E-commerce: 50 అంగుళాల టీవీకి ఆర్డరిచ్చాడు కానీ ఇతడు చేసిన తప్పేంటంటే..
ABN, First Publish Date - 2022-11-22T19:32:09+05:30
ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు రివ్యూల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుందో చెప్పే ఉదంతం ఇది.
ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో ఏ వస్తువు కొనాలన్నా(Online Shopping) మనం ముందుగా దాని రివ్యూలు(Reviews)..అంటే సమీక్షలు చూశాకే ఓ నిర్ణయానికి వస్తాం. వాటికున్న ప్రాముఖ్యత అలాంటిది. అయితే.. మనం చదివే ప్రతి సమీక్ష సరైనదై ఉండాలన్న నియమం ఏం లేదు. అవగాహన లేకపోతే.. తప్పుడు రివ్యూలనే నిజమనుకునే ప్రమాదం ఉంది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ ఉదంతమే ఇందుకు మంచి ఉదాహరణ. 50 ఇంచ్‌ల శామ్‌సంగ్ టీవీ ఆర్డరిచ్చి మోసపోయానంటూ ఓ కస్టమర్ పెట్టిన రివ్యూ అది.
‘‘శామ్‌సంగ్(Samsung) 8 సిరీస్ టీయూ800050 కొన్నా. కానీ.. ఇంటికొచ్చిన ప్యాకేజీ చూస్తే.. మోసపోయానని అర్థమైంది. నాకు 44 ఇంచ్‌ల టీవీనే వచ్చింది. బాక్స్ సైజ్ కేవలం 49 ఇంచ్‌లే. దానిలో ఉన్న ప్యాకింగ్ మెటీరియల్ కూడా కలుపుకుంటే..అందులో 50 ఇంచ్‌ల టీవీ పట్టే అవకాశమే లేదు’’ అని పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా.. తాను టీవీ కొలతలు తీసుకుంటున్న ఫొటోను కూడా అప్‌లోడ్ చేశాడు. అయితే..అతడు ఓ అంచు నుంచి మరో అంచు వరకూ అడ్డంగా టీవీని కొలిచి దాని సైజు లెక్కగట్టాడు. వాస్తవానికి టీవీ కొలతల కోసం ఓ కొన నుంచి మరో కొన వరకూ కొలవాలి.
అయితే..అనేక మంది ఆ కస్టమర్ తప్పును గుర్తించకపోగా.. అతడికే మద్దతుగా నిలిచారు. అతడి రివ్యూ ఉపయోగకరంగా ఉందని ఏకంగా 642 మంది అభిప్రాయపడ్డారు. ఇదంతా నెట్టింట్లో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ కస్టమర్ చేసిన పొరపాటు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇతరుల నుంచి అతడికి అందుతున్న మద్దతు చూసి మరింత ఆశ్చర్యపోతున్నారు. అయితే.. టీవీ సైజు ఎలా కొలవాలన్న విషయంపై చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో కస్టమర్లు అవగాహన పెంచుకోవడమే ఉత్తమమని సూచించారు.
Updated Date - 2022-11-22T19:52:04+05:30 IST