Umran malik: ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రంపై అర్షదీప్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ABN, First Publish Date - 2022-11-29T19:44:10+05:30
క్రికెటైనా లేదా ఇతర ఏ క్రీడైనా ఒక కొత్త ఆటగాడికి జట్టులో స్థానం దొరికిందంటే ఇంకెవరో ఆటగాడు చోటు కోల్పోయాడని అర్థం. కొత్త ప్లేయర్ ఎంట్రీతో జట్టు కూర్పులోనూ మార్పులు తప్పకపోవచ్చు.
క్రైస్ట్‌చర్చ్: క్రికెటైనా లేదా ఇతర ఏ క్రీడైనా ఒక కొత్త ఆటగాడికి జట్టులో స్థానం దొరికిందంటే ఇంకెవరో ఆటగాడు చోటు కోల్పోయాడని అర్థం. కొత్త ప్లేయర్ ఎంట్రీతో జట్టు కూర్పులోనూ మార్పులు తప్పకపోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే జట్టులోని పలువురి ఆటగాళ్ల మధ్య పోటీ అనివార్యమవుతుంది. టీమిండియా యువపేసర్లు అర్షదీప్ సింగ్ (Arshdeep Singh), ఉమ్రాన్ మాలిక్‌ల (Umran Malik) పరిస్థితి దాదాపు ఇదే. ఒకరు బంతిని గంటకు 150 కిలోమీటర్లకుపైగా వేగంతో విసరగల స్పీడ్‌స్టార్ కాగా.. మరొకరు 130 కిలోమీటర్ల వేగంతో చక్కటి స్వింగ్ రాబట్టగల సమర్థుడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన ద్వారా ఇద్దరూ న్యూజిలాండ్‌పైనే వన్డేల్లో అరంగేట్రం చేశారు. అలాంటప్పుడు జట్టులో చోటు విషయంలో వీరిద్దరి మధ్య పోటీ తప్పదనే విశ్లేషణలున్నాయి. అయితే ఈ అంచనాలను కొట్టిపారేస్తూ.. ఉమ్రాన్ జట్టులో కొనసాగితే తనకే ప్రయోజనకరమని పేసర్ అర్షదీప్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఉమ్రాన్ మాలిక్‌తో కలిసి బౌలింగ్ చేయడం బావుంటుందని అన్నాడు. ఉమ్రాన్ సరదాగా ఉంటాడు కాబట్టి డ్రెసింగ్ రూమ్ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా బుధవారం న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా (New zealand Vs India) మధ్య మూడవ వన్డేకు ముందు అర్షదీప్ ఈ విధంగా స్పందించాడు.
‘‘ ఉమ్రాన్ గంటకు 155 కిలోమీటర్ల భారీ వేగంతో బంతిని వేస్తాడు. నేను గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బాల్‌ని సంధిస్తాను. ఈ స్పీడ్‌ల మధ్య బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకునేందుకు బాగా ఇబ్బందులు పడతారు. వేగాల మధ్య మార్పులతో బ్యాట్స్‌మెన్ పొరపాటు చేస్తుంటారు. అందుకే ఉమ్రాన్ మాలిక్ జట్టులో ఉంటే నాకు ప్రయోజనకరం. కలిసి బౌలింగ్ చేయడాన్ని ఇద్దరం ఆస్వాదిస్తాం. సుదీర్ఘకాలం ఈ భాగస్వామ్యాన్ని కొనసాగించగలమని అనుకుంటున్నాను’’ అని అర్షదీప్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఇక వ్యక్తిగత ఆట విషయానికి వస్తే టీ20ల్లో మ్యాచ్ ఆరంభంలో అటాక్ చేస్తుంటానని, చివరిలో జాగ్రత్తగా బౌలింగ్ చేస్తుంటానని అర్షదీప్ చెప్పాడు. వన్డేల్లోనూ పెద్దగా మార్పేమీ ఉండదని, ఇదే వైఖరిని అవలంభిస్తుంటానని, బాగా రాణించేందుకు ప్రయత్నిస్తుంటానని వివరించారు.
Updated Date - 2022-11-29T19:44:31+05:30 IST