Hyderabad Book Fair: రెండేళ్లలో 10 లక్షల విలువైన బుక్స్ అమ్మేశా...!
ABN, First Publish Date - 2022-12-21T18:45:39+05:30
టెక్నాలజీ పరంగా రచయితలు చాలా అప్డేట్ అవ్వాల్సి ఉంది.
"మీరు ఒక్కరూ ఏం చేయగలరు" అనే ప్రశ్నకు ఆమె "అచ్చంగా తెలుగు" పుస్తక ప్రచురణ సంస్థను స్థాపించి సమస్యలను అధిగమిస్తూ, సక్సెస్ ఫుల్ బుక్ పబ్లిషర్ గా కొనసాగుతూ, సమాధానం చెప్పారు. స్త్రీ పుస్తక ముద్రణ రంగంలో కొనసాగడం అంటే పెద్ద సవాలే. బటన్ నొక్కగానే పుస్తకాలు వచ్చి స్టాల్స్ లో నిండిపోవు. ముద్రణ నుంచి పాఠకుడిని చేరేంత వరకూ పుస్తకం ప్రయాణంలో ఎంతో ప్రేయాసకోర్చి విజయాన్ని అందుకోవాలి. ఈ కష్టతరమైన ప్రయాణంలో అచ్చంగా తెలుగు పద్మినిగారు తన అనుభవాలను బుక్ ఫెయిర్ స్పెషల్స్ లో ఆంధ్రజ్యోతి వెబ్ తో పంచుకున్నారు.
1. పుస్తకాలను కొనడంలో పాఠకులకు, ప్రచురణకర్తలకు మధ్యన సంబంధాలు ఎలా ఉన్నాయంటారు?
పాఠకులు తగ్గలేదండి. ఇప్పటికీ రాత్రి నిద్ర పోయేముందు పుస్తకం చదవకపోతే నిద్ర పట్టని వారు ఉన్నారు. కానీ, పాఠకులకు, ప్రచురణకర్తలకు మధ్యన ఒక గ్యాప్ ఏర్పడింది. 'జ్యో దిక్తా హై వో బిక్తా హై' అని హిందీలో ఒక మాట ఉంది. వచ్చే కొత్త పుస్తకాలను గురించిన సమాచారం పాఠకులకు తెలియట్లేదు. కొందరు రచయితలు వారి పుస్తకం గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టడానికే బిడియ పడతారు. అసలు పుస్తకం వచ్చిందనే ఎవరికీ తెలియకపోతే, ఇక కొనుగోలు చేయడం ఎలా జరుగుతుంది?
నా వరకూ నేను ఇంట్లో కూర్చునే గత రెండు సంవత్సరాలుగా 10 లక్షలకు పైగా విలువైన పుస్తకాలను ఆన్లైన్లో అమ్మాను. ఒక పుస్తకం ధర పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది. అటువంటి అప్పుడు 10 లక్షల విలువైన పుస్తకాల అమ్మకం వెనుక ఎంత శ్రమ ఉండి ఉంటుందో మీరు ఊహించవచ్చు. రెండుసార్లు నేను పుస్తక ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేశాను. ఇప్పుడు మూడవసారి ఏర్పాటు చేయబోతున్నాను.
2. తెలుగు పుస్తకాల మార్కెట్ ను పూర్తిగా కమ్మేసేంత ప్రభావం అనువాదాలకు ఉన్నదంటారా?
కొంతమంది ఇంగ్లీష్ పుస్తకాలను, వాటి అనువాదాలను ఇష్టపడుతున్న మాట వాస్తవమే! కానీ కొందరు అచ్చ తెలుగు పుస్తకాలకే ఓటు వేస్తారు. తెలుగు పుస్తకాల మార్కెట్ ను పూర్తిగా కమ్మేసేంత ప్రభావం ఇంగ్లీష్ పుస్తకాలు చూపుతున్నాయని నేను భావించట్లేదు.
3. పుస్తకాలను ముద్రించడం వరకూ సరే అమ్మకాల విషయంలో మరేదైనా మార్గం ఆలోచించారా? ఈ విక్రయానికి మాధ్యమాల తోడ్పాటు ఎంతవరకూ ఉంది?
కవితలు, శతకాలు వంటి అమ్ముడవని పుస్తకాల విక్రయం నిజానికి కష్టమేనండి. కానీ instagram వంటి మాధ్యమాల ద్వారా సరైన మార్కెటింగ్ ఉంటే అవి కూడా అమ్ముడు అవుతాయని, కొంతమంది నవ కవులను చూసి తెలుసుకున్నాను. ప్రచురణ ఒక నైపుణ్యం అయితే, అమ్మకం కూడా ఒక నైపుణ్యం అని అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. తగిన నైపుణ్యాలను అలవర్చుకుంటే ఏదైనా సుసాధ్యమే!
4. మగవారితో పోల్చితే ఈ పుస్తకప్రచురణ రంగంలో కొనసాగడం అనేది కత్తిమీద సాములా అనిపించిన సందర్భలున్నాయా?
