Kieron Pollard: కీరన్ పొలార్డ్ కీలక నిర్ణయం.. ముంబైఇండియన్స్ ఫ్యాన్స్‌కు కష్టమే మరి..
ABN, First Publish Date - 2022-11-15T15:22:29+05:30
ఐపీఎల్‌లో (IPL) ఆడిన విదేశీ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ముంబై: ఐపీఎల్‌లో (IPL) ఆడిన విదేశీ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌కు ఏకంగా 13 సీజన్లపాటు ప్రాతినిధ్యం వహించిన అతడు ఐపీఎల్‌లో తన కెరియర్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా కొత్త పాత్రలో ఆ జట్టుతోపాటే కొనసాగనున్నాడు. పొలార్డ్ 2010 నుంచి ఏకంగా 13 ఏళ్లపాటు ముంబై ఇండియన్స్‌కి ఆడాడు. 5 ఐపీఎల్ టైటిల్స్, 2 ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్నాడు. ఇంకొన్నాళ్లు ఆడగలిగే సత్తా ఉన్నప్పటికీ ముందే నిర్ణయం తీసుకోవడం కష్టంగా అనిపించిందని పొలార్డ్ చెప్పాడు.
‘‘ ముంబై ఇండియన్స్ జట్టు రూపాంతరం చెందాల్సి ఉందని అర్థం చేసుకున్నాను. ఎక్కువకాలం ముంబైకి ఆడలేకపోతే బయట జట్టుకి ఆడాలి. ఒకవేళ ముంబై ఇండియన్స్‌పైనే ఆడాల్సి వస్తే నన్ను నేను చూసుకోలేను. అందుకే ఎప్పటికీ ముంబై ఇండియన్స్ ప్లేయర్‌గానే మిగిలిపోవాలనుకుంటున్నా. అతిపెద్ద, సక్సెస్‌ఫుల్ జట్టు ముంబై ఇండియన్స్ టీమ్‌కు గత 13 సీజన్లు ఆడడం పట్ల గర్వంగా ఉంది. ఇందుకు కారణమైన జట్టు యాజమాన్యం ముకేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్ అంబానీలకు నా ధన్యవాదాలు. నన్ను ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. మొదటిసారి కలిసినప్పుడు ఉత్త చేతులతో ఆహ్వానించారు. మనమంతా ఒకే ఫ్యామిలీ అని చెప్పారు’’ అని కీరన్ పొలార్డ్ గుర్తుచేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ సక్సెస్‌లో కీరన్ పొలార్డ్ కీలకపాత్ర పోషించాడని నీతా అంబానీ అన్నారు. జీవితాంతం గుర్తుండిపోయే భావోద్వేగాలు పొలార్డ్‌తో ముడిపడి ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.
Updated Date - 2022-11-15T15:23:11+05:30 IST