Chennai Teacher: చేసిన తప్పేంటో తెలుసుకునే లోపే పుణ్య కాలం కాస్తా పూర్తయిపోయింది..!
ABN, First Publish Date - 2022-10-14T00:55:58+05:30
ఈ ఫొటోలోని కనిపిస్తున్న యువతి పేరు షర్మిల. వయసు 24 సంవత్సరాలు. తమిళనాడులోని అంబత్తూరులో ఉన్న ప్రభుత్వ అనుబంధ హైస్కూల్‌లో టీచర్‌గా..
చెన్నై: ఈ ఫొటోలోని కనిపిస్తున్న యువతి పేరు షర్మిల. వయసు 24 సంవత్సరాలు. తమిళనాడులోని అంబత్తూరులో ఉన్న ప్రభుత్వ అనుబంధ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఇంటి దగ్గర సాయంత్రం ట్యూషన్ కూడా చెబుతుంది. షర్మిల పనిచేస్తున్న స్కూల్‌లోనే కళ్లిక్కుప్పం ప్రాంతానికి చెందిన ఒక 17 ఏళ్ల బాలుడు 12వ తరగతి చదువుతుండేవాడు. షర్మిల చెప్పే ట్యూషన్‌కు కూడా ఈ బాలుడు వెళ్లేవాడు. సాయంత్రం పూట మాత్రమే ఈ బాలుడు ఆమె ట్యూషన్‌కు వెళ్లి చదువుకునేవాడు. ఈ క్రమంలో.. షర్మిలకు, ఆ బాలుడికి మధ్య పరిచయం ఏర్పడింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఈ టీచర్ ప్రేమ పాఠాలు నేర్పింది. ఇద్దరూ కలిసి ప్రేమాయణం నడిపారు. చదువు చెప్పే టీచర్ అనే సంగతి ఆమె మరిచింది. చదువుకోవడానికి ట్యూషన్‌కు వెళ్లాడనే సంగతి ఆ బాలుడు కూడా మర్చిపోయాడు. షర్మిల ఈ 17 ఏళ్ల బాలుడిపై వలపు వల విసిరింది. చనువు పెరిగింది. ఇద్దరూ శారీరకంగా కూడా పలుమార్లు కలిశారు. ట్యూషన్‌కు వెళ్లే తోటి విద్యార్థులను ఒక తీరుగా, ఈ బాలుడిని మరో తీరుగా షర్మిల చూసేది. ట్యూషన్ అయిపోయాక కూడా ఫోన్‌లో ఇద్దరూ గంటలు గంటలు మాట్లాడుకునేవారు.
ఇలా వీళ్ల బంధం కొన్ని నెలల పాటు కొనసాగింది. వాట్సాప్‌లో పొద్దుపోయాక కూడా చాట్ చేసుకునేవారు. ఇద్దరూ చనువుగా ఉన్న సమయంలో ఫొటోలు, సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఇలా ప్రేమాయణం సాగుతుండగా ఆ బాలుడు 12వ తరగతి పూర్తి చేసుకుని కాలేజ్‌లో చేరాల్సిన సమయం వచ్చింది. ట్యూషన్‌కు వెళ్లే అవసరం కూడా లేకుండా పోయింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ క్రమంగా పెరుగుతూ పోయింది. ఆ క్రమంలోనే.. షర్మిలకు మరో వ్యక్తికి నిశ్చితార్థం జరిగింది. దీంతో.. అప్పటి నుంచి ఆ బాలుడిని షర్మిల పూర్తిగా దూరం పెట్టేసింది. తనకు వేరే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ జరిగిందని.. ఇక నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు కూడా వద్దని తెగేసి చెప్పింది. ఈ పరిణామంతో షాకైన ఆ బాలుడు కలిసి మాట్లాడాలని షర్మిలకు చెప్పాడు. ఇద్దరూ ఒకరోజు కలిసి మాట్లాడుకున్నారు.
ఇక మీదట దూరంగా ఉందామని తెగేసి చెప్పి షర్మిల అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆ రోజు నుంచి ఆ బాలుడు ముభావంగా ఉండేవాడు. ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఏదో కోల్పోయిన వాడిలా గడిపాడు. టీచర్‌ను ఇక కలవలేననే ఆలోచనే అతనిని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. జీవితంపై విరక్తితో ఇంట్లోని బెడ్రూంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు ప్రభుత్వాసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. ఆ బాలుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఆ బాలుడి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా ఆ టీచర్‌తో కలిసి చనువుగా ఉన్న ఫొటోలు, కాల్ రికార్డింగ్స్ బయటపడ్డాయి. దీంతో.. పోలీసులకు ఆత్మహత్యకు కారణం ఏంటో అర్థమైపోయింది. షర్మిలను పిలిచి విచారించగా అసలు విషయం బయటపడింది. షర్మిలపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపింది.
Updated Date - 2022-10-14T00:55:58+05:30 IST