అలా ఎన్నడూ అనిపించలేదండి. ఆడ, మగ విభేదాలు చెరిగిపోయి ఎన్నో సంవత్సరాలయింది. నిజానికి ఆడవారికి మగవారితో పోలిస్తే, ఓపిక చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఓపికే మన బలం. మన సహనం, క్షమ, దయ, ప్రేమ మనకు మరింత బలాన్నిచ్చే ఆయుధాలు. వీటి బలంతో కొనసాగుతున్న నావంటి మహిళా ప్రచురణ కర్తలు, పుస్తక విక్రేతలు నా స్నేహితురాళ్ళలో ఎంతోమంది ఉన్నారు. వారందరికీ జేజేలు.
5. ఇన్నిపుస్తకాలను మార్కెట్ లోకి తెస్తుంటే వాటిని కొనేవారి సంఖ్య ఎలా ఉంది?
నెలకు ఒక పుస్తకం కొనుక్కునే అంకితభావం గల పాఠకులు ఉన్నారు. ప్రభుత్వం వారు సరిగ్గా జీతాలు చెల్లించక పోయినా, జీతం రాంగానే పుస్తకాలు కొనే అధ్యాపకులూ ఉన్నారు. చిత్తశుద్ధి గల పాఠకులు నూటికి నూరు శాతం ఉన్నారు, మనం వారిని చేరుకోవడంలోనే ఒక గ్యాప్ ఉంది.
6. అచ్చుకు వచ్చిన పుస్తకం, మార్కెట్ కు చేరి పాఠకుల చేతిలో పడే వరకూ ప్రక్రియ ఒకఎత్తు.. మరి దాని ఫలితం రచయితకు అందించేలోపు మీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది.
అచ్చంగా తెలుగు ప్రచురణ ఆరంభించిన రెండేళ్లలో సుమారు 75 పుస్తకాలను ముద్రించాము. అందులో లబ్ద ప్రతిష్టులైన కొందరు రచయితలతో పాటుగా, కొత్తవారు కూడా ఉన్నారు. ప్రచురణలతో పాటు, ప్రచురణా సహకారాన్ని కూడా మేము అందిస్తున్నాము. రచయిత మనసులో ఒక ఆలోచన అక్షర రూపం దాల్చినప్పటి నుంచి దాన్ని మాకు అందించాక పుస్తకం వెలువడే దాకా, పుస్తకం వెలువడ్డాక అమెజాన్ లో, మా అచ్చంగా తెలుగు పుస్తకాల వెబ్సైట్లో, వాట్సాప్‌లో అమ్మకాల దాకా, సమీక్షలకు పంపించడం వరకూ, అమ్ముడైన పుస్తకాల డబ్బును రచయిత ఖాతాలో జమ చేయడం దాకా మేము అదనపు సహకారాన్ని అందిస్తున్నాము. ఈ రోజున మా ద్వారా వందకు పైగా రచయితలు తమ పుస్తకాలను విక్రయిస్తున్నారు. వీటి అన్నింటి వల్ల తెలుగు సాహిత్యానికి, దాన్ని పంచిస్తున్న రచయితకు మా సంస్థ ద్వారా మా చేతనైనంత ఊతాన్ని అందిస్తున్నామని భావిస్తున్నాను.
7. ప్రచురణ కర్తలుగా ముందుకు సాగుతున్నారు. ఆడవారిగా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా చెపుతారా?
''మీరు కొట్టు పెట్టి పుస్తకాలు అమ్ముకుంటారా?' అంటూ అవగాహన లేని కొందరు చులకన భావంతో మాట్లాడడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. మనం చేసే పని సరైనది అన్న చిత్తశుద్ధి ఉన్నప్పుడు, ఇటువంటి మాటలను పట్టించుకోకుండా మన విజయాన్నే, ఇటువంటి వారికి సమాధానంగా ఇవ్వాలి. తన తోకనే చుట్టచుట్టుకొని సింహాసనం గా మలుచుకొని, రావణుని ముందు కూర్చున్న ఆంజనేయ స్వామిలాగా, స్త్రీ అంచలంచెలుగా ఎదుగుతూ వీళ్ళ కళ్ళముందే ఆడవారి సత్తా నిరూపించాలి! నిజానికి 100కు పైగా రచయితలు రచించిన 600కు పైగా పుస్తకాలు ఈ రోజున మా వద్ద అమ్మకానికి ఉన్నాయి. ఇంత డేటాని కంప్యూటర్ లేకుండా నేను మాత్రమే మైంటైన్ చేయ్యాలంటే, దానికి మాస్టర్ బ్రెయిన్ ఉండాలి. సవాళ్లను ఎదుర్కొంటూ, ఒకపక్క ప్రచురణలు, ఒకపక్క అమ్మకాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగడం చాలా ఆనందంగా ఉంది.
8. కోవిడ్ అనంతరం పుస్తక ప్రచురణ రంగంలో మీరు గమనించిన మార్పులేమిటి?
నిజానికి కోవిడ్ సమయంలో కూడా పోస్టల్ సర్వీస్ ద్వారా నేను చాలా పుస్తకాలు అమ్మాను. కోవిడ్ అనంతరం కొందరి ఆర్థిక స్థితి చితికిపోయిన మాట వాస్తవమే. ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచించే స్థితికి కొన్ని కుటుంబాలు దిగజారిపోయాయి. అయినా ప్రస్తుతం మళ్లీ ప్రచురణా రంగం కోలుకుంటోంది. మరొక అంశం ఏమిటంటే, ప్రస్తుతం డిజిటల్ ప్రింటింగ్ అందుబాటులోకి రావడంతో రచయితలు 50 నుంచి 100, 200 కాపీలు మాత్రమే ముద్రించుకొని, తిరిగి కాపీలు అయిపోయాక పునర్ముద్రించుకుంటున్నారు. దీనివల్ల పుస్తకాలు ఉంచేందుకు ఎక్కువ చోటును ఖాళీ చేయక్కర్లేదు, ఎక్కువ ఆర్థిక భారాన్ని ఒకేసారి వహించక్కర్లేదు. ఇది కూడా రచయితల పాలిటి వరమనే చెప్పాలి. గత ఏడాది పుస్తకాల అమ్మకాలు చాలా బాగా జరిగాయి. కోవిడ్ భయం సన్నగిల్లిన తర్వాత ఇది రెండవ పుస్తకాల ఎగ్జిబిషన్. కనుక, మునుపటి కంటే ఆశావాహంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.
9. ప్రచురణా రంగానికి తగినట్టు రచయితల్లో ఎలాంటి మార్పు వస్తే బావుంటుందని మీరు భావిస్తున్నారు?
ముఖ్యంగా టెక్నాలజీ పరంగా రచయితలు చాలా అప్డేట్ అవ్వాల్సి ఉంది. ఎవరేమనుకుంటారో అన్న బిడియాన్ని కూడా విడనాడాలి. తమ రచనలను, పుస్తకాలను తమ నెట్వర్క్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అందరికీ పంచి పెట్టాలి. పుస్తకం ఉంది అని చెపుతున్నాము, కానీ కొనమని బలవంతం చేయట్లేదు కదా! ఇష్టమైతే కొనుక్కుంటారు. ఒక పుస్తకంలో ఉన్న ఆత్మ, రచయితకి తప్ప, చదివేదాకా ఎవరికీ తెలియదు. అందుకని పుస్తకంలో తాము వెల్లడించిన అంశాల గురించి క్లుప్తంగా ఒకటి రెండు పేరాల సందేశాన్ని అందిస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్లు, స్టేటస్ లు పెడితే మంచి ఫలితం ఉంటుంది. మరో పుస్తకం ప్రచురించుకోవడానికి తగినంత ధనం సమకూరుతుంది. తద్వారా తెలుగు సాహిత్యం నిలబడుతుంది. ఇదే వారికి నేను ఇచ్చే సందేశం.
10. అచ్చంగా తెలుగు ప్రచురణా సంస్థ భవిష్యత్తు ఆలోచనల గురించి చెప్పండి? మీ బుక్స్ ఉంచే స్టాల్ నంబర్స్..?
'అచ్చంగా తెలుగు' అన్న పేరుతో రిజిష్టర్ అయిన మా సంస్థ సోషల్ నెట్వర్క్ లక్షన్నరకు పైనే! ఇదే పేరుతో ఒక ఫేస్బుక్ గ్రూపు, పేజీలు, instagram, 8 ఏళ్లుగా మేము నడుపుతున్న ఒక పత్రిక (ప్రపంచవ్యాప్తంగా మా పత్రికకు నెలకు లక్షకు పైగా పాఠకులు ఉన్నారు) అనేక బ్లాగులు, ప్రచురణలు, పుస్తక విక్రయాలు జరుగుతున్నాయి. ఇదంతా నా ఒక్కదాని ఘనత కాదు. నన్ను తమ ఇంటి ఆడబిడ్డగా భావిస్తూ, నాకు అనేక రకాలుగా సహకారం అందిస్తున్న ఎంతోమంది ఆత్మీయులు ఉన్నారు. వారందరికీ నేను బుణపడి ఉన్నాను. మున్ముందు తెలుగు సంప్రదాయానికి, సాహిత్యానికి ఉపయోగపడే మరిన్ని పుస్తకాలను తీసుకురావాలని మా ఆకాంక్ష. ఇందుకోసం అహర్నిశలు కృషి చేస్తూ, రచయితలకు దన్నుగా నిలుస్తూ ముందుకు సాగుతాము. మా స్టాల్ నంబర్ 257, మా పుస్తకాలు కొన్ని 140 లో కూడా దొరుకుతాయి. సంకల్పం గొప్పదైతే, ప్రకృతి కూడా తలవొగ్గి సహకరిస్తుందని అంటారు. 'అచ్చంగా తెలుగు' సంస్థ తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేయాలన్నది మా ఆకాంక్ష!
- శ్రీశాంతి మెహెర్.
Updated Date - 2022-12-21T19:08:46+05:30 IST