Year Ender 2022: మెరిసిన మహిళలు.. క్రీడల్లో అద్భుత క్షణాలు!
ABN, First Publish Date - 2022-12-26T18:15:07+05:30
దేశంలో అత్యంత ఎక్కువ మంది ఇష్టపడే, అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రికెట్‌లో ఈ ఏడాది భారత్‌కు అంత కలిసి రాకున్నా.. వివిధ క్రీడాంశాల్లో మన మహిళలు మెరిశారు
దేశంలో అత్యంత ఎక్కువ మంది ఇష్టపడే, అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రికెట్‌లో ఈ ఏడాది భారత్‌కు అంత కలిసి రాకున్నా.. వివిధ క్రీడాంశాల్లో మన మహిళలు మెరిశారు. మువ్వన్నెల పతకాన్ని వినువీధుల్లో రెపరెపలాడించారు. చరిత్ర పుటల్లో తమకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. దేశఖ్యాతిని ఎల్లెడలా చాటారు. ఈ ఏడాది మహిళా క్రికెటర్లకు పెద్ద గౌరవం లభించింది. పురుష క్రికెటర్లతో సమానంగా వారికి కూడా వేతనం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈసారి మహిళా ఐపీఎల్ కూడా జరగబోతోంది. అలాగే, మన మహిళా అథ్లెట్లు అంతర్జాతీయ వేదికలపై అత్యద్భుత ప్రదర్శన చేశారు. చారిత్రాత్మక విజయాలు అందుకున్నారు. అలాంటి 11 మధుర క్షణాలను గుర్తు చేసుకుందాం.
1- మహిళా క్రికెటర్లకు సమాన వేతనం
టీమిండియా మహిళ క్రికెటర్లు (Team India Women Cricketers) ఇకపై పురుష క్రికెటర్లతో సమానంగా వేతనం అందుకోనున్నారు. క్రికెట్‌లో వివక్షను అంతమొందించడంలో భాగంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సమానత్వం అనే నూతన శకానికి బీసీసీఐ నాంది పలికింది. ఇకపై పురుష ఆటగాళ్లానే మహిళలకు కూడా ఇకపై టెస్టులకు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కి 3 లక్షలు మ్యాచ్ ఫీజుగా లభిస్తుంది. బీసీసీఐ కొత్త పే ఈక్విటీ పాలసీ వల్ల పురుష, మహిళా క్రికెటర్ల మధ్య వేతనాల విషయంలో వ్యత్యాసం తగ్గింది.
2. విమెన్ ఐపీఎల్
ఇప్పటి వరకు 15 ఐపీఎల్ సీజన్లు పురుషులకే పరిమితమయ్యాయి. ఈసారి మాత్రం ఐపీఎల్‌కు కొత్త కళ రానుంది. వచ్చే సీజన్‌లో తొలిసారిగా మహిళా ఐపీఎల్(Women IPL) జరగబోతోంది. ఈ మేరకు ఈ ఏడాది 18న బీసీసీఐ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. విమెన్ ఐపీఎల్ (WIPL) వచ్చే ఏడాది మార్చి నుంచి మహిళా ఐపీఎల్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెటర్లకు ఇది మరింత గుర్తింపును తీసుకురానుంది.
3. చరిత్ర సృష్టించిన లాన్ బౌల్స్ జట్టు
భారత మహిళల లాన్ బౌల్స్ జట్టు 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో చారిత్రక విజయాన్ని అందుకుని దేశానికి ఈ విభాగంలో తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. ఆగస్టు 2న జరిగిన ఫైనల్స్‌లో నలుగురు సభ్యుల భారత జట్టు అంచనాలకు మించి రాణించింది. లౌలీ చౌబే, పింకి, రూపా రాణి టిర్కీ, నయన్మోనీ సైకియాతో కూడిన జట్టు దక్షిణాఫ్రికాను 17-0తో ఓడించి అద్భుత విజయాన్ని అందుకుంది. స్వర్ణ పతకం సాధించింది. లాన్‌బౌల్స్ (Lawn Bowls)లో భారత్‌కు ఇది తొలి స్వర్ణ పతకం కావడం గమనార్హం.
4. మీరాబాయి చాను
మీరాబాయి చాను(Mirabai Chanu).. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. 28 ఏళ్ల ఈ వెయిట్ లిఫ్టర్ బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 49 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. ఫలితంగా కామన్వెల్త్‌లో ఈ కేటగిరీలో పసిడి పతకం సాధించిన తొలి భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా రికార్డులకెక్కింది. మొత్తంగా 201 కేజీలు (88+113) కేజీలు ఎత్తి భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. కొలంబియాలో జరుగుతున్నప్రపంచ చాంపియన్‌షిప్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన చాను రజత పతకం సాధించింది.
5. జాతీయ రికార్డును బద్దలుగొట్టిన జ్యోతి యెర్రాజీ
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల జ్యోతి యెర్రాజీ (Jyothy Yarraji) 100 మీటర్ల హర్డిల్స్ రేసును 13 సెకన్లలోనే పూర్తిచేసి రికార్డులకెక్కింది. 61వ నేషనల్ ఓపెన్ అథ్లెట్స్ చాంపియన్‌షిప్‌లో 12.82 సెకన్లలోనే ఆమె ఈ ఘనత సాధించింది. ఈ రికార్డుతో ఆమె గతంలో నెలకొల్పిన తన రికార్డును తానే బద్దలుగొట్టింది.
6. ఐదు స్వర్ణాలతో మను భాకర్
ఇండియన్ ఏస్ షూటర్ మను భాకర్ (Manu Bhaker) నేషనల్ షూటింగ్ కాంపిటిషన్- 2022లో ఐదు స్వర్ణాలు సాధించింది. హర్యానాకు చెందిన 20 ఏళ్ల ఈ ఒలింపియన్ మధ్యప్రదేశ్‌లో జరిగిన నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో జూనియర్ మహిళల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. అంతకుముందు 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లోనూ పలు కేటగిరీల్లో పసిడి పతకాలు అందుకుంది.
7. ఐవోఏ అధ్యక్షురాలిగా పీటీ ఉష
దేశంలోని విజయవంతమైన అథ్లెట్లలో పీటీ ఉష(PT Usha) ఒకరు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) చీఫ్‌గా ఎన్నికయ్యారు. 58 ఏళ్ల ఉష ఐవోఏకు అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా రికార్డులకెక్కారు. ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత, ఒలింపియన్ అయిన ఉష ఐవోఏకు ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఐవోఏకు అధ్యక్షురాలిగా ఎన్నికైన ఉష మరింతోమంది మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు బాటలు వేశారు.
8. యూరోపియన్ ఫుట్‌బాల్‌కు జ్యోతి చౌహాన్, సౌమ్య గుగులోత్
దేశంలో అంతగా ఆదరణకు నోచుకోని క్రీడ ఏదైనా ఉందంటే అది ఫుట్‌బాలే. అలాంటి చోట ఇద్దరు మహిళా ఫుట్‌బాలర్లు జ్యోతి చౌహాన్(Jyothi Chauhan), సౌమ్య గుగులోత్( Soumya Guguloth) యూరోపియన్ ఫుట్‌బాల్ జట్టులో స్థానం సంపాదించారు. 21 ఏళ్ల సౌమ్య, 23 ఏళ్ల జ్యోతి కోల్‌కతాలోని విమెన్ ఇన్ స్పోర్ట్స్ ట్రయౌట్‌లోకి ప్రవేశించారు. అంతేకాదు, వారి కెరియర్‌లోనే అత్యంత ముఖ్యమైన ట్రయల్స్‌లో పాల్గొన్నారు. ఇక్కడ ఐదుగురు అంతర్జాతీయ కోచ్‌లు తమ క్లబ్‌ల కోసం ఆటగాళ్లను నియమించుకుంటారు. ప్రీ సీజన్ కోసం వీరిద్దరూ జడ్ఎన్‌కే డైనమోతో ఒప్పందం కుదర్చుకున్నారు. కుగ్రామల నుంచి వచ్చిన జ్యోతి, సౌమ్య యూరోపియన్ ఫుట్‌బాల్‌కి ప్రవేశించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.
9. రేస్‌వాక్‌లో జాతీయ రికార్డు బద్దలుగొట్టిన మునితా ప్రజాపతి
గుజరాత్‌లో ఈ ఏడాది జరిగిన జాతీయ క్రీడల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మునితా ప్రజాపతి( Munita Prajapati ) స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. 20 కిలోమీటర్ల రేస్‌వాక్‌ను 1:38:28 సమయంలోనే పూర్తిచేసి రికార్డులకెక్కింది.
10. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా మనీషా కల్యాణ్
సైప్రస్‌లోని అపోలోన్ మహిళ ఫుట్‌బాల్ క్లబ్ తరపున ఆడడం ద్వారా భారత్‌కు చెందిన మనీషా కల్యాణ్(Manisha Kalyan) యూఈఎఫ్ఏ (UEFA) యూరోపియన్ మహిళల చాంపియన్‌షిప్‌లో అరంగేట్రం చేసింది. హర్యానాకు చెందిన మనీషా యూఈఎఫ్ఏలో మ్యాచ్‌కు ఎంపిక కావడమే కాకుండా అధికారిక జట్టులో భాగమైన తొలి భారతీయ మహిళా రికార్డు సృష్టించింది.
11. చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్
టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక క్యాప్‌డ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. దేశంలోని అత్యంత విజయవంతమైన మహిళా బ్యాటర్లలో ఒకరైన హర్మన్‌ప్రీత్ కౌర్.. ఆస్ట్రేలియాతో ముంబైలో డిసెంబరు 14న జరిగిన మ్యాచ్‌తో ఈ ఘనత సాధించింది. కౌర్‌కు అది 140వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్.
Updated Date - 2022-12-26T18:27:51+05:30 IST