England: న్యూజిలాండ్‌ను ఓడించి సెకండ్ ప్లేస్‌కు ఇంగ్లండ్
ABN, First Publish Date - 2022-11-01T17:30:30+05:30
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 20 పరుగులతో విజయం సాధించి గ్రూప్
బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 20 పరుగులతో విజయం సాధించి గ్రూప్-1లో రెండో స్థానానికి చేరుకుంది. కెప్టెన్ జోస్ బట్లర్ (73) వీర విహారంతో ఇంగ్లండ్ (England) తొలుత 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ (Kiwis) బాగానే పోరాడినప్పటికీ చివరల్లో చకచకా వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడి పెరిగిపోయి ఓటమి పాలైంది. 119/3తో జట్టు బలంగా ఉన్న సమయంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (40) అవుట్ కావడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. ఊపుమీదున్న గ్లెన్ ఫిలిప్స్ క్రీజులో ఉండడంతో బ్లాక్‌క్యాప్స్ అభిమానుల్లో ఏమూలో ఆశ ఉంది. 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేసిన ఫిలిప్స్ 135 పరుగుల వద్ద అవుటయ్యాక మ్యాచ్ ఇంగ్లండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. మిచెల్ శాంట్నర్ 10 బంతుల్లో సిక్సర్‌తో 16 పరుగులు చేసినప్పటికీ అప్పటికే సమయం మించిపోయింది. చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ ధాటిగా ఆడడంలో విఫలమైన న్యూజిలాండ్ మూల్యం చెల్లించుకుంది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, శామ్ కరన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్లు జోస్ బట్లర్, హేల్స్ ఇద్దరూ క్రీజులో పాతుకుపోయి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. బట్లర్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, హేల్స్ 40 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీ (52) పరుగులు చేశాడు. లివింగ్ స్టోన్ 20 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ గ్రూప్-1లో మెరుగైన రన్‌రేట్ కారణంగా రెండో స్థానానికి ఎగబాకింది. ఆ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. ఓడినప్పటికీ న్యూజిలాండ్ మాత్రం అగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలేయా.. మూడు జట్లు 5 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ రన్‌రేట్ కారణంగా వరుసగా ఒకటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
Updated Date - 2022-11-01T17:30:45+05:30 IST