ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ajay Prasad : కథలో ఉండాల్సిన లోపాలన్నీ అందులో కనిపిస్తాయి.

ABN, First Publish Date - 2022-12-22T13:36:51+05:30

నిజం చెప్పాలంటే ఇవే నా మొదటి కథలు. 

Hyderabad Book Festival
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాహిత్య సంద్రంలో ఎంత లోతుకు చేదవేసి తోడితే, అంత అక్షరాల ఊటను తోడుకోవచ్చన్న మాటను నిజం చేసిన రచయిత అజయ్ ప్రసాద్. ఆయన కథలన్నీ ఆ లోతుల్లో పుట్టి పురుడు పోసుకున్నవే. ఈ కథలన్నీ ఒక్క ఆయన అనుభవాలు మాత్రమే కాదు. మన జీవితాలలో దాటిపోయిన, దాగిపోయిన చేదు జ్ఞాపకాలై ఉండచ్చు. ఈ కథల్లో ఊహకు ఊతం ఇస్తూ సాగే కథనం పాఠకులకు ఉత్సాహాన్నిస్తుంది. జీవితం నేర్పిన పాఠాలు, అనుభవాల్లోంచి వచ్చిన కథలకు బంధీలుగా మారి, అజయ్ ప్రసాద్ సృష్టించిన లోకంలో విహరిస్తాం. అవే తనలోకానికి దారులంటూ, రెండు కథల పుస్తకాలతో తన లోకానికి మనల్ని ఆహ్వానిస్తున్నారు. అక్కడికి చేరే దారి జీవితపు ఒరుసుకున్న అనుభవాల దారి.

రచయిత అజయ్ ప్రసాద్ గారితో ఆంధ్రజ్యోతి ఆత్మీయ సంభాషణ..

1. సాహిత్య లోకం ఎలా పరిచయమైంది. సాహిత్యం వైపుకు నడిపించిన బలమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా?

కావాలని  పరిచయం చేసుకున్నది కాదు. చిన్నప్పుడు ఇంటికి పత్రికలు వచ్చేవి. మా నాన్నగారికి వార పత్రికలు చదివే అలవాటుంది. అది మా ఇంటిల్లిపాదీ పుస్తకాలు చదవటం అలవాటు చేసింది. చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర విపరీతంగా చదివేవాడిని. హైస్కూలుకి వచ్చాక టామ్ సాయర్, హకల్ బెరీఫిన్, రాజు పేద వంటి అనువాద నవలలు చదివేవాడిని. వయసు పెరిగేకొద్దీ విపుల కథల మాస పత్రిక, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతిలో కథలు చదివేవాడిని. ఇంట్లో నాకంటే  పెద్దవాళ్ళందరూ ఉద్యోగాలు వచ్చి, పెళ్లిళ్లు అయిపోయి వేరే ఊళ్లకు వెళ్ళిపోయాక మా నాన్నగారితో పోటీపడి పత్రికలు చదివేవాడిని. దానికి తోడు నా హైస్కూలు స్నేహితుడు కాకుమాని శ్రీనివాసరావు స్నేహం నా పుస్తక పఠనం పెరగటానికి దోహదం చేసింది. ఇద్దరం పాకెట్ సైజు జానపద నవలలు అద్దెకు తెచ్చుకుని తెగ చదివేవాళ్ళం. ఊళ్ళో  (అద్దంకి ) శాఖాగ్రంథాలయంలో గంటల తరబడి పుస్తకాలు వెతికేవాళ్ళం. నన్ను కాస్తంత మంచి సాహిత్యంవైపు మళ్లించింది కవిత్వంతో పాటు అనువాద సాహిత్యమనే చెప్పాలి.  

2. మీ కుటుంబ నేపథ్యం? కుటుంబంలో ఎవరైనా సాహితీ ప్రియులున్నారా?

మా నాన్నగారు స్టేట్ గవర్నమెంట్ లో పనిచేసేవారు. ఆయన అప్పటి కృష్ణా జిల్లాలోని దివిసీమలో ఒక కుగ్రామం నుంచి వచ్చారు. ఇప్పటికీ ఆ ఊరుకి సరైన రోడ్డు మార్గం లేదు. సీలేరులో పది సంవత్సరాలు ఎలెక్ట్రిసిటి డిపార్టుమెంటులో చేసి ఆ సర్వీసు పోగొట్టుకుని తన ఊరికి దగ్గరగా ఉంటుందని నాగార్జునసాగర్ ప్రాజెక్టులో చేరారు. ఆయనకి మొదటి నుంచి కాస్త పుస్తకాల పిచ్చి ఉండేది. ఏ పనికిరాని పుస్తకమైనా కాస్తంత చినిగిపోయినట్లు కనిపిస్తే వెంటనే బాగు చేసేవారు. మా ఇంట్లో మేము నలుగురం అన్నదమ్ములం. ఇద్దరు అక్కలు. ఒకరిద్దరు తప్పిస్తే అందరికీ నవలలు, సీరియల్స్ చదివే అలవాటు ఉండేది. ముఖ్యంగా మా పెద్దన్నయ్య చంద్రశేఖర్ ప్రసాద్, పెద్దక్క రమాదేవి. మా అక్కయ్యకు తెలిసిన తెలుగు రచయిత్రుల పేర్లు నాకూ తెలీదు. 

పెద్దన్నయ్య వలన ఇంట్లో కాస్త వామపక్ష భావజాలం ఉన్న పుస్తకాలు చేరాయి. మానాన్న గారికి అవంటే ఆసక్తి లేదుగాని కాలక్రమంలో ఆస్తికుడిగా ఉండే ఆయన నాస్తికుడిగా మారారు. పనికట్టుకుని మాత్రం కాదు. పూజలు చేసేవారు కాదు అంతే. పెద్దన్నయ్య, పెద్దక్క తరవాత సాహిత్య పరిజ్ఞానం పెంచుకున్నవాడు మా మూడో అన్నయ్య హరి ప్రసాద్. పెద్దన్నయ్య  మూలంగా  అతనికీ కాస్త కమ్యూనిస్టు వాసనలు వంటబట్టాయి. అలా మా ఇంట్లో పుస్తకాలు చదవడం అలవాటయిన చివరివాడిని నేను. పెళ్లయిన పదేళ్లకు నా మొదటి భార్య జెన్నీ భారతి 2012 లో చనిపోయింది. మా అబ్బాయి అమ్మమ్మ దగ్గరే విజయవాడలో పెరుగుతున్నాడు. మొదటి భార్య చనిపోయిన నాలుగేళ్లకు ఇక్కడే లక్ష్మితో వివాహం అయింది. ప్రస్తుతం నా బాగోగులు అంతా  తానే చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె చేతుల్లో బతుకుతున్నాను.  

3. కథలు రాయాలనే ఆలోచన కలిగిన తరువాత మొదటి కథ ఏ వయసులో రాసారు. ఆ అనుభవం ఎలా ఉంది?

ముప్పై ఏళ్ళు దాటిన చాలా కాలం వరకూ నేను కథ రాయాలని అనుకోలేదు. మొదటి కథ అనుభవం అంటే గుర్తు లేదు. మాచర్ల అనే ఊళ్ళో ఉన్నప్పుడు ఇంటి వాకిలి ముందు చూరులోంచి పిచుక పిల్ల జారిపడి చాలా సంవత్సరాలు గుర్తుకుండిపోయింది. మరో సారి కుక్కపిల్లని  చూసి భయపడి ఒళ్ళు గగుర్పొడిచి ఇటుకరాయితో  కొట్టాను. అది స్పృహ తప్పి పడిపోయింది. భయపడి మా అమ్మకి చెబితే చెంబుతో నీళ్లు తెచ్చి కుక్కపిల్ల మొహం మీద పోసింది. అది ఉలిక్కిపడి లేచి చెవులు దులుపుకుంటూ వెళ్ళిపోయింది. అదొక జ్ఞాపకం. రెండులోనో మూడులోనో స్కూల్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర మా అమ్మ ఏమి చేస్తుంటదా అని ఆలోచించేవాడిని. నిద్ర వచ్చినట్లయి ఇంటిదగ్గర మధ్యాహ్నపు వాలుటెండలో వాకిలి ముందు అమ్మ బియ్యమేరుతూ కూర్చున్నట్లు, ఆమె ముందు ఇంట్లో తిరిగే పిల్లి ముందుకాళ్ళ మీద నుంచుని ఆమె వంక చూస్తున్నట్లు ఆలోచనలు కలిగేవి. నేను కథలు రాయడానికి కారణం ఇలాంటి వెంటాడే జ్ఞాపకాలే. వాటిలో సంఘటన ఏమీ ఉండదు. ఊరికే ఎండ. ఇంటి వెనక చల్లదనం.. నిజం చెప్పాలంటే ఇవే నా మొదటి కథలు. 

ఇంటరు చదివే రోజుల్లో పాత డైరీలు సేకరించి వాటిలో కొంత కవిత్వం, కొన్ని జ్ఞాపకాలు నింపేవాడిని. ఇంటరు తరవాత నిరుద్యోగంతో కొన్ని సంవత్సరాలు  గడ్డుకాలం నడిచింది. ఆ రోజుల్లో పుస్తకాలు, సాహిత్యం జోలికి వెళ్ళలేదు. చందమామలు, రావిశాస్త్రులు, కుటుంబరావుల్ని మరచిపోయాను. 2003 లోనో ఆ తరవాతో అనుకుంటా మిత్రుడు కాకుమాని శ్రీనివాసరావు  "నువ్వు కథలు రాయొచ్చు కదరా" అన్నాడు. కథలు రాసేది ఎవరో దేవుళ్ళు కదా అని ఆకాశం వైపు చూసి సరే మనమూ ట్రై చేద్దాం అనుకుని ఒకటి రెండు కథలు నా శ్రీమతి పేరుతో రాసాను. ఒకటి ఈనాడు ఆదివారంలో ఇంకొకటి విపులలో వచ్చాయి. ఆ తరవాత నా పేరుతో మరుభూమి అనే కథను ఆదివారం ఆంధ్రజ్యోతికి పంపాను. కథ వచ్చినరోజు పెద్దన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. పత్రిక చూసిన స్నేహితులు ఆనందపడ్డారు. కొంతమంది ఇప్పటికీ అదే నీ మంచి కథ అంటుంటారు. మా నాన్నగారు చదివి "పర్లేదు కథ బాగానే ఉంది" అన్నారు. ఆ తరవాత రెండుమూడు కథలు పడ్డాక ఇంటి పేరు పెట్టకపోయావా? అన్నారు. ఇప్పటికీ అది తలుచుకుంటే గిల్టీగా ఉంటుంది. మొదట్లో పేరు గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆలోచిస్తే ఇంతకంటే మంచి పేరు చూసుకునేవాడినేమో. 

4. కథ రాసేటప్పుడు మీ ఆలోచనలను ఎలా వడగడతారు. కథ పూర్తయ్యాక దాని నిర్మాణంలో సమతుల్యతను ఎలా చూస్తారు?

దినచర్యలో రకరకాల ఆలోచనలు తడుతుంటాయి. కొన్ని ఎవరెవరో వచ్చి తలలో తలుపు తడుతుంటారు. వాటికి అంతూ పొంతూ ఉండదు. అయితే ఏదీ చెప్పిరాదు. కొన్ని కథల్ని వీటినుంచి ఎన్నుకుంటాను.ఎవరేమనుకున్నా సరే  నా వరకు నేను కథని ఒక ఆర్ట్ పీస్ లా భావిస్తాను. అలాగే రాస్తాను. వాటిలో కొన్ని నాకే తెలియని నీడలుంటాయి. కొన్ని కథల్లో  కష్టం కలిగించే వాస్తవాలూ ఉంటాయి. ఇది రాయాలి, ఇది రాయకూడదు అని ఏనాడూ అనుకోలేదు. మొదట్లో కాస్తంత వామపక్ష భావజాలంతో రాసినప్పటికీ దాన్ని వదిలించుకున్న  తరవాత దృక్పథ సమస్య ఏర్పడలేదు. కథ ప్రారంభానికి ప్లాను అంటూ ఉండదు. ఏక్ దమ్ న మొదలుపెట్టడమే.  మొదలు పెట్టింది కథ అవుతుందని అనుకున్నాకే మొదలు పెడతాను. కొన్నిసార్లు ముగింపు నా చేతిలో ఉండదు. కథా రచనలో నేను ఆద్యంతం తరచి చూసుకునేది నేను రాసినది సహజంగా ఉందా లేదా అన్నది మాత్రమే. 

నేను కొత్త కోణంలో చూస్తున్నానని నాకూ తెలియదు. కథ పూర్తయ్యాక దాని నిర్మాణంలో సమతుల్యత, బాలెన్స్ మాత్రం ఒకసారి చూసుకుంటాను. అన్ని రకాలుగా అది ఆర్ట్ పీస్ లా ఉంది అనుకుంటే సంతృప్తి. చూడటం అనేది నాకు తెలిసింది ఒకటే. మన గమనింపులే మనం ఎన్నుకునే అంశాలు. కొందరికి కొన్నిటిమీద దృష్టి పోతుంది. మరికొందరికి పోదు. అంతా మన ఎంపిక అనుకుంటాను. సాధారణంగా రచయితలు అందరూ  ఈ గమనింపు చేస్తారనే అనుకుంటాను. 

6. మీ కథలు పుస్తకంగా రావడానికి చాలా ఆలస్యం చేసారెందుకు?

పుస్తకం తేవడంలో ఒక ప్లాన్ అంటూ ఏమీ ఫాలో కాలేదు. జరుగుతున్నది జరగనిచ్చాను అంతే. మొదటి సంకలనంలో వేయకుండా మిగిలిన కథలను ఇప్పుడు వచ్చిన గాలి పొరలు పుస్తకంలో చేర్చాను. రాసిన వాటికంటే రాయకుండా వదిలేసినవి, రాయాల్సినవి నన్ను చీకట్లో కొండల్లా భయపెడుతుంటాయి.  రాసినవాటిని పత్రికలోనో , పుస్తకంగా వచ్చాకనో  మళ్ళీ మళ్ళీ చదవను. అది నాకు చాలా కష్టమైన పని. 

7. మొదటిగా రాసిన కథ ఇప్పటివరకూ వచ్చిన రెండు పుస్తకాల్లో ఉందా?

ఒకానొక గడ్డురోజుల్లో 'మరుభూమి' అనే కథను రాసాను. రచయితగా అదే నా మొదటి కథగా భావిస్తాను.  ఒక రకంగా చూస్తే కథలో ఉండాల్సిన లోపాలన్ని  అందులో కనిపిస్తాయి. నా చిన్ననాటి మిత్రులు చాలామందికి ఇప్పటికీ అది మంచి కథగానే చూస్తారు. కొంతమందికి బాగా నచ్చింది. ఏది  ఎలా ఉన్నా నా మొదటి కథ కాబట్టి ఒక జ్ఞాపకంగా నా లోయ కథల సంకలనంలో కథని ప్రచురించాను. నాకు బాగా గుర్తున్న విషయం ఆ కథ కంటే దానిని రాసిన మూడ్ చాలా చిత్రమైంది. మొదలు పెట్టిన అరగంటలో పూర్తి చేశాను. ఆ కథ రాసేటప్పుడు నా మీద పొలిటికల్ influence ఉందేమో అనిపిస్తది. సాధారణంగా అలాంటి కథలకు ఒక ఉన్మత్తత అవసరం లేదు. Conscious గా రాసుకుపోవచ్చు. కానీ అది రాసేటప్పుడు కూడా నన్నేదో ఆవహించినట్లు వేగంగా రాసేసాను.

8. జీవితం మిగిల్చిన తీపి, చేదుల జీవితపు ఆస్వాదనలే మీ కథలకు ఊతాలు అనవచ్చా?

నా కథల్లో కేవలం నా జీవితమే ఉండదు. ఆర్ట్ పీస్ లా అనిపించిన విషయాన్ని నేను కథగా మలచడానికి ప్రయత్నిస్తాను. అందులో కొన్నిసార్లు నా జీవితం ఉండొచ్చు. కొన్నిసార్లు నేను చూసిన బాహ్య జీవితం కూడా కావొచ్చు. నా గురించే చెప్పుకోవాలనే పట్టింపులు నాకు లేవు. కథను ఎంచుకోవడంలో కథకుడి కళాత్మక నైపుణ్యం ఉంటుంది అనేది నా అభిప్రాయం. 

9. కథను చెప్పే తీరులో మీకంటూ ఓ ప్రత్యేకమైన శైలి ఉంది.. దానికి స్పూర్తిగా నిలిచిన రచయితలు ఎవరైనా ఉన్నారా?

కథను నాకు తోచినట్లు రాయడమే నేను చేసే పని. ఒక శైలి అనుకుంటూ రాసింది ఎప్పుడూ లేదు. ఇన్ని కథలు ఒక దగ్గరకు చేరాక మీరనే  శైలి ఏమన్నా కనపడుతుందేమో. రాసేటప్పుడు దానిమీద నాకెప్పుడూ ఆసక్తి లేదు. పైగా నాకు తెలిసిన స్పష్టమైన విషయం ఏమంటే నా  కథలన్నీ ఒకేలా ఉండవు. ఒకదానికొకటి పొంతన ఉండదు. వాటి మధ్య ఖాళీలు కనిపిస్తాయి. ఆ ఖాళీలని నింపగలిగేంత విస్తృతంగా రాయడానికి నా జీవితం వెసులుబాటు ఇవ్వలేదు. నేనింకా ఎక్కువ రాసి ఉండాల్సింది. ఇష్టమైన వర్తమాన కథకులు చాలామందే ఉన్నారు.  నచ్చిన వాళ్ళ కథల్ని చదువుకుంటూ ఆనందిస్తాను. స్ఫూర్తి అంటూ ఏమీ లేదు. ఎవరి ధోరణి వారిదే.  

10. కథ రాయాలి అనుకున్నాకా.. ఆలోచనలు కథగా మారే ముందు వాక్యాలతో మీ సాధన ఎలా ఉంటుంది. 

కథ రాయాలి అనుకున్నాక ముందుగా చేసుకునే ప్రిపరేషన్ ఏమీ ఉండదు. రాయడం మొదలుపెడితే బరబరా రాసుకుపోవడమే. అలా రాసేటప్పుడే రాయడంలో ఉండే మజా తెలుస్తుంది. కథ ప్రచురించినప్పుడో, ఇతరులు మెచ్చుకున్నప్పుడో కలిగేసంతోషం దానిముందు దిగదుడుపు. పైగా రాసేటప్పుడు అనేక కొత్త దారులు ఏర్పడతాయి. కథ రాయడం ఒక గొయ్యి తవ్వుకుంటా పోవడమో, నీళ్లలో పారవశ్యంతో ఈదుతా పోవడమో  అనిపిస్తది. వాక్య నిర్మాణంలో నేను చాలా పూర్ అనుకుంటా. నాకు తెలిసింది వచ్చింది వచ్చినట్లు రాసుకుంటా పోవడమే. 

11. మీ కథలన్నీ మరీ బాధల్లో కొట్టుమిట్టాడుతున్నవే అనిపిస్తాయి. మనిషి జీవితపు చక్రంలో బంధీని చేసేయానే దిగులుతో నిండిపోయి.. మసకబారిన కోణాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తాయి. దీనికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా..?

లేని విషాదాన్ని తెచ్చిపెట్టింది ఏమీ లేదు. జీవితంలో విషాదం తెలియనివాడు అదృష్టవంతుడు. సుఖజీవి. అది తెలిసినవాడు ఒంటరి.  నాకున్న జ్ఞాపకశక్తి ఒక శాపం లాంటిది కూడా. . నాకు బాగా దగ్గరయిన వారి అకాల మరణాలు దగ్గరనుంచి చూసాను. నా భార్య, నా అన్నయ్య, నా స్నేహితుడు. మరణం కంటే దానికి ముందూ తరవాత జరిగిన జ్ఞాపకాలు నన్ను బాగా వెంటాడతాయి. నా భార్య మరణం తరవాత నా కొడుకు వాళ్ళమ్మమ్మ దగ్గర ఉండిపోయాడు. వాడి ఎడబాటు నన్ను నిరంతరం వెంటాడుతుంటుంది.  అంతే కాకుండా  దైనందిన జీవితంలో నేను చూసే మనుషుల అశక్తత అభద్రత నన్ను బాధిస్తాయి. ఈ విచారమంతా నాకు తెలీకుండా నా కథల్లో ప్రవహించిందేమో నాకూ తెలీదు. నేను రాసిన కథల్లో పుట్టెడు దుఃఖమూ బరువూ బాధా ఉన్నాయంటే నేనేమి చేయలేను. అదంతా అలా వచ్చింది. 

12. మీ కథల్లో తత్విక చింతన ఎక్కువగా కనిపిస్తుంది. అటు వైపు మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలేమిటి?

అవును. మొదటిలోనే  నా కథల్లో తాత్విక  చింతన ఉందని కొందరు అన్నారు. ఆ ముద్రని అంతగా ఇష్టపడను. అందరి కథల్లోనూ ఏదో ఒక తాత్విక ప్రతిపాదన ఉంటుందని నాకు అనిపిస్తుంది. 

13. రచనలపై ఎవరైనా సలహాలను ఇస్తే పాటిస్తారా? మీ కథలపై సలహాలు ఇచ్చిన వారున్నారా?

కథ రాసాక ఇద్దరు ముగ్గురు స్నేహితులకు చూపిస్తాను. ఇద్దరు కథకులు మెహెర్, పూడూరి రాజిరెడ్డిలతో కలిసి మా వాట్సాప్ గ్రూప్ లో  చర్చించుకుంటాం. ఎదుటివాళ్ళు చెప్పిన గమనింపులు, లోపాలు నచ్చితే సరిదిద్దుకుంటాం. నా చిన్ననాటి స్నేహితుడు కాకుమాని శ్రీనివాసరావు నా ప్రతి కథను చదివి లోటుపాట్లు చెబుతుంటాడు. అతడి తోడ్పాటు లేనిదే కథకుడిగా నేను లేను. 

_ శ్రీశాంతి మెహెర్.

Updated Date - 2022-12-22T14:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising