America: అగ్రరాజ్యంలో ఘోరం.. 15నెలల పసివాడిని కాల్చి చంపిన ముడేళ్ల బాలుడు!
ABN, First Publish Date - 2022-10-23T10:26:27+05:30
అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణం జరిగింది. పెన్సిల్వేనియాలో మూడేళ్ల బాలుడు 15 నెలల పసికందును తుపాకీతో కాల్చి చంపాడు. దీంతో ఈ సంఘటన మరోసారి యూఎస్‌లో తుపాకీ సంస్కృతిపై చర్చకు దారితీసింది.
పెన్సిల్వేనియా: అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణం జరిగింది. పెన్సిల్వేనియాలో మూడేళ్ల బాలుడు 15 నెలల పసికందును తుపాకీతో కాల్చి చంపాడు. దీంతో ఈ సంఘటన మరోసారి యూఎస్‌లో తుపాకీ సంస్కృతిపై చర్చకు దారితీసింది. మూడేళ్ల బాబు 15 నెలల పసివాడి ముఖంపై తుపాకీ గురిపెట్టి మరీ కాల్చిన ఈ సంఘటన స్థానికంగా అందరిని షాక్‌కు గురి చేసింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న లాంకాస్టర్ బ్యూరో ఆఫ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెన్సిల్వేనియాలోని లాంకాస్టర్‌లో (Lancaster) ఈ ఘటన జరిగింది. తమ ఇంటికి బందువుల పిల్లాడు వచ్చాడని, వాడు తమ మనవడితో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు మృతి చెందిన పసివాడి తాత చెప్పాడు. అలా ఇద్దరూ కలిసి ఆడుకుంటున్న సమయంలో మూడేళ్ల బాలుడి చేతికి తుపాకీ దొరికింది. దాంతో ఆ తుపాకీని బొమ్మ అనుకుని 15నెలల పిల్లాడి ముఖంపై కాల్చేశాడు.
అంతే.. ఒక్కసారిగా పసివాడు గట్టిగా ఏడ్చాడు. అలా ఏడుపు వినిపించడంతో వెంటనే తాత వెళ్లి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకయ్యాడు. ఆ పసివాడు తీవ్ర గాయాలతో కొనఊపిరితో కొట్టుకుంటున్నాడు. దాంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే తన మనవడు మృతి చెందినట్టు పిల్లాడి తాత పోలీసులకు చెప్పాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక అమెరికాలో ఆత్మ రక్షణ కోసం తుపాకులు వాడటం సహజమేనని పోలీసులు పేర్కొన్నారు. కానీ, వాటిని పిల్లలకు అందకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పేరెంట్స్ అజాగ్రత్త కారణంగా అభంశుభం తెలియని 15 నెలల పసివాడు మృతి చెందటం ఎంతో బాధాకరమని లాంకాస్టర్ పోలీసులు అన్నారు. కాగా, ఈ ఘటన విషయమై ఇప్పటి వరకూ ఎవరిని అదుపులోకి తీసుకోలేదని, దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Updated Date - 2022-10-23T10:47:40+05:30 IST