Fifa World Cup: ఆరంభం.. అంగరంగ వైభవం..
ABN, First Publish Date - 2022-11-21T02:58:28+05:30
ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన సాకర్ వరల్డ్ కప్ ప్రారంభోత్సవం ఆదివారం రాత్రి అంగరంగవైభవంగా జరిగింది.
ఘనంగా ఫిఫా ప్రపంచ కప్ వేడుకలు
దోహా: ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన సాకర్ వరల్డ్ కప్ ప్రారంభోత్సవం ఆదివారం రాత్రి అంగరంగవైభవంగా జరిగింది. ఖతార్ సంస్కృతి సంప్రదాయలను ప్రతిబింబిస్తూ, గత ప్రపంచ కప్‌లను అవలోకిస్తూ, ఆధునిక తరాన్ని ఆకట్టుకొనేలా సాగిన కార్యక్రమాలు 60వేల మందితో కిక్కిరిసిన అల్ బయత్ స్టేడియాన్ని ఉర్రూతలూగించాయి. సౌత్‌కొరియా పాప్ సింగర్ జుంగ్ కూక్ మొత్తం కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఐక్యత గొప్పతనాన్ని అమెరికా దిగ్గజ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ తన కంచు కంఠంతో వేడుకలకు తెరలేచింది. ఎర్రని దస్తుల్లో మెరిసిపోతున్న కళాకారిణుల నృత్య ప్రదర్శనల నడుమ వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న దేశాల జెండాలు స్టేడియంలో ప్రవేశించాయి. ‘ప్లీజ్ డోన్ట్ టేక్ మి హోమ్’, ‘ఓలే..ఓలే..ఓలే’ అన్న పాటలకు ఫ్యాన్స్ మైమరిచిపోగా.. పాప్ సింగర్ జుంగ్ కూక్ తన పాటలతో, స్టెప్పులతో అలరించాడు.
ప్రేక్షకులు చప్పట్లతో పెద్దఎత్తున స్వాగతించగా వేదికపైకి వచ్చిన ఖతార్ సింగర్ ఫహద్ అల్ కుబైసే, జుంగ్‌తో కలిసి టోర్నీ గీతం ‘డ్రీమర్స్’ను ఆలపించాడు. ఈ కార్యక్రమాల మధ్యనే గత ప్రపంచ కప్‌ల మస్కట్‌లు వరుసగా స్టేడియంలో అడుగుపెట్టాయి. ఖతార్ అధికారి ఒకరు స్వాగతం పలుకుతూ టోర్నమెంట్ ఆరంభమైనట్టు అరబిక్‌లో ప్రకటించారు. కార్యక్రమంలో ఖతార్ రాజకుటుంబం, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్‌బిన్ రషీద్, సౌదీ యువరాజు మమహ్మద్‌బిన్ సల్మాన్, ఫిఫా చీఫ్ ఇన్‌ఫాంటినో పాల్గొన్నారు.
ఈక్వెడార్ శుభారంభం
ఎన్నర్ వేలన్సియా డబుల్ ధమాకాతో.. ఫిఫా వరల్డ్‌క్‌పలో ఈక్వెడార్ జట్టు బోణీ చేసింది. గ్రూప్-ఎలో ఆదివారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఈక్వెడార్ 2-0తో ఆతిథ్య ఖతార్‌ను ఓడించింది. వేలన్సియా (16వ, 31వ) రెండు గోల్స్ సాధించాడు. కాగా, 92 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఆతిథ్య దేశం తమ తొలి మ్యాచ్‌లో ఓడిన దాఖలాలు లేకపోయినా.. ఇప్పుడు ఖతార్ ఆ చెత్త రికార్డును మూటగట్టుకొంది. తొలిసారి మెగా కప్ ఆడుతున్న ఖతార్‌కు ఇది నిజంగా చేదు అనుభవమే.
Updated Date - 2022-11-21T03:27:38+05:30 IST