FIFA World Cup: 92 ఏళ్లలో తొలిసారి.. ఫిఫా ప్రపంచకప్‌లో అరుదైన దృశ్యం
ABN, First Publish Date - 2022-12-02T19:00:52+05:30
ఫిఫా ప్రపంచకప్(FIFA World Cup)లో భాగంగా జర్మనీ-కోస్టారికా మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది
ఖతర్: ఫిఫా ప్రపంచకప్(FIFA World Cup)లో భాగంగా జర్మనీ-కోస్టారికా మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ మ్యాచ్‌లో కోస్టారికాను జర్మనీ 4-2 తేడాతో ఓడించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే ఈ మ్యాచ్ రికార్డు సృష్టించింది. జర్మనీ-కోస్టారికా మధ్య జరిగిన మ్యాచ్‌కు పూర్తిగా మహిళలే రిఫరీలుగా వ్యవహరించారు. ఓ పురుషుల జట్టుకు పూర్తిగా మహిళలే రిఫరీలుగా వ్యవహరించడం 92 సంవత్సరాల ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి.
మ్యాచ్‌కు రిఫరీలుగా వ్యవహరించిన వారిలో ఫ్రాన్స్‌కు చెందిన స్టిఫానీ ఫ్రాపర్ట్ (Stephanie Frappart), మెక్సికోకు చెందిన కరెన్ డియాజ్ (Karen Diaz), బ్రెజిల్‌కు చెందిన న్యూజా బ్యాక్ (Neuza Back) ఉన్నారు. నిజానికి రికార్డులను బ్రేక్ చేయడం ఫాపర్ట్‌కు కొత్తకాదు. 2009లో ఫిఫా క్వాలిఫయిడ్ రిఫరీగా ఎంపికై ఆ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డులకెక్కిన ఫాపర్ట్ (38).. గత వారం మెక్సికో-పోలండ్ మ్యాచ్‌కు రెఫరీగా వ్యవహరించి పురుషుల మ్యాచ్‌కు రెఫరీగా వ్యవహరించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.
అలాగే, అదే ఏడాది లివర్‌పూల్-చెల్సియా మధ్య జరిగిన యూఈఎఫ్ఏ (UEFA) సూపర్ కప్‌కు బాధ్యతలు నిర్వర్తించి పురుషుల యూరోపియన్ మ్యాచ్‌కు అధికారిగా వ్యవహరించిన తొలి మహిళ అయ్యారు. 2020లో చాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా జువెంటస్-డైనమో కీవ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు అఫీషియల్‌గా వ్యవహరించిన తొలి మహిళ కూడా ఫాపర్టే. జర్మనీ-కోస్టారికా మ్యాచ్‌కు ముగ్గురు మహిళలు రెఫరీలుగా వ్యవహరించడంతో ఫోర్త్ రిఫరీ అయిన అమెరికాకు చెందిన కేటీ నెస్‌బిట్ ఆఫ్‌సైడ్ వీడియో అసిస్టెంట్ రిఫరీగా పనిచేశారు.
Updated Date - 2022-12-02T19:20:09+05:30 IST