NRI: ట్విటర్ దెబ్బకు హెచ్-1బీ వీసాదారుల్లో టెన్షన్.. 60 రోజుల డెడ్‌లైన్..
ABN, First Publish Date - 2022-11-05T17:54:57+05:30
ట్వీటర్‌లో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులు 60 రోజుల లోపు కొత్త సంస్థలో చేరాలని పరిశీలకులు చెబుతున్నారు.
ఎన్నారై డెస్క్: ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్ (Twitter).. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon musk) చేతుల్లోకి వెళ్లాక సంస్థలో ఉద్యోగుల తొలగింపు మొదలైంది. మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం మందిని తొలగిస్తారని ఓ అంచనా. ఇప్పటికే సంస్థ అనేక మందిని ఉద్యోగంలోంచి తీసేసింది. వీరిలో అనేక మంది విదేశీయులు.. హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వంటి అమెరికా వర్క్ వీసాలపై సంస్థలో పనిచేసేవారు. ఇలా అకస్మాత్తుగా ఉద్యోగం పోవడంతో విదేశీయులు చాలా మంది చిక్కుల్లో పడిపోయారు. ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక ప్రకారం.. సుమారు 670 మంది హెచ్-1బీ వీసాదారులు ట్విటర్‌లో పనిచేస్తున్నారు. మొత్తం ఉద్యోగుల్లో వీరి వాటా ఏడు శాతం. అయితే.. వీళ్లలో ఎంత మంది జాబ్స్ కోల్పోయారో ట్విటర్ ప్రకటించలేదు.
ఇక వీసా నిబంధనల ప్రకారం.. హెచ్-1బీ వీసా(H-1b) ఉన్నవారు జాబ్ కోల్పోయాక సాధారణంగా 60 రోజుల గ్రేస్ పీరియడ్(Grace period) లోపల మరో సంస్థలో చేరి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే.. ప్రస్తుత వీసా కాలపరిమితి ఆధారంగా ఈ గ్రేస్ పీరియడ్‌ను లెక్కిస్తారు. 60 రోజుల్లోపే వీసా గడువు ముగిసే సందర్భంలో గ్రేస్ పీరియడ్ కూడా తక్కువగానే ఉంటుంది. దీంతో.. ఉద్యోగాలు కోల్పోయిన కొందరు విదేశీయులు కాలంతో పందెంవేసి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఇలాంటి వారికి వార్షిక వీసా కోటాలో అప్పటికే చోటుదక్కడం కాస్తంత ఊరటనిచ్చే అంశమని పరిశీలకులు చెబుతున్నారు. వీసా స్పాన్సర్లు తొందరగా దొరికే అవకాశం ఉందని అంటున్నారు.
యువకుడి ఉదంతం వైరల్..! ట్విటర్‌లో ఉద్యోగం పోయాక..
ఇక కంపెనీల అంతర్గత బదిలీల్లో భాగంగా ఎల్-1వీసాపై(L-1 Visa) అమెరికా వచ్చిన వారికి చిక్కులు తప్పవు. ఇలాంటి వారు జాబ్ కోల్పోయాక ఖచ్చితంగా తమ మాతృదేశానికి తిరిగెళ్లాల్సి ఉంటుంది. అయితే.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ ముగిసినా అమెరికాలో ఉండాలనుకునే వారు టూరిస్ట్ వీసా కేటగిరీకి మారితే తక్షణం దేశాన్ని వీడాల్సిన అగత్యం ఉండదు.
Updated Date - 2022-11-05T18:29:13+05:30 IST