Super Star Krishna: అసలు పేరు ‘శివరామకృష్ణమూర్తి’ వెనుక ఉన్న కథ ఇదే!
ABN, First Publish Date - 2022-11-15T20:44:57+05:30
తెనాలి (Tenali)కి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది బుర్రిపాలెం (Burripalem) గ్రామం. అక్కడే ఉండే ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు ప్రథమ సంతానం కృష్ణ (Krishna). తెనాలిలో డాక్టర్ సుందరరామయ్య హాస్పిటల్‌లో..
తెనాలి (Tenali)కి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది బుర్రిపాలెం (Burripalem) గ్రామం. అక్కడే ఉండే ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు ప్రథమ సంతానం కృష్ణ (Krishna). తెనాలిలో డాక్టర్ సుందరరామయ్య హాస్పిటల్‌లో 1943 మే 31 మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు జన్మించారాయన. కృష్ణ పుట్టిన 38వ రోజున తీవ్రమైన జ్వరం రావడంతో సుందరరామయ్య హాస్పిటల్‌కి మళ్లీ తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు స్పృహ లేకుండా ప్రమాదకర పరిస్థితిలో ఉన్న ‘చిన్నారి’ కృష్ణను మళ్లీ మామూలు స్థితికి తీసుకురాగలిగారు సుందరరామయ్య (Sundara Ramayya).
పెళ్లయిన చాలా కాలానికి అంటే తన 28వ ఏట తల్లయ్యారు నాగరత్నమ్మ. బిడ్డ పుట్టిన 27వ రోజున ‘శివరామకృష్ణమూర్తి’(Siva Rama Krishnamurthy) అని పెద్దల సమక్షంలో బారసాల జరిపి, నామకరణం చేశారు. ఆయన పేరులో శివ, రామ, కృష్ణ అని ముగ్గురు దేవుళ్లు ఉండటానికి వెనుక చిన్న కథ ఉంది. చాలా కాలం వరకూ సంతానం కలగకపోవడంతో నాగరత్నమ్మ ఎన్నో పూజలు చేశారు. అలాగే పెదకాకాని గుడిలో సాంబశివుడికి ప్రదక్షిణలు చేయడం వల్ల ఆయన వరప్రసాదంగా భావించి ‘శివ’ అని, కృష్ణ తాతగారు రామయ్య (Ramayya) పేరు కలిసేటట్లుగా ‘రామ’ అని, నాగరత్నమ్మ కృష్ణతులసి పూజలు చేస్తున్న సమయంలో పుట్టడం వల్ల ‘కృష్ణమూర్తి’ అని ఈ మూడూ కలిసి వచ్చేలా ఆ పేరు పెట్టారు. ఇంత పెద్ద పేరుని కుదించి, ‘కృష్ణ’గా కొత్త నామకరణం చేసి, ‘తేనెమనసులు’ (Thene Manasulu) చిత్రంతో హీరోగా పరిచయం చేశారు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు (Adurthi Subba Rao). ఆ తర్వాత ఆయన సూపర్ స్టార్ కృష్ణగా ఎలా మారారో అందరికీ తెలిసిందే.
-వినాయకరావు
Updated Date - 2022-11-16T05:14:49+05:30 IST