ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం 2022: స్కిల్స్‌తో సక్సెస్ కొట్టిన ఆ ఇద్దరు..
ABN, First Publish Date - 2022-07-15T22:06:11+05:30
ఉన్నత చదువులు చదివి అవకాశాల కోసం ఎదురుచూసేవారు, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని కెరియర్ లో ముందుకు దూసుకుపోయేవారి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం.
ప్రతి సంవత్సరం, యువత సామర్థ్యాలు వారి నైపుణ్యాలను హైలైట్ చేయడానికి జూలై 15 న ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజున నేటి యువతకు మెరుగైన జీవితాన్ని గడపడానికి గొప్ప సామాజిక ఆర్థిక వాతావరణాన్ని అందించడానికి విభిన్న నైపుణ్యాల ప్రాముఖ్యతను గురించి చర్చించుకుంటూ ఉంటాం. ఇవి యువత వ్యక్తిగత, ఆర్థిక అభివృద్ధికి అలాగే విజయానికి, ప్రతిభకు విలువను చెప్పడానికి కూడా ఉపయోగపడతాయి. ఉన్నత చదువులు చదివి అవకాశాల కోసం ఎదురుచూసేవారు, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని కెరియర్ లో ముందుకు దూసుకుపోయేవారి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. అన్ని సౌకర్యాలూ శరీర సామర్థ్యం ఉన్నవారి గురించి కాకుండా మనిషి మనుగడకు ఆధారమైన దృష్టి లోపం ఉన్న యువత తమ కెరియర్ ను ఎలా బిల్డ్ చేసుకున్నారు అనే విషయాన్ని ఈరోజున తెలుసుకుందాం.
23 ఏళ్ళ వయసులో కంటి చూపు కోల్పోయిన గుజరాత్ వాసి భవేష్ భాటియా ఓ హోటల్‌లో టెలిఫోన్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఓ ప్రమాదంలో భవేష్ కంటి చూపు పోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అతను నిరుపేద కుటుంబానికి చెందినవాడు కాబట్టి, తన అవసరాలను తీర్చడానికి మార్గం వెతకడం తప్ప అతనికి వేరే దారి లేకపోయింది. భవేష్ ముంబైలోని నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు, అక్కడ భవేష్ కు కొవ్వొత్తుల తయారీని నేర్పించారు. పని నేర్చుకున్నాకా తన పనికి తగిన అవకాశాన్ని కల్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
నెమ్మదిగా అంధులకోసం ప్రత్యేక పథకం కింత 15000 రూపాయలను బ్యాంక్ నుంచి రుణం తీసుకుని తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. తయారు చేసిన కొవ్వొత్తులని బండి మీద పెట్టి అమ్మడం మొదలు పెట్టాడు. నెమ్మదిగా వ్యాపారం పెరిగింది. తన వ్యాపారానికి బ్రాండ్ ను ఏర్పాటు చేయాలని వెంచర్ సన్‌రైజ్ క్యాండిల్స్‌ను స్థాపించాడు. ఇది పెరిగి పెద్ద సంస్థగా మారింది.
ఇందులో కొవ్వొత్తులను విక్రయించడమే కాకుండా దృష్టి లోపం ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలను కల్పించి, వారికి శిక్షణ కూడా ఇస్తున్నాడు. చిన్న వ్యాపారంగా ప్రారంభమైన ఈ కొవ్వొత్తుల వ్యాపారం ఇప్పుడు 9,500 మందికి పైగా దృష్టిలోపం ఉన్నవారికి ఉపాధి కల్పించే భారీ సంస్థగా రూపాంతరం చెందింది. సన్‌రైజ్ క్యాండిల్స్ 14 రాష్ట్రాల్లో 71 తయారీ యూనిట్లుగా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 67 దేశాలకు తమ కొవ్వొత్తులను ఎగుమతి చేస్తుంది. భావేష్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, భారత రాష్ట్రపతి నుండి మూడు జాతీయ అవార్డులను, 100కు పైగా పారాలింపిక్ క్రీడా పతకాలను అందుకున్న క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. దృష్టిలోపం ఉందని ఉద్యోగంలోంచి తొలగిస్తే భవేష్ ఇప్పుడు కోట్లలో బిజినెస్ చేస్తూ ఎందరో దృష్టి లోపం ఉన్నవారికి ఉపాధి కల్పిస్తున్నాడు.
ఇది మరో కథ...
పుట్టినప్పటి నుంచి అంధురాలిగా ఉండటం అనేది పెద్ద శాపమే.. అయినా 25 ఏళ్ళ రేషమ్ తల్వార్ పెద్దగా కలలు కనడం ఆపలేదు. జీవితాన్ని ముందుకు సాగించడానికి అవసరమయ్యే కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరమని ముందుగానే అర్థం చేసుకున్న రేషమ్ తల్లిదండ్రులు ఆమెకు చాలా చిన్న వయస్సులోనే నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్, ఢిల్లీ నుండి బ్రెయిలీని నేర్చించారు. ఇది రేషమ్ ను 2వ తరగతిలో ఉన్నప్పుడు ఒక సాధారణ పాఠశాలలో చేర్చడానికి సహాయపడింది. తరువాత పట్టుదలగా చదివి ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. IGNOU నుండి మాస్టర్స్ కూడా పూర్తి చేసింది.
చిన్నతనంలోనే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు రేషమ్ వయస్సు తొమ్మిదేళ్లు. రేషమ్ తలిదండ్రులు సంగీత కుటుంబానికి చెందినవారు కావడం వల్ల ఆమె సులువుగానే అందులో ప్రవేశించింది. రాగాలను అలవోకగా తన కంఠంలో పలికించగలిగింది. దీనికి కుటుంబ సహకారం కూడా తోడు కావడంతో చాలా తక్కువ సమయంలోనే మంచి సంగీత పరిజ్ఞానంతో పాటు, ఎలాంటి శిక్షణ లేకుండానే పాటలను గుర్తించి హార్మోనియంలో ట్యూన్ చేయడం సాధన చేసింది రేషమ్.
కాలేజీ ఈవెంట్‌లలో ప్రదర్శనలిస్తూ మిస్ ఫ్రెషర్, మిస్ ఫేర్‌వెల్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. రేషమ్ ది వాయిస్, ఇండియన్ ఐడల్, స రే గ మ ప వంటి అనేక ఇతర టెలివిజన్ రియాల్టీ షోలలో కూడా పాల్గొంది. ఇప్పుడు వాయిస్‌ఓవర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను నిర్మించుకోవడంలో ఆమె బిజీగా మారింది. అంధులుగా భవేష్, రేషమ్ ఇద్దరూ తమ కెరియర్ ను పట్టుదలగా నిర్మించుకుని మరికొందరికి ఆదర్శంగా మారారు.
Updated Date - 2022-07-15T22:06:11+05:30 IST