ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sudigali Sudhir : ...కానీ కొన్నిసార్లు తప్పలేదు

ABN, First Publish Date - 2022-11-13T03:24:14+05:30

పిల్లలు, పెద్దలు, మహిళలు అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులూ అభిమానించే నటుడు సుడిగాలి సుధీర్‌. తన పేరులానే బుల్లితెరపైన ఆయనది ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సండే సెలబ్రిటీ

పిల్లలు, పెద్దలు, మహిళలు అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులూ అభిమానించే నటుడు సుడిగాలి సుధీర్‌. తన పేరులానే బుల్లితెరపైన ఆయనది ‘సుడిగాలి’ లాంటి ప్రస్థానం. తెలుగు ప్రేక్షకులతో ఇప్పటికే ‘జబర్దస్త్‌’ యాక్టర్‌ అనిపించుకున్న సుధీర్‌... తాజాగా ‘గాలోడు’గా పెద్దతెరపై అలరించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘నవ్య’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

నటుడిగా మీరు ఇంతవరకూ ఏం సాధించారనుకుంటున్నారు?

నటనను చాలా ఎంజాయ్‌ చేస్తున్నాను. సాదాసీదాగా మొదలైన కెరీర్‌ ఇక్కడిదాకా రావడం చాలా సంతోషంగా ఉంది. నేను సాధించినదానితో అమ్మానాన్న సంతృప్తిగా ఉన్నారు. అది నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. నా గుర్తింపు వాళ్లని సంతోషంగా ఉంచడం నాకు చాలా కిక్‌ ఇస్తోంది.

నటుడిగా మీ మీద ఎవరి ప్రభావం ఉంది?

చిరంజీవి, రజనీకాంత్‌ ప్రభావంతో సినీ రంగంలోకి వచ్చాను. పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఒక వ్యక్తిగా ఆయన ప్రభావం, స్ఫూర్తి నాపైన చాలా ఎక్కువ ఉంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒకప్పుడు చిరంజీవి, రజనీకాంత్‌, పవన్‌ కల్యాణ్‌ ఇలా చెప్పారు కదా... అనేది గుర్తుకొస్తుంది. అప్పుడు అవరోధాలను దాటుకొని ముందుకెళతాం. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొంటాం. నేను ఏం చేస్తున్నా, ఏం సాధించినా ఆ గొప్పదనం అంతా మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌, పవర్‌స్టార్‌కే దక్కుతుంది. వాళ్లవల్లనే ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకోగలుగుతున్నాను. అందరి జీవితాల్లానే నా కెరీర్‌లోనూ ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఎదురుదెబ్బలు ఇప్పుడు, ఇకముందు కూడా ఉంటాయి. వాటిని అధిగమించాల్సిందే. సవాళ్లే వాటిని అధిగమించే సత్తా కూడా మనకు అందిస్తాయి.

ప్యాకప్‌ చెప్పాక మీ జీవితం ఎలా ఉంటుంది?

నన్ను ఇంట్రావర్ట్‌ అంటారు. నేను అంత త్వరగా జనాలతో కలవను. నాదైన ఒక జీవితం ఉంటుంది. పని పూర్తయ్యాక నేరుగా ఇంటికొస్తాను. కుటుంబంతో గడుపుతాను. పార్టీకి వెళ్లాలంటే తమ్ముడితో వెళతాను. లేదంటే రామ్‌ప్రసాద్‌గారితో కూర్చుంటాను. అంతే! ఇండస్ట్రీలోవాళ్లతో కలవను. అందుకేనేమో నా గురించి పరిశ్రమలో ఏం అనుకుంటున్నారనేది నాకు పెద్దగా తెలియదు. ఇంటికెళ్లాక ఫోన్‌ పక్కన పడేస్తాను.

పరిశ్రమలోకి వచ్చాక మీకు దక్కిన మర్చిపోలేని ప్రశంస... విమర్శ?

‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సెట్‌లో పవన్‌కల్యాణ్‌ గారు నన్ను చిరంజీవిగారికి పరిచయం చేస్తూ నా పేరు చెప్పేలోపే ఆయన... ‘తను సుడిగాలి సుధీర్‌... నాకు తెలుసు’ అన్నారు. ఆ సందర్భం మంచి కిక్‌ ఇచ్చింది. ‘ఇకచాల్లే... విజయవాడ ఇంటికి వెళ్లిపోయి ఏదైనా చేసుకోవచ్చు’ అనిపించింది. ఇప్పటిదాకా నేను బాధపడిన సందర్భం రాలేదు. ఇకపైనా రాకూడదని కోరుకుంటున్నాను.

‘జబర్ద్‌స్త’లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎదురైన సవాళ్లు ఏమిటి?

నా ఎదుగుదలలో ఈటీవీ, మల్లెమాల, ‘జబర్దస్త్‌’ ప్రముఖ పాత్ర వహించాయి. నన్ను నిరూపించుకోవడానికి వేదిక కల్పించాయి. 2013 ఫిబ్రవరి 7 దాకా చుట్టాలకి తప్ప నేను ఎవరికీ తెలియదు. మెరికల్లాంటి ముప్పై, నలబైమంది ఆర్టిస్టులు... వాళ్లందరి మధ్య మనల్ని మనం నిరూపించుకోవడం పెద్ద సవాల్‌. గాయకుడిగా, డ్యాన్సర్‌గా... ఇలా నాలో ఉన్న ప్రతిభను పలు కోణాల్లో ప్రదర్శించే అవకాశం కలిగింది. ‘జబర్దస్త్‌’ నా సినిమా అవకాశాలకు బాటలు వేసింది. ‘మంచి పేరు వచ్చాక కూడా ఇంత కష్టపడడం దేనికి... ఏదో అలా లాగించేయవచ్చు కదా’ అన్నారు. అది నాకు ఇష్టం లేదు. పదిమందీ చేసేది కాకుండా కొత్తగా ఇంకా ఏదో చేయాలనే తపన నాలో ఎక్కువ.

‘జబర్దస్త్‌’ లాంటి షోల్లో ద్వంధార్థాలు, అసభ్య సంభాషణలు ఎక్కువ అనే విమర్శలను ఎలా చూస్తారు?

ఆ విమర్శలతో నేనూ ఏకీభవిస్తాను. వాటిని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారా... లేదా అనేది మాత్రం నాకు తెలియదు. అది టీఆర్పీని బట్టి తెలుస్తుంది. అన్ని వయసులవారూ చూస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా ‘జబర్దస్త్‌’ ప్రారంభించాం. ప్రేక్షకులు చూస్తుండడంతో మేము చేస్తూ వచ్చాం. ఉదాహరణకు యాక్షన్‌ సినిమాలు ఎక్కువగా ఆడితే, అందరూ యాక్షన్‌ సినిమాలు తీయాలనుకుంటారు కదా... అలా! టీఆర్పీ బాగా రావడంతో ‘ఓహో జనాలు దీన్ని చాలా ఇష్టపడుతున్నట్లున్నారు’ అనుకుని కొనసాగించాం. అంతే తప్ప ఇలా చేస్తే జనాలు చూస్తారు అని కావాలని చేయలేదు. కానీ మనసులో ఓ మూల ఇలాంటివి చేయకూడదు అనే అంతర్మథనం అయితే ఉంది. ప్రారంభంలో ఏదో ఒకటి చేసి, జనాలకు తెలియాలనే యావ ఉంటుంది. కొంచెం గుర్తింపు వచ్చాక మాత్రం బాధ్యతాయుతంగా మెలగాలనిపించింది. పిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకూ చెడు చెప్పకూడదనుకున్నాం. కానీ కొన్నిసార్లు తప్పలేదు. అలాగే స్కిట్లలో హీరోలను అనుకరించడం కూడా అప్పటికప్పుడు అనుకోకుండా జరిగేదే తప్ప కావాలని చేసింది కాదు.

‘జబర్దస్త్‌’ నటుల పట్ల చిత్ర పరిశ్రమ వివక్ష చూపుతోందా?

