USA: లాటరీలను ఏనాడూ నమ్మని వ్యక్తి జీవితంలో ఊహించని ట్విస్ట్..
ABN, First Publish Date - 2022-11-25T20:39:48+05:30
లాటరీలను ఏనాడూ నమ్మని ఓ అమెరికా వ్యక్తి తన స్నేహితుడి కారణంగా జాక్ పాట్ కొట్టేశాడు.
ఎన్నారై డెస్క్: లాటరీలపై(Lottery) ఎవరి అభిప్రాయాలు వారివి. కొందరు వీటిని అస్సలు నమ్మరు. లాటరీ టిక్కెట్లు కొనడమంటే సమయం, డబ్బు వృథా చేయడమని భావించే వారు కోకొల్లలు. అమెరికాలోని(USA) వర్జీనియా రాష్ట్రం(Virginia) హాంప్టన్ నగరానికి(Hampton) చెందిన డానీ జాన్సన్దీ(Danny Johnson) ఇదే తీరు. అతడు తన జీవితంలో ఎప్పుడూ లాటరీలను నమ్మలేదు. కానీ.. ఇటీవల ఓ రోజు లాటరీ టిక్కెట్టు కొనమంటూ డానీని అతడి స్నేహితుడు బలవంతం(Peer pressure) చేశాడు. త్వరలో జాక్ పాట్కు లాటరీ తీస్తారని నచ్చజెప్పాడు. దీంతో ఓ మెట్టుదిగిన డానీ.. అతడి కోరిక ప్రకారమే లాటరీ టిక్కెట్టు కొన్నాడు. ఆ తరువాత ఆ విషయాన్నే మర్చిపోయాడు. ఓ రోజు యథాలాపంగా చెక్ చేసుకుంటే తనకు లాటరీ తగిలినట్టు తెలిసింది. అయితే.. లాటరీలపై డానీకి అవగాహన లేకపోవడంతో తాను ఎంత డబ్బు గెలుచుకున్నాడో అతడికి అర్థంకాలేదు.
దీంతో.. డానీ మరోసారి తన స్నేహితుడిని ఆశ్రయించడంతో భారీ నగదు గెలుచుకున్నట్టు తేలింది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది ఏకంగా 1.2 కోట్లకు సమానం. దీంతో.. డానీ ఒక్కసారిగా సంబరపడిపోయాడు. తన అదృష్టాన్ని తానే నమ్మలేక నోరేళ్లబెట్టాడు. ఇక డానీ ఉదంతం స్థానికంగా పెను సంచలనానికే దారి తీసింది. అయితే.. డానీ తన డబ్బును విచ్చలివిడిగా ఖర్చు చేయనని స్పష్టం చేశాడు. తనకు ఇంతటి అదృష్టం పట్టడానికి కారణమైన మిత్రుడికి సర్ప్రైజ్ ఇచ్చేలా ఓ బహుమతిని ప్లాన్ చేస్తున్నట్టు స్థానిక మీడియాకు తెలిపాడు.
కాగా.. గత నెలలో అమెరికాకు చెందిన ఓ మహిళ రెండు సార్లు వెంటవెంటనే లాటరీ గెలుచుకున్నారు. మొదటిసారి కొన్న లాటరీతో సుమారు 87 లక్షలు( మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) గెలుచుకున్న ఆమె ఆ డబ్బులో కొంత మొత్తంతో మరో లాటరీ కొన్నారు. దానికి ఏకంగా రూ. 2.8 కోట్లు వచ్చి పడటంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Updated Date - 2022-11-25T20:41:19+05:30 IST