హ్యాట్సాఫ్.. కేవలం15వేల జీతం తీసుకుంటూ.. 9వేల కోట్ల టర్నోవర్ సంస్థను అభివృద్ది చేసింది..!
ABN, First Publish Date - 2022-12-06T11:58:19+05:30
కష్టపడే తత్వం, సరైన ఆలోచనలు, మెరుగైన ప్రణాళికలతో వ్యాపారాన్ని ఎలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళచ్చో అనుభవపూర్వకంగా......
వ్యాపార సంస్థలు అంటేనే వందల నుండి వేల కోట్ల విలువ కలిగి ఉంటాయి. అయితే విత్తనం మొక్క అయినట్టే ప్రతిదీ అభివృద్ది చెందుతుంది. తన సంస్థలోనే నెలకు 15వేల జీతం తీసుకుంటూ 9000 కోట్ల సామ్రాజ్యంగా మార్చిందొక వనిత. భారతదేశంలో ప్రతి మహిళకూ ప్రేరణగా నిలిచే ఈమె ఎవరు? తన తండ్రి ఒక చిన్న గదిలో పెట్టుకున్న ల్యాబ్ నుండి మొదలైన ఈమె ప్రస్థానం.. ఇప్పుడు వేల కోట్లకు ఎలా చేరింది? వంటి విషయాలు తెలియాలంటే మనం ఆమె పూర్తి విజయ గాథను తెలుసుకుందాం పదండి..
అమీరా షా.. కష్టపడే తత్వం, సరైన ఆలోచనలు, మెరుగైన ప్రణాళికలతో వ్యాపారాన్ని ఎలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళచ్చో అనుభవపూర్వకంగా నిరూపించిన మహిళ. తన తండ్రి చిన్న గదిలో నిర్వహిస్తున్న పాథాలజీ ల్యాబ్ ను 7 దేశాలకు, 171 ల్యాబ్స్ కు విస్తరించిన మహిళ. అంతర్జాతీయ పాథాలజీ సంస్థ 'మెట్రోపాలిస్' ను స్థాపించి నేడు సమర్థవంతంగా దాన్ని నడుపుతున్న మహిళ. భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి పాథాలజీ సంస్థ ఇదే కావడం గమనార్హం.
అమీరా తండ్రి డాక్టర్ సుశీల్ షా ఓ వైద్యుడు, తల్లి కూడా.. డాక్టరే.. 'సుశీల్ షా లేబొరేటరీ' పేరుతో ఒక చిన్న గదిలో పాథాలజీ ల్యాబ్ ను సుశీల్ షా నడిపేవారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు నోబెల్ గ్రహీత అయిన మహమ్మద్ యూనస్ జీవితం అమీరాను ప్రభావితం చేసింది. అమెరికాలో టెక్సాస్ యూనివర్సిటీ నుండి పైనాన్స్ లో గ్రాడ్యుయేట్ చేసిన అమీరా 2001 సంవత్సరంలో అక్కడి నుండి భారతదేశానికి వచ్చేసింది. తన తండ్రి ఒకే ఒక గదిలో నిర్వహిస్తున్న పాథాలజీ ల్యాబ్ ను చూసి భవిష్యత్తులో ఈ రంగానికి ఆదరణ చాలా పెరుగుతుందని, పాథాలజీ ల్యాబ్ అవసరాలు కూడా పెరుగుతాయని భావించింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మెట్రోపాలిస్ సంస్థను స్థాపించింది.
అయితే సంస్థను స్థాపించినంత సులువుగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం సాధ్యపడలేదు ఆమెకు. దీనికి కారణం వైద్యులకు కేవలం వారి వృత్తి సంబంధ విషయాలు మాత్రమే తెలిసి ఉంటాయి తప్ప వ్యాపార కోణంలో అవగాహన తక్కువ. ఈ కారణంగా వైద్యులు తమ వృత్తితో పాటు వ్యాపార కిటుకులు కూడా తెలుసుకోవాల్సి వచ్చింది. ఇలా తెలుసుకున్న తరువాత మెట్రోపాలిస్ సంస్థ ఆర్థికంగా అభివృద్ది చెందింది.
అప్పు కాదు బాధ్యత.. అంటున్నారు.
చాలా మంది బ్యాంకుల నుండి బుణాలు తీసుకుంటే దాన్ని తమ సొంత ఆస్థిలాగా ఫీలైపోయి ఖర్చుపెట్టేసి ఆ తరువాత దాన్ని క్లియర్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. కానీ అప్పుతీసుకోవడాన్ని బాధ్యతగా బావించాలి. దాన్ని ఆరోగ్యవంతంగా తిరిగి ఇవ్వాలి. అప్పుడు మీదగ్గర పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తారు. అని చెబుతారు అమీరా. ఈమె తన వ్యాపారాన్ని అబివృద్ది చేసుకోవడానికి 2015లో 600 కోట్లు అప్పు తీసుకున్నారు. ఇలా అప్పులు తీసుకునే విషయంలో ఆమె అందరికీ మరొక చిట్కా కూడా చెప్పారు. కేవలం సంస్థ అభివృద్దికి కావలసింత మాత్రమే అప్పు తీసుకోవడం మంచిదట. ఎలాగు అప్పు తీసుకుంటున్నాం కాబట్టి కావలసిన వస్తువులు కారు వంటి విలాసవంతమైన వస్తువుల కోసం మరింత ఎక్కువ తీసుకుందాం అనే ఆలోచనా ధోరణి అసలు మంచిది కాదని అమీరా షా చెప్పారు. నారీ శక్తిని రుజువు చేస్తున్న అమీరా ఎందరో భారతీయ మహిళలకు ఆదర్శమవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Updated Date - 2022-12-06T11:58:20+05:30 IST