Elon Musk: ఇద్దరు ఉద్యోగులను తొలగించిన మస్క్..? తన ట్వీట్లను విమర్శించడంతో..
ABN, First Publish Date - 2022-12-23T21:47:17+05:30
తన ట్వీట్లను విమర్శించిన ఇద్దరు టెస్లా ఉద్యోగులను సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తొలగించారన్న వార్త ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: తన ట్వీట్లను విమర్శించిన ఇద్దరు టెస్లా(Tesla) ఉద్యోగులను సంస్థ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) తొలగించారన్న(Fired) వార్త ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది. టెస్లా సంస్థ అనుసరిస్తున్న విధివిధానాలను(Anti Harrasment Policy) విమర్శించే ఓ ఉద్యోగుల బృందంలోని ఇద్దరిని మస్క్ తొలగించారని సమాచారం. జూన్‌లోనే వారిని ఉద్యోగాల నుంచి తీసేశారట. ఆ బృందం జరుపిన చర్చలు టెస్లాపై దాడిగా సంస్థ యాజమాన్యం భావించినట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరికి అంతకుముందు నెలలోనే జీతం కూడా పెంచినట్టు సమాచారం. టెస్లాలో అనుసరిస్తున్న ఉద్యోగుల వేధింపుల నిరోధక విధానానికి విరుద్ధంగా మస్క్ ట్వీట్ చేశారంటూ సదరు ఉద్యోగి విమర్శించాడని సమాచారం. భావప్రకటనా స్వేచ్ఛకు స్వయం ప్రకటిత రాయబారిగా మారిన మస్క్ తనపై వచ్చిన విమర్శలను మాత్రం తట్టుకోలేకపోయారన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తనను విమర్శించే వాళ్లకూ ట్విటర్‌లో స్థానం ఉంటుందని మస్క్ గతంలో అనేక మార్లు బహిరంగంగా ప్రకటించారు. అయితే.. కార్మిక చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించినందుకే వారిని తీసేసినట్టు ఓ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు.. మాజీ ఉద్యోగులిద్దరూ మస్క్ తీరుపై సంబంధిత ప్రభుత్వ శాఖల్లో ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ పరిణామంపై టెస్లా ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు.
Updated Date - 2022-12-23T23:21:23+05:30 IST