IND vs ENG: టీమిండియాకు చేదు జ్ఞాపకం.. ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఓకే కానీ మరీ ఇంత దారుణంగానా..!
ABN, First Publish Date - 2022-11-10T16:43:49+05:30
వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. టీమిండియా నిర్దేశించిన పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ ఊదేసింది. 16 ఓవర్లకే టార్గెట్‌ను ఫినిష్ చేసి 170 పరుగులు కొట్టి ఘన విజయాన్ని..
అడిలైడ్ ఓవల్: వరల్డ్ కప్ సెమీస్‌లో (T20 World Cup) టీమిండియా ఇంగ్లండ్ (IND vs ENG) చేతిలో ఘోర ఓటమి పాలైంది. టీమిండియా నిర్దేశించిన 169 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ (England Win) ఊదేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 16 ఓవర్లకే టార్గెట్‌ను ఫినిష్ చేసి 170 పరుగులు కొట్టి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం నాడు జరిగే ఫైనల్‌లో (T20 Final) పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ (PAK vs ENG) తలపడనుంది. టీమిండియా ఈ ఓటమితో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. ఈ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు కనీవినీ ఎరుగని రీతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లండ్ చేతిలో టీమిండియా చావు దెబ్బ తిన్నదని చెప్పక తప్పదు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా టీమిండియా నిర్దేశించిన 169 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ ముగించడం టీమిండియా అభిమానులకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది.
వరల్డ్ కప్ నుంచి చావు తప్పి కన్ను లొట్టపోయిన స్థితిలో టీమిండియా నిష్క్రమించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలిచి పాకిస్థాన్‌తో ఫైనల్‌లో తలపడాలని భావించిన టీమిండియా అభిమానుల ఆకాంక్షను అలెక్స్ హేల్స్, జాస్ బట్లర్ ఆవిరి చేశారు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగారు. ఆ బౌలర్, ఈ బౌలర్ అని తేడా లేకుండా భీకర షాట్లతో ఊచకోత కోశారు.
అలెక్స్ హేల్స్, బట్లర్ కొట్టిన సిక్స్‌లు, ఫోర్లతో అడిలైడ్ దద్ధరిల్లిపోయింది. జాస్ బట్లర్ 49 బంతుల్లో 3 సిక్స్‌లు, 9 ఫోర్లతో 80 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, అలెక్స్ హేల్స్ 47 బంతుల్లో 7 సిక్స్‌లు, 4 ఫోర్లతో టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించి నాటౌట్‌గా నిలిచాడు. సరైన ఓపెనింగ్ భాగస్వామ్యం ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఈ ఇద్దరూ కళ్లకు కట్టినట్టు చూపించారు. టీమిండియా ఓపెనర్లు ఇద్దరూ కీలక మ్యాచ్‌లో నిరాశపరిచారు. కేఎల్ రాహుల్‌పై టీమిండియా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ సాక్షిగా అతనిపై తీవ్ర విమర్శలకు దిగారు. అతనిని టీమిండియా నుంచే పక్కన పెట్టేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో కేవలం 5 పరుగులకే చేతులెత్తేశాడు. రోహిత్ శర్మ కూడా 27 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. కోహ్లీ 50 పరుగులతో, హార్థిక్ పాండ్యా 63 పరుగులతో.. చెరో అర్ధ సెంచరీతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. సూర్య కుమార్ యాదవ్ (14) కూడా దూకుడుగా మొదలుపెట్టి అంతే త్వరగా పెవిలియన్ బాట పట్టాడు.
ఇక.. టీమిండియా బౌలర్లనైతే బట్లర్, హేల్స్ ఉతికారేశారని చెప్పక తప్పదు. షమీ బౌలింగ్ చేసిన 3 ఓవర్లలోనే 39 పరుగులు పిండుకున్నారు. హార్థిక్ పాండ్యా 3 ఓవర్లలో 34 పరుగులు, అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 30 పరుగులు, భువనేశ్వర్ బౌలింగ్ చేసిన 2 ఓవర్లకే 25 పరుగులు, అశ్విన్ బౌలింగ్ చేసిన 2 ఓవర్లకే 27 పరుగులను టీమిండియా బౌలర్లు సమర్పించుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్ 2 ఓవర్లకు 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లతో రాణించగా, అడిల్ రషీద్, క్రిస్ వోక్స్‌కు చెరో వికెట్ దక్కింది.
Updated Date - 2022-11-10T17:56:01+05:30 IST