T20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు బద్దలుగొట్టిన 18 ఏళ్ల యువ క్రికెటర్
ABN, First Publish Date - 2022-07-27T02:35:16+05:30
ఫ్రాన్స్‌కు చెందిన 18 ఏళ్ల యువ క్రికెటర్ గుస్తావ్ మెక్‌కియోన్ టీ20ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన 18 ఏళ్ల యువ క్రికెటర్ గుస్తావ్ మెక్‌కియోన్ (Gustav Mckeon) టీ20ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత పిన్నవయసులోనే సెంచరీ సాధించిన బ్యాటర్‌గా అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ఫిన్లాండ్‌లోని వంటాలో స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లోనే 109 పరుగులతో మెరుపు శతకం నమోదు చేసిన గుస్తావ్.. టీ20ల్లో అత్యంత పిన్న వయసులోనే శతకం నమోదు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సబ్ రీజినల్ యూరప్ క్వాలిఫయర్స్‌లో గ్రూప్ బి మ్యాచ్‌లో గుస్తావ్ చిచ్చరపిడుగల్లే చెలరేగిపోయాడు. 9 సిక్సర్లు, 5 ఫోర్లతో సెంచరీ బాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఇంతా చేస్తే అతడికి రెండో అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం. అంతకుముందు రోజు అంటే ఈ నెల 24న చెక్ రిపబ్లిక్‌తో జరిగిన అరంగేట్ర మ్యాచ్‌లో 54 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పిన్నవయసు సెంచరీ వీరులు వీరే
తాజా సంచలనం గుస్తావ్ మెక్‌కియోన్ వయసు 18 సంవత్సరాల 280 రోజులు మాత్రమే. అతడి కంటే ముందు 2019లో డెహ్రాడూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హజ్రతుల్లా జాజయ్ 20 సంవత్సరాల 337 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. అదే ఏడాది ఇఫోవ్ కౌంటీలో టర్కీతో జరిగిన మ్యాచ్‌లో రొమేనియా ఆటగాడు శివకుమార్ పెరియల్వార్ 21 ఏళ్ల 161 రోజుల వయసులో శతకం నమోదు చేశాడు. 2021లో కిగాలిలో షీసెల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రువాండా బ్యాటర్ ఆర్చిడ్ టుయిసెంజే సెంచరీ సాధించాడు. అప్పుడతడి వయసు 21 సంవత్సరాల 190 రోజులు. ఈ ఏడాది కఠ్మాండులో మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ క్రికెటర్ దీపేంద్ర సింగ్ అయిరీ 22 సంవత్సరాల 68 ఏళ్ల వయసులో సెంచరీ నమోదు చేశాడు.
Updated Date - 2022-07-27T02:35:16+05:30 IST