ఈ మాట నేను కూడా విన్నాను. కానీ నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు. సినిమావాళ్లు కలసినప్పుడు కూడా మమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తేవారు.

‘జబర్ద్‌స్త’లోకి పునరాగమనం ఎప్పుడు?

అది నాకు ఇల్లు లాంటిది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో ఆర్నెలలు విరామం ఇవ్వాలనుకున్నాను. అదే విషయం ‘మల్లెమాల’వాళ్లకు చెప్పాను. వాళ్ల అనుమతితోనే సినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు మళ్లీ ‘జబర్ద్‌స్త’లోకి వస్తాను అని చెప్పాను.

ఒకసారి హీరోగా చేశాక మళ్లీ ఇలాంటి షోల్లో చేస్తే ఇమేజ్‌ దెబ్బతింటుందేమో?

చాలామంది అదే అంటున్నారు. ఇప్పుడు నేను హీరోననే ఇమేజ్‌ను ఒంటబట్టించుకున్నప్పుడే వెనక్కి వెళ్లాలా? వద్దా? అనే సంశయం కలుగుతుంది. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఇక్కడిదాకా వస్తానని అనుకోలేదు. దేవుడు ఇచ్చినదాన్ని తీసుకొని వెళ్లడం తప్ప నాకు వెనకా ముందూ ఆలోచన లేదు.

రష్మీతో మీది ఎలాంటి అనుబంధం?

మా ఇద్దరిదీ ఆన్‌స్ర్కీన్‌ కెమిస్ట్రీ అని పదేళ్ల నుంచి చెబుతున్నాను. ఏదో స్కిట్‌లో అనుకోకుండా రష్మీ మీద వేసిన పంచ్‌లు పేలడంతో అది అలా కొనసాగుతూ వచ్చింది. అది కూడా అనుకోకుండా జరిగిందే. కొవిడ్‌ తర్వాతనే మేం మంచి స్నేహితులం అయ్యాం. అంతకు ముందైతే ఒక్కసారి డైరెక్టర్‌ కట్‌ చెప్పాక మళ్లీ మా మధ్యన మాటలు కూడా ఉండేవి కావు.

మీరు రిలేషన్‌షి్‌పలో ఉన్నారా?

లేదండీ... నేను సింగిల్‌!

మీ జీవిత ధ్యేయం ఏంటి?

పదిమందికి సాయపడగలిగే స్థాయిలో ఉండాలనుకుంటాను. సేవ చేయడంలోనూ గొప్ప సంతృప్తి ఉందని రజనీకాంత్‌, చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ను చూసి తెలుసుకున్నాను. నావల్లయితే... అనాథాశ్రమం కట్టాలనుంది. చూడాలి ఏం జరుగుతుందో.

కష్ట కాలంలో మీకు వెన్నుదన్నుగా ఉండేవారు ఎవరు?

అమ్మానాన్నే. వాళ్లే నా ప్రపంచం. స్నేహితులు చాలా తక్కువ.

‘జబర్ద్‌స్త’లో మీకు బాగా నచ్చిన యాక్టర్‌?

గెటప్‌ శ్రీను. మా అందరిలోకన్నా వాడికే ముందు ఇండస్ట్రీలో బ్రేక్‌ రావాలి. అంత గొప్ప నటుడు వాడు. శ్రీను చేసినదాంట్లో కొంచెం అయినా చేయాలనుకుంటాను.

‘గాలోడు’ సినిమా ఎలా ఉండబోతోంది?

మా సినిమాకు టెక్నీషియన్స్‌ అందరూ చాలా కష్టపడ్డారు. ఎన్నో ఒడుదొడుకులు దాటుకొని మూడేళ్ల తర్వాత వస్తున్నాం. సినిమాలు బాగున్నాయంటున్నారు కానీ వసూళ్లు లేవు. ఆ పరిస్థితి పోవాలి. తెలుగు సినిమాకు పూర్వ వైభవం రావాలనేది నా కోరిక. టీవీ వ్యూయర్‌షిప్‌ కూడా బాగా తగ్గింది.

-సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2022-11-13T03:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising