ఈ పెళ్లి ప్రపోజల్ చూసి అమ్మాయిలు క్యూ కడతారేమో
ABN, First Publish Date - 2022-11-13T14:33:51+05:30
నాకు భార్య కావాలంటూ ప్రకటన ఇచ్చాడు
ఓ వ్యక్తి మొన్నటివరకు ఓ ఉక్కు కర్మాగారంలో వర్కర్ గా పనిచేసేవాడు. అతను కొన్న లాటరీ టిక్కెట్‌కు అదృష్టవశాత్తు జాక్‌పాట్ తగిలింది. ఒకటా.. రెండా ఏకంగా రూ.81కోట్లు అతడి అకౌంట్లోకి వచ్చి పడ్డాయి. డబ్బుల లోకం కదా.. బీరకాయ పీచు సంబంధాల పేరుతో అందరూ అతన్ని అప్రోచ్ అయ్యి డబ్బులు అడగసాగారు. అయితే మనుషుల స్వభావం బాగా తెలిసిన అతను వాళ్ళందరినీ ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాడు. కానీ ఎటొచ్చి అతన్ని ఒంటరితనం వేధిస్తోందట. అందుకనే నాకు భార్య కావాలంటూ ప్రకటన ఇచ్చాడు. ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
జర్మనీకి చెందిన కుర్సత్ అనే 41 సంవత్సరాల వ్యక్తికి రూ.81 కోట్ల లాటరీ తగిలింది. ఆ తరువాత చేస్తున్న ఉద్యోగాన్ని అతడు మానేశాడు. రెండు కార్లు, విలువైన వస్తువులు, తనకు ఇష్టమైన మద్యం కొనుక్కున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రకటన విడుదల చేశాడు. అందులో ఏముందంటే... 'జీవితాంతం నాతో కలిసి ప్రయాణించడానికి, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక యువతి కావాలి. నా జీవితంలోకి వచ్చే అమ్మాయిని బాగా చూసుకుంటాను. డబ్బులు భద్రంగా ఉన్నాయి. మొన్నటివరకు వాళ్ళెవరో నేనెవరో అన్నట్టున్న వాళ్ళందరూ ఇప్పుడు నాదగ్గరకు వస్తున్నారు. కానీ నాకు తెలుసు వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారో. నేను ఎక్కడి నుండి వచ్చాను అనే విషయాన్ని అసలు మరిచిపోను. ఇప్పుడు తొంబైశాతం మంది నా విషయంలో అసూయ పడుతున్నారు. అలాంటి వాళ్ళను ఆదరించడానికి నాకు అంత పెద్ద మనసు లేదు' అంటూ అని పేర్కొన్నాడు.
ఈ క్రమంలో కొందరు అతడిపై విమర్శలు చేస్తున్నారు. ‘డబ్బు మీద అంత ఆశ లేకపోతే విలాసవంతమైన కార్లు ఎందుకు కొన్నావు’ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో వాటికి అతడు ఇలా బదులిచ్చాడు.. 'అవి నేను అవసరం కోసమో, ఇష్టంతోనో కొన్నవి కాదు. నన్ను చూసి ఎగతాళి చేసినవారు, నా దగ్గర డబ్బు రాగానే నా నీడన చేరడానికి ప్రయత్నించి.. నన్ను మోసం చేయాలని అనుకున్నవారు.. అసూయపడాలనే ఉద్దేశంతో కొన్నాను అంతే. నాకు వచ్చిన డబ్బులో నా తల్లిదండ్రులకు, నా సోదరులకు భాగం పంచాను’ అని అని పేర్కొన్నాడు. అంతేకాదు.. తన దగ్గరున్న డబ్బుతో మేకవన్నె పులులకు సహాయం చేయడం కంటే.. ఆఫ్రికా అడవులకు వెళ్ళి అక్కడి ప్రజల కోసం బావులు తవ్వి వారికి నీటి వసతి కల్పించడం.. అక్కడి పిల్లలకు బహుమతులు పంచిపెట్టి వారిని సంతోషపెట్టడమే తనకు ఇష్టమని వెల్లడించాడు. ఈ క్రమంలో అతడి మాటలు చాలా నిజాయితీగా ఉన్నాయని కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్‌కు అమ్మాయి తొందరగానే దొరకచ్చు. మరి అంత డబ్బు చూసి ఎవరు మాత్రం ఆగుతారు.
Updated Date - 2022-11-13T14:33:53+05:30 IST