ఉంటాయి. ‘జీవించడం ఎలా’ అన్నది బోధించే పాఠాలు, ఇంకా తన ఇతర వివిధ రచనలలోఆయన ఈ బోధనలను ఎంతో చక్కగా కూర్చారు. ప్రతివారూ చివరకు భగవంతుని తమ జీవితంలో నేరుగా అనుభూతి చెందడమే మానవులందరికీ ఆవశ్యకం అన్నది సాధారణ ప్రజానీకానికి ఆయన ఇచ్చే సందేశం. ఈ బోధనలు సాధారణ స్త్రీ, పురుష జనాభాకు అందించడానికి మార్గం సిద్ధం చేసినది మాత్రం లాహిరి మహాశయులు. ఆసక్తి ఉన్న భక్తులందరికీ క్రియాయోగ విజ్ఞానాన్ని అందించడానికి అనుమతించమని ఆయన బాబాజీని ప్రార్థించారు.
లాహిరిమహాశయుల జన్మోత్సవం (ఆవిర్భావ దివస్) సెప్టెంబర్ 30వ తేదీ కాగా, మహాసమాధి సెప్టెంబర్ 26వ తేదీ. ఈ ఆధునిక కాలంలో లక్షల మంది క్రియాయోగ మార్గాన్ని అనుసరిస్తున్నారన్న సత్యమే భారతదేశపు గొప్ప యోగావతారులైన లాహిరి మహాశయుల జీవితానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఘుర్ణి అనే చిన్న గ్రామంలో సాధారణ జీవితం నుండి వచ్చిన లాహిరి మహాశయులు ఈ భూమిపై జీవించిన, అత్యంత ఉత్కృష్ట స్థాయినందుకొన్న ఋషులలో ఒకరిగా గుర్తింపు పొందారు.
మరింత సమాచారం కోసం: yssi.org దర్శించండి. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0651 665 5555
Updated Date - 2022-09-30T21:19:35+05:30 IST