NRI: మాజీ గర్ల్‌ఫ్రెండ్ పెళ్లికి సిద్ధమైందని తెలిసి ఈర్ష్యతో రగిలిపోయిన ఎన్నారై.. ఆమె పెళ్లికి ముందురోజు రాత్రి..
ABN, First Publish Date - 2022-12-10T17:53:07+05:30
తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ మరొకరిని మనువాడనుందని తెలిసి సహించలేకపోయిన ఓ ఎన్నారై ఆమెకు కాబోయే భర్తను ఇబ్బందుల పాలు చేయబోయి చివరకు తానే జైలు పాలయ్యాడు.
ఎన్నారై డెస్క్: తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ మరొకరిని మనువాడనుందని తెలిసి సహించలేకపోయిన ఓ ఎన్నారై(Indian Origin Singaporean) ఆమెకు కాబోయే భర్తను ఇబ్బందుల పాలు చేయబోయి చివరకు తానే జైలు పాలయ్యాడు. పోలీసులకు చిక్కిన అతడు తాను తప్పు చేసినట్టు అంగీకరించడంతో సింగపూర్ న్యాయస్థానం తాజాగా నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. భారత సంతతికి చెందిన సురెంద్రన్ సుకుమారన్, అతడి ప్రేయసి.. కొంత కాలం క్రితం విడిపోయారు(Failed Relationship). కానీ ఆమె.. మహ్మద్ అజ్లీ మహ్మద్ సాలేహ్ అనే వ్యక్తిని పెళ్లాడనున్నట్టు ఈ ఏడాది మార్చి 11న అతడికి తెలిసింది. యువతి ఇన్‌స్టా పోస్టుల ద్వారా సురేంద్రన్ ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. దీంతో.. అతడు ఈర్ష్య, కోపంతో రగిలిపోయాడు.
మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను వేధించాలని నిర్ణయించుకున్న సురేంద్రన్ ఆమెకు కాబోయే భర్తను టార్గెట్ చేసుకున్నాడు. మాజీ ప్రేయసి వివాహానికి ముందు రోజు రాత్రి అతడు.. మహ్మద్ సాలేహ్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. 13వ అంతస్తులో ఉన్న అతడి ఫ్లాట్‌కు వెళ్లిన సురేంద్రన్.. ఇంటి ముందు అగ్గి రాజేశాడు(Start Fire). ఆపై.. సాలేహ్ బయటకు రాకుండా ఫ్లాట్ ముందున్న గేట్‌కు తాళం పెట్టి పారిపోయాడు. సీసీటీవీకి చిక్కకుండా ఉండేందుకు సురేంద్రన్ ముసుగు ధరించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. అయితే..తలుపు తెరిచి చూసిన బాధితుడికి ఇంటిముందున్న చెప్పులు మంటల్లో దగ్ధమవడం చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసుల దర్యాప్తులో సురేంద్రన్ బండారం మొత్తం బయటపడింది. చివరకు నిందితుడు తాను నేరం చేసినట్టు అక్టోబర్‌లో ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే న్యాయస్థానం శుక్రవారం సురేంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అతడు చాలా ప్రమాదకరమైన దుశ్చర్యకు పాల్పడ్డాడని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఫ్లాట్లోపల ఉన్న వారికి అపాయం కలగొచ్చని తెలిసీ నిందితుడు అగ్గి రాజేశాడని పేర్కొంది.
Updated Date - 2022-12-10T17:54:07+05:30 IST