భర్తకు విడాకులిచ్చి మరీ బీటెక్ పూర్తి.. మూడు కంపెనీల ఆఫర్లను రిజెక్ట్ చేసి.. 25 ఏళ్ల వయసులోనే..
ABN, First Publish Date - 2022-12-21T13:04:40+05:30
పనిమనిషిగా చేసి డబ్బు సంపాదిస్తూ ...
ఆ అమ్మాయి 8వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రుల ఆర్థిక స్థితి కారణంగా ఆమెకు పెళ్ళి చేసారు. అప్పటిదాకా చదువులో మునిగిపోయిన పిల్లకు బాల్యవివాహం చెప్పలేనంత అడ్డంకిగా మారింది. అత్తమామలు చదువు విషయంలో ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారు. ఎంతో బాగా చదువుతున్న పిల్ల పుస్తకాలను వదిలిపెట్టాలంటే విలవిలలాడిపోయింది. జీవితంలో చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఆమెను పాతికేళ్ల వయసులో గర్వంగా తలెత్తుకునేలా చేస్తోంది. కాకినాడకు చెందిన ఆదిలక్ష్మి ఇక జీవితమైపోయిందని అనుకోకుండా విజేతగా ఎదిగిన వైనం గురించి తెలుసుకుంటే..
కాకినాడకు చెందిన ఆదిలక్ష్మి చాలా బీద కుటుంబంలో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు ఆమెను ఎన్నారై కంభంపాటి సుశీలా దేవి స్థాపించిన స్కూల్ లో చేర్పించారు. ఆ స్కూల్ పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తుంది. అయితే ఆదిలక్ష్మి తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థితి కారణంగా ఆదిలక్ష్మికి 8వ తరగతిలోనే పెళ్ళి చేసారు. పెళ్ళి తరువాత చదువు కొనసాగించడానికి ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు ఎదుర్కుంది. చదువుకోవద్దంటూ అత్తమామలు, భర్త ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు సహకరించడంతో తనను చదువుకోవద్దని ఇబ్బంది పెడుతున్న భర్తకు విడాకులు ఇచ్చేసింది. విడాకుల తరువాత తనకు చదువు విషయంలో పూర్తి స్వేచ్చ లభించడంతో పనిమనిషిగా చేసి డబ్బు సంపాదిస్తూ ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. ఇంటర్ అవ్వగానే కాకినాడలో ఉన్న ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిలో బి.టెక్ లో జాయిన్ అయ్యి విజయవంతంగా పూర్తిచేసింది. ఇంగ్లీషు విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా స్నేహితుల సహాయంతో వాటన్నిటినీ అధిగమించింది.
ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత క్యాంపస్ సెలక్షన్స్ లో మూడు కంపెనీలు ఆదిలక్ష్మికి జాబ్ ఆఫర్ ఇచ్చాయి. కానీ ఆమె వాటిని సున్నితంగా తిరస్కరించి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఎక్సామ్ కు ప్రిపేర్ అయ్యి అందులో క్వాలిఫై అయ్యింది. దీని ఫలితంగా ఇండో-టిబెట్ పోలీస్ ఫోర్స్ కు ఎంపికయ్యింది.
పనిమనిషిగా పనిచేస్తూ చదువుకున్న ఈ అమ్మాయి పాతికేళ్ళ వయసులో పోలీస్ ఫోర్స్ కు ఎంపిక అయినా ఇదే నా లక్ష్యం కాదు, నేను సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయంటూ చెబుతోంది. బాల్యవివాహాల వల్ల ఎంతోమంది ఆడపిల్లలు మెరుగైన భవిష్యత్తుకు దూరమవుతున్నారని, దాన్ని అరికట్టాల్సిన భాద్యత అందరిమీదా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అనే మాటను తను ఆచరణలో చూపించిన ఆదిలక్ష్మిని ఇప్పుడు మహిళా లోకం ఆదిలక్ష్మి నమోస్తుతే.. అని స్థుతించాలి. ఆమె విజయాన్ని అభినందించాలి.
Updated Date - 2022-12-21T13:04:42+05:30 IST