మహిళ చేతిమీద మొలిచిన ముక్కు.. ముక్కునవేలేసుకుంటున్న నెటిజన్లు.. దీని కథ ఏంటంటే..
ABN, First Publish Date - 2022-11-12T11:14:22+05:30
ఇది ఫేక్ న్యూస్ కాదు, పిల్లాట లాంటి పని అంతకన్నా కాదు. ఓ మహిళ నిజంగానే తన చేతిమీద ముక్కును పెంచుకుంది.
చూడగానే ఇదేదో ఫేక్ న్యూస్ అని కొందరు, అదేమీ ఉండదు అక్కడేదో బొమ్మ గీసుకుని ఇలా న్యూస్ క్రియేట్ చేసి ఉంటారని కొందరు అనుకుంటారు. కానీ ఇది ఫేక్ న్యూస్ కాదు, పిల్లాట లాంటి పని అంతకన్నా కాదు. ఓ మహిళ నిజంగానే తన చేతిమీద ముక్కును పెంచుకుంది. అదెలా సాధ్యం అని అంటారేమో అంతా.. వైద్యుల ప్రయత్నం వల్ల ఇది సాధ్యమైంది. ఉన్న ముక్కును కాదని మళ్ళీ చేతిమీద ముక్కు పెంచుకోవడమేంటి అని బుగ్గలు నొక్కుకునేవారు ఉండనే ఉంటారు. అలాంటి వారి సందేహాలకు, ప్రశ్నలకు ఇదిగో సమాధానం.
ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక మహిళ నాసికా కుహుర క్యాన్సర్ తో ఇబ్బంది పడుతూ వైద్యులను ఆశ్రయించింది. వైధ్యులు ఆమె పరిస్థితి గమనించి ఆమెకు రేడియోథెరపీ, కీమోథెరపీ చికిత్స అందించారు. అయితే ఈ చికిత్స విజయవంతం కాలేదు. ఈ చికిత్సల వల్ల ఆమె తన ముక్కు ఆకారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దాంతో వైద్యులు ఆమె ముక్కును మునుపటిలా మార్చేందుకు వివిధ చికిత్సలతో తీవ్రంగానే శ్రమించారు. కానీ, వారు వాటిల్లో పూర్తిగా విఫలం అయ్యారు. అప్పుడే వైద్యులు వైద్యరంగంలో ఉన్న టెక్నాలజీ ఉపయోగించి సదరు మహిళ చేతిమీద ముక్కును సృష్టించారు. దీనికోసం మృదులాస్థి స్థానంలో త్రీడీ ప్రింట్ బయోమెటీరియల్ ఉపయోగించడంతో పాటు దానికి ఆమె కణతి భాగం నుండి చర్మాన్ని సేకరించి అమర్చారు. వీరి ఫ్రయత్నం ఫలించి మహిళ చెయ్యి మీద ముక్కు మొలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
Updated Date - 2022-11-12T11:18:23+05:30 